మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వెంకట్రామారెడ్డి

– ఉమ్మడి మెదక్‌ జిల్లాతో సన్నిహిత సంబంధాలు
– కలెక్టర్‌గా, జేసీగా, పీడీగా పదేళ్లపాటు బాధ్యతలు
– ఉమ్మడి కుటుంబం.. సామాజిక సేవాతత్వమే ప్రత్యేకత
– వెంకట్రామారెడ్డి ఎంపిక పట్ల గులాబీ శ్రేణుల సంబరాలు
నవతెలంగాణ – సిద్దిపేట
మెదక్‌ పార్లమెంటుకు  బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌, రిటైర్డ్‌ కలెక్టర్‌, ఎమ్మెల్సీ పి.వెంకట్రామారెడ్డిని ఖరారు చేశారు. గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్‌ బరిలోకి దిగేదెవరనే విషయంపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. ఎట్టకేలకు వెంకట్రామారెడ్డి వైపే మొగ్గు చూపించారు. బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలతోపాటు ప్రజల్లోనూ సత్సంబంధాలు కలిగిఉండడమే ఆయన ఎంపికకు దారి తీసినట్లుగా అర్థమవుతోంది. ఈ క్రమంలోనే బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ వెంకట్రామారెడ్డి ని ఖరారు చేశారు.
ఐఏఎస్‌ అధికారిగా సత్సంబంధాలు: 1996లో గ్రూప్‌-1 సర్వీస్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన వెంకట్రామారెడ్డి సమర్థుడైన అధికారిగా పేరు పొందారు. ఆర్డీవో గా ఆరేళ్ళ పాటు విధులు నిర్వహించి 2002లో ఉమ్మడి మెదక్‌ జిల్లా డ్వామా పీడీగా బాధ్యతలు నిర్వహించి పల్లెపల్లెన సంక్షేమ పథకాలను విస్తరించి తనదైన ముద్ర వేశారు. 2009లో ఉమ్మడి మెదక్‌ జిల్లాకు అడిషనల్‌ కలెక్టర్‌గా పనిచేశారు. 2014 నుండి 2016 వరకు ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక కొత్త జిల్లాల ఆవిర్భావంతో సిద్దిపేట జిల్లా మొదటి కలెక్టర్‌గా 2016 అక్టోబరు నెలలో బాధ్యతలు స్వీకరించి సుదీర్ఘకాలం సేవలందించారు. కొద్దిరోజుల పాటు మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేసినప్పటికీ మళ్లీ సిద్దిపేట కలెక్టర్‌గా బదిలీపై వచ్చి చెరగని ముద్ర వేశారు. సిద్దిపేట జిల్లా ప్రగతిని పరుగులు పెట్టించడంలో వెంకట్రామారెడ్డి కీలకంగా వ్యవహరించారు.
సామాజిక సేవకుడు: తన దగ్గర పనిచేసే బాబు అనే విఆర్‌ఏ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతుంటే అతనికి మెరుగైన వైద్యసేవలు అందించి, అతను బ్రతికితే తన తలనీలాలు సమర్పించుకుంటానని చెప్పి మొక్కు చెల్లించుకున్న ఘనత  వెంకట్రామారెడ్డికి దక్కుతుందంటే అతిశయోక్తి కాదు. పేరుకు కలెక్టర్‌ హోదా ఉన్నప్పటికీ అందరినీ ఒకే దృష్టితో చూడడం వెంకట్రామారెడ్డి వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వమే ఆయనకు  సిద్దిపేట జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో తగిన గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రజలను నేరుగా  కలవడం, వారి  సమస్యలను పరిష్కరించడం, కష్టాలతో వచ్చిన వారికి వ్యక్తిగతంగా సహాయం చేయడంలో ఆయన ముందుంటారు. ఒక కలెక్టర్‌గా చేయాల్సిన విధులతోపాటు ఒక వ్యక్తిగా కూడా ఎంతోమందికి చేయూత అందించారు. అనాథలను దత్తత తీసుకోవడం, అభాగ్యులైన ఆడపిల్లల వివాహం జరిపించడం, నిరుపేదల పిల్లల ఉన్నత చదువులకు ప్రొత్సహించారు. ప్రజావాణి లాంటి కార్యక్రమానికి స్వయంగా ఆయనే హాజరై అప్పటికప్పుడే సమస్యలను పరిష్కరించేవారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌, మెదక్‌, నర్సాపూర్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచిన వ్యక్తిత్వం వెంకట్రామారెడ్డిది. తాను చేసిన సేవా కార్యక్రమాలను గోప్యంగా ఉంచడం ఆయన ప్రత్యేకత.
