అత్యంత అమానుషం!

The most inhumane!– అల్‌-షిఫా ఆస్పత్రి ఆవరణలోనే 179 మంది ఖననం !
– ఆస్పత్రి పరిసరాల్లో దుర్వాసన
గాజా : ఇజ్రాయెల్‌ నిరంతరం దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గాజా నగరంలో అతిపెద్ద ఆసుపత్రి అల్‌ షిఫాలో అమానుషమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత 72 గంటలుగా విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో ఏడుగురు నవజాత శిశువులతో సహా 32 మంది రోగులు మరణించారు. దాడులు, ఆస్పత్రి చుట్టూ బలగాల మోహరింపు కారణంగా బయటకు వెళ్ళే పరిస్థితి లేక చిన్నారులతో సహా 179 మృతదేహాలను ఆసుపత్రి ఆవరణలోనే సామూహిక ఖననం చేసినట్లు ఆస్పత్రి చీఫ్‌ మొహమ్మద్‌ అబు సాల్మియా మంగళవారం తెలిపారు. ఆస్పత్రికి నీరు, కరెంటు, ఔషధాల సరఫరా నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్పిటల్‌ సామూహిక సమాధిగా మారిందని మంగళవారం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమందికి ప్రాణాలు పోయాల్సిన ఆసుపత్రిని ఇజ్రాయెల్‌ సైన్యం దిగ్బంధించడం వల్ల నేడు సమాధిగా మారిందని అన్నారు. వైద్య సౌకర్యాల లేమితో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇంకా మరికొన్ని మృతదేహాలు ఆసుపత్రి కాంప్లెక్స్‌లో పడి ఉన్నాయని చెప్పారు. ఎక్కడికక్కడ మృతదేహాలు పడి వుండడంతో అవి కుళ్లిపోయి తీవ్రమైన దుర్వాసన వస్తోందని మీడియా వార్తలు పేర్కొన్నాయి. కాగా, ఈ ఆసుపత్రిలో ఆది, సోమవారాల్లో వరుసగా 39 మంది, 36 మంది శిశువులు మృతి చెందినట్లు పