వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి

తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్టు టీచర్ల జేఏసీ డిమాండ్‌
– ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ధర్నా
– 14 రోజుల్లో ప్రక్రియ ప్రారంభించకుంటే వర్సిటీల్లో సమ్మె
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 13 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులందర్నీ క్రమబద్ధీకరించాలని తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్టు టీచర్ల జేఏసీ డిమాండ్‌ చేసింది. బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలి చైర్మెన్‌ కార్యాలయంలోనూ బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మెన్‌ శ్రీధర్‌కుమార్‌ లోధ్‌, వర్కింగ్‌ చైర్మెన్‌ ఎం రామేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 13 విశ్వవిద్యాలయాల్లో 1,356 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారని చెప్పారు. వారందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 38 ద్వారా డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్‌ చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అదే తరహాలో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకు లందర్నీ కూడా రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. 2015 సంవత్సరంలో సర్కులర్‌ నెంబర్‌ 1059 ఆధారంగా విశ్వవిద్యాలయాల్లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యిందని గుర్తు చేశారు. కానీ ఈరోజు వరకు రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ చేపట్టకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల ఒకటో తేదీన సచివాలయంలో ఉన్నత విద్యాశాఖ అధికారుల సమావేశాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. కానీ ఈరోజు వరకు కూడా చలనం లేకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి, కార్యదర్శి ప్రొఫెసర్‌ ఎన్‌ శ్రీనివాసరావును కలిసి సమ్మె నోటీసు ఇచ్చామని వివరించారు. 14 రోజుల్లో వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ ప్రారంభించకుంటే రాష్ట్రంలో ఉన్న 13 విశ్వవిద్యాలయాల్లో సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్‌ రాజేష్‌ ఖన్నా, చైర్‌పర్సన్‌ పల్లా రేష్మా రెడ్డి, జి వెంకటేశ్వర్లు, వి హర్షిత, ఆదిత్య మూర్తి, దశరథం, హరీష్‌, కర్నాకర్‌, కృష్ణవేణి, బి నాగరాజు, పద్మ, జితేందర్‌, మసూద్‌, శిరీష, మను, రాధిక, పద్మ, సాయికృష్ణ, కాళీకృష్ణ, మధుమిత, వి వెంకటేష్‌, ఉదరు కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love