నవతెలంగాణ – హైదరాబాద్: ‘వేణు యెల్దండి’.. నాలుగు నెలల ముందు వరకు ఈ పేరు చాలా మందికి తెలియదు. అతడు ‘జబర్దస్త్ వేణు’గానే అందరికీ తెలుసు. కమెడియన్ గానే ప్రేక్షకులకు పరిచియం. తెర ముందు కామెడీతో నవ్వించడమే కాదు.. తెర వెనుక డైరెక్టర్ గా భావోద్వేగాలతో కన్నీళ్లు పెట్టించడమూ తెలుసని ‘బలగం’ సినిమాతో నిరూపించారు. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి విజయం సాధించాడు వేణు. ఆయన నుంచి రెండో చిత్రం ఎప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వేణు అప్డేట్ ఇచ్చారు. తను తీయబోతున్న రెండో సినిమా స్క్రిప్టు పనుల్ని ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి పెన్ను, పేపర్ ఫోటోని షేర్ చేశారు. తన రెండో సినిమాలో కూడా ఎమోషనల్ సీన్స్ ఉండేలా వేణు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కూడా ‘బలగం’ మాదిరే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ‘మరో బలగం కావాలని కోరకుంటున్నా’, ‘ఆల్ ది బెస్ట్ వేణు సర్.. ’, ‘మంచి యాక్షన్ థ్రిల్లర్ కథ రాయండి అన్నా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వేణు ఎలాంటి సినిమా తీయనున్నారు? హీరో హీరోయిన్లు ఎవరు? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.