అన్నదమ్ముల బంధం.. ఉమ్మడి కుటుంబం: పరిపాటి రాజిరెడ్డి, పుష్పలీల దంపతులకు ఎనిమిది మంది సంతానం. నేటికీ ఉమ్మడి కుటుంబమే. ఒకే నివాసం, ఒకేచోట భోజనం, ఆదర్శవంతమైన అన్నదమ్ముల అనుబంధం. మెదక్‌ పార్లమెంటు పరిధిలోని తెల్లాపూర్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో వెంకట్రామారెడ్డితోపాటు సత్యనారాయణరెడ్డి సైతం ఐఏఎస్‌ అధికారులుగా పదవీ విరమణ చేశారు. మిగితా అన్నదమ్ములు రాజపుష్ప సంస్థను నిర్వహిస్తున్నారు. ఆస్తులు, అంతస్థులు, బంధాలు, బంధుత్వాలు అన్నీ ఉమ్మడిగానే ఆస్వాదిస్తున్నారు. ఒకేచోట 32 మంది కుటుంబ సభ్యులు నివాసం ఉండడం ఈ రోజుల్లో అరుదైన విషయంగా చెప్పవచ్చు. తల్లిని కంటికి రెప్పలా చూసుకోవడం, కష్టం ఉన్నవారిని ఆదుకోవడం ఈ అన్నదమ్ముల ప్రత్యేకత. తల్లిదండ్రుల మీద మమకారంతో తమ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు తండ్రి రాజిరెడ్డి, తల్లి పుష్పలీల పేరు కలిసివచ్చేలా ’రాజ్‌పుష్ప’ అని నామకరణం చేసి ఉన్నత శిఖరాల్లో నిలబెట్టారు.
ఐఏఎస్‌ టు ఎంపీ అభ్యర్థిగా: కలెక్టర్‌గా ప్రజలకు చేరువగా ఉండడంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిలో పడ్డారు. రాజకీయాల్లోకి వస్తే మరిన్ని సేవలు అందించవచ్చనే తపన కూడా ఉండడంతో వెంకట్రామారెడ్డి గమ్యం మారింది. అందుకే సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ ఐఏఎస్‌ పదవి నుండి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరికై ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2021 నవంబర్‌ నెల నుండి ఎమ్మెల్సీ హోదాలో కొనసాగుతూ బిఆర్‌ఎస్‌లో కీలకంగా మారారు. వెంకట్రామారెడ్డి విశ్వసనీయత, పట్టుదలను మెచ్చి ప్రస్తుతం మెదక్‌ పార్లమెంటు బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దింపడానికి నిశ్చయించారు. ఓ సర్వేలో కూడా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వెంకట్రామారెడ్డికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని తేలడంతో ఆయన పేరును ఖరారు చేశారు. వెంకట్రామారెడ్డి ఎంపిక పట్ల మెదక్‌ పార్లమెంటు పరిధిలోని గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఎక్కడికక్కడ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వెంకట్రామారెడ్డి ప్రొఫైల్‌:
పేరు: పరిపాటి వెంకట్రామారెడ్డి
భార్య: ప్రణీత
కుమారుడు, కూతురు: భరద్వాజ్‌రెడ్డి, రుత్విక
తల్లిదండ్రులు: రాజిరెడ్డి, పుష్పలీల
నివాసం: తెల్లాపూర్‌, పటాన్‌చెరు నియోజకవర్గం, మెదక్‌ పార్లమెంటు పరిధి
అధికారిగా: 1996లో గ్రూప్‌-1 సర్వీసు ద్వారా ఆర్డీవో ఉద్యోగం.
ఏయే హోదాలు:
– బందరు, చిత్తూరు, తిరుపతి డివిజన్లకు ఆర్డీవో,
– 2002-2004లో ఉమ్మడి మెదక్‌ జిల్లా డ్వామా పీడీ.
– 2009లో ఉమ్మడి మెదక్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌
– 2014-2016 వరకు ఉమ్మడి మెదక్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌
– 2016 నుండి 2021 వరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ (ఎన్నికల బదిలీల్లో భాగంగా సిరిసిల్ల, సంగారెడ్డి కలెక్టర్‌గా విధులు)
– 2021 నవంబరు 15న ఉద్యోగ విరమణ
రాజకీయ అరంగేట్రం: 
– 2021 నవంబరులో బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిక, ఆ వెంటనే ఎమ్మెల్సీగా  ఎంపిక
– ప్రస్తుతం మెదక్‌ పార్లమెంటు బిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంపిక
Spread the love