మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువు దోపిడీ

నిబంధనల మేరకు వరి ధాన్యం కొనాలి
తరుగు దోపిడీని ఆపకుంటే ప్రభుత్వ కార్యాలయం ముట్టడిస్తాం
త్వరలోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం
రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుస్సు మధుసూదన్‌రెడ్డి
నవతెలంగాణ-యాచారం
ధాన్యం కొనుగోలు నిర్వహకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుస్సు మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులంతా ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే తరువు పేరుతో రైతులను ధాన్యం కొనుగోలు సెంటర్లు మోసాలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. రైతులకు సరిపడా గోనె సంచులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు సెంటర్లల్లో ధాన్యం రాశుల దగ్గర నెలల కొద్ది రైతులంతా పడి కాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ఒక్క కొనుగోలు సెంటర్‌ కూడా ప్రభుత్వ నిబంధనల అమలు చేయడం లేదన్నారు. జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సెంటర్ల దగ్గర నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని నాలుగు సెంటర్లు నడుస్తున్నాయని, కొన్ని సెంటర్ల దగ్గర రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. సెంటర్ల దగ్గరకు రైతులు ధాన్యం విక్రయించాలని వెళ్లినా, దళారులు మాయ మాటలు విని, ముందుగా వచ్చిన రైతుల ధాన్యం తీసుకోకుండా వారు చెప్పినా రైతుల నుంచే ధాన్యం నిర్వాహకులు సేకరిస్తున్నారని విమర్శించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. తక్షణమే కొనుగోలు నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం సేకరించాలని కోరారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల దగ్గర పెద్ద ఎత్తున మోసాల జరుగుతున్నాయని గుర్తు చేశారు. పై అధికారులు ధాన్యం కొనుగోలు సెంటర్లను సందర్శించి జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని డిమాండ్‌ చేశారు.

Spread the love