వీర బైరాన్‌ పల్లి!

Veera Byron Palli!పేరు వింటేనే..
వెన్నులో వణుకు
కళ్ళల్లో నెత్తుటి జీర
నరనరానా ఉప్పొంగి ప్రవహిస్తున్న
నిప్పుల ఉప్పెన
కరుడుగట్టిన
రాజ్య దురహంకారానికి
ఎదురు తిరిగిన సాయుధపోరు
తెలంగాణా గడ్డమీద
పుట్టుకొచ్చిన ధిక్కార స్వరం
వీర బైరాన్‌ పల్లి !
కన్నూ మిన్నూ కానని
ఖాసిం రజాకర్ల దురాగతాలని ఎదిరించగ
మోగించిన నగారా
బతకాలంటే..
‘నీ బాంచన్‌ కాల్‌ మొక్తా’!!
వళ్ళించనిదే తెల్లారని చీకటి రోజులవ్వి
తరతరాల వెట్టి వేదనని
మట్టి కరిపించిన
ఘనత ఈ గడ్డ మీంచి పుట్టిందే..!

అదెట్లా అన్నందుకే..
ఇన్నూరు మంది యువకుల నొక్కగాట కట్టి
ఒక్క తూటాతో పేల్చిన ఘోరాలకి
ఘోరీ కట్టిన ఖిల్లా నా వీర బైరాన్‌ పల్లి!

ఊహించనలవి కాని హింస
నేలకొరిగిన దేహాల కుప్పలతో
జలియాన్‌ వాలాబాగ్‌ కళ్ళముందు !!
దుఖిత మహిళల వివస్త్రలుగా
బతుకమ్మలాడించిన దురాగతాలు
బలవన్మరణాలు ఇక్కన్నే ..!

మనిషి తోలు కప్పుకున్న గద్దల నెదిరించగ
తిరగబడ్డ సాయుధపోరు

భూమికోసం భుక్తి కోసం
దాస్య విముక్తి కోసం ఎదురొడ్డి
పోరాడిన నా పురిటి గడ్డే
వీర బైరాన్‌ పల్లి..!

ఒక్కసారి…
ఒకే ఒక్కసారి నెత్తిరోడిన ఈ మట్టి గంధాన్ని
హత్తుకొని చూడు…
అది విమోచనమో
విలీనమో మరింకేమో తేలిపోతుంది..!!
– నాంపల్లి సుజాత, 9848059893

Spread the love