శ్రావణమాసం.. అందులోనూ ఈ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం… ఇంట్లో పిండి వంటలు ఘుమఘుమలాడటం ఖాయం.. అయితే ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం వెరైటీగా స్వీట్స్, హాట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తినడానికి కూడా ఇంట్లో వాళ్లు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే ఈ వారం స్వీటు హాటు వెరైటీగా ట్రై చేద్దాం…
పులిహోర
కావాల్సిన పదార్థాలు : బియ్యం- అరకిలో, చింతపండు – వంద గ్రా||, ఉప్పు – తగినంత, పసుపు – రెండు చెంచాలు, బెల్లం తురుము – చెంచా, నువ్వుల నూనె – నూటయాభై గ్రా||, ఇంగువ – చెంచా, దనియాలు – రెండు చెంచాలు, నువ్వులు – చెంచా, మెంతులు – రెండు చెంచాలు, కరివేపాకు – పది రెబ్బలు, ఎండుమిర్చి – ఇరవై, ఆవాలు – రెండు చెంచాలు, మినప్పప్పు – చెంచా, శెనగపప్పు – చెంచా, పల్లీలు – నాలుగు చెంచాలు
తయారు చేసే విధానం : బియ్యం పొడిపొడిగా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. చింతపండుని ముందే నానబెట్టి గుజ్జు పిండి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో దనియాలు, నువ్వులు, మెంతులు, కరివేపాకు, పన్నెండు ఎండుమిర్చి ఒక్కొక్కటి వేసుకుంటూ సన్నటిమంట మీద వేయించుకోవాలి. చల్లారాక పొడి చేసిపెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు వేసి వేయించుకోవాలి. అందులోనే పల్లీలు కూడా వేసి కొంచెం వేగాక చింతపండు గుజ్జు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి. ఈ గుజ్జు సగమయ్యాక పొడి చేసిపెట్టుకున్న మిశ్రమం, బెల్లం తురుము వేసి ఉడికించాలి. చిక్కబడిన తర్వాత దించుకోవాలి. అన్నాన్ని ఒక పళ్ళెంలోకి తీసుకుని పచ్చినూనె వేసి కలిపి కరివేపాకు పచ్చిగానే అందులో వేసేయాలి. ఈ అన్నంలో ఉడికించిన పులిహోర ముద్దను వేసి కలిపి, ఉప్పు చూసుకుంటే సరి..
పెసరపప్పు హల్వా
కావాల్సిన పదార్థాలు : పెసరపప్పు – కప్పు, నెయ్యి – కప్పు, పాలు – కప్పు, చక్కెర – కప్పు, జీడిపప్పు పలుకులు, కిస్మిస్‌లు – కొన్ని, యాలకుల పొడి- అరచెంచా
తయారు చేసే విధానం : పెసరపప్పును గంట ముందుగా నానబెట్టుకోవాలి. తర్వాత నీటిని వంపేసి మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. కడాయిలో చెంచా నెయ్యి కరిగించి జీడిపప్పు, కిస్మిస్ పలుకుల్ని వేయించుకుని పెట్టుకోవాలి. కడాయిలో మిగిలిన నెయ్యిని కరిగించాలి. అందులో పెసరపప్పు ముద్ద వేసి మంట తగ్గించాలి. మధ్య మధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి పచ్చివాసన పోయి వేగినట్లు అవుతుంది. అందులో చక్కెర వేయాలి. రెండు నిమిషాల తర్వాత పాలు కూడా పోసి.. అడుగు అంటకుండా మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. కాసేపటికి గట్టిపడి హల్వాలా తయారైతుంది. అప్పుడు యాలకులపొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ పలుకులూ వేసి దింపేయాలి. అంతే.. హల్వా సిద్ధం
తోటకూర గారెలు
కావాల్సిన పదార్థాలు : పొట్టు మినప్పప్పు – గ్లాసు, జీలకర్ర – చెంచా, అల్లం, పచ్చిమిర్చి పేస్టు – చెంచా, తోటకూర తరుగు – అరకప్పు, ఉప్పు- తగినంత, మిరియాలు- అరచెంచా, నూనె – వేయించేందుకు సరిపడా
తయారు చేసే విధానం : మినప్పప్పును మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లన్నీ వంపేసి గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి. పిండి మెత్తగా అయ్యాక జీలకర్రా, అల్లం, పచ్చిమిర్చి పేస్టూ, మిరియాలూ, తోటకూర తరుగూ వేసి మరోసారి మిక్సీ పట్టి, తగినంత ఉప్పు కలపాలి. కడాయిలో నూనె వేసి వేడయ్యాక పిండిని గారెల్లా చేత్తో ఒత్తుకుంటూ వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
కొబ్బరి డ్రైఫ్రూట్స్ బూరెలు
కావాల్సిన పదార్థాలు : కొబ్బరి తురుము – కప్పు, బెల్లం తురుము -. ఒకటిన్నర కప్పు, జీడిపప్పు, బాదం పొడి – పావుకప్పు, కిస్మిస్ – రెండు చెంచాలు, మినప్పప్పు – పావు గ్లాసు, బియ్యం – అరగ్లాసు, మెంతులు – కొద్దిగా, నూనె – వేయించేందుకు సరిపడా, యాలకులపొడి- అరచెంచా
తయారు చేసే విధానం : ముందురోజు రాత్రి బియ్యం, మినప్పప్పు, మెంతులూ ఓ గిన్నెలోకి తీసుకుని నానబెట్టుకోవాలి. తెల్లారి వాటిని కడిగి మిక్సి జార్‌లో వేసి మెత్తగా దోశపిండిలా రుబ్బి పెట్టుకోవాలి. కడాయిలో బెల్లం తురుము వేసి అది మునిగేలా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. బెల్లం కరిగాక కొబ్బరి తురుము, యాలకులపొడి, జీడిపప్పు, బాదం పొడి, కిస్మిస్ పలుకులూ వేసి బాగా కలపాలి. కాసేపటికి ఈ మిశ్రమం చిక్కగా అయ్యాక దింపేసి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్నిే చిన్నచిన్న ఉండల్లా చేసుకుని, దోశపిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి.
సొజ్జప్పాలు
కావాల్సిన పదార్థాలు :కొబ్బరి – సగం చెక్క, బెల్లం తురుము – కప్పు, బొంబాయి రవ్వ – కప్పు, మైదా – కప్పు, నూనె – వేయించేందుకు సరిపడా, ఉప్పు – చిటికెడు, యాలకులపొడి – కొద్దిగా, ఉప్పు – చిటికెడు
తయారు చేసే విధానం : మైదాలో చిటికెడు ఉప్పు వేసి నీళ్లు పోస్తూ పూరీపిండిలా కలిపి పెట్టుకోవాలి. కడాయిలో నూనె లేకుండా బొంబాయిరవ్వను దోరగా వేయించి తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో బెల్లం తురుమూ, అది మునిగేలా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. బెల్లం తురుము కరిగాక, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేయాలి. నిమిషం తర్వాత వేయించిన బొంబాయి రవ్వను కూడా వేసి కలపాలి. కాసేపటికి ఇది హల్వాలా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని దించేసి చల్లారాక చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న మైదాను కొద్దిగా తీసుకుని చిన్న పూరీలా వత్తాలి. అందులో కొబ్బరి ఉండను ఉంచి, అంచులు మూసేయాలి. తర్వాత జాగ్రత్తగా మళ్ళీ పూరిలా వత్తుకోవాలి. దీన్ని కాగుతున్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని చేసుకుంటే సొజ్జప్పాలు సిద్ధం.
జొన్న రవ్వ పాయసం
కావాల్సిన పదార్థాలు : జొన్న రవ్వ – అరకప్పు, పాలు – లీటరు, చక్కెర- గ్లాసు, యాలకుల పొడి – అర చెంచా, నెయ్యి – రెండు చెంచాలు, జీడిపప్పు, బాదం – పది చొప్పున (పలుకులు చేసుకోవాలి)
తయారు చేసే విధానం : ముందుగా కడాయిలో నెయ్యి కరిగించి బాదం జీడిపప్పు పలుకుల్ని వేయించి, విడిగా తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో జొన్నరవ్వను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోనే పాలు పోస్తూ కలుపుకోవాలి. రవ్వ మూడు వంతులు ఉడికాక చక్కెర వేసేయాలి. తర్వాత మంట తగ్గించి, మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పదిహేను నిమిషాలకు పాలు కూడా సగం అయి, చక్కెర కరిగి, పాయసం చిక్కగా అవుతుంది. అప్పుడు యాలకుల పొడి, వేయించిన బాదం, జీడిపప్పు పలుకులూ వేసి దింపేయాలి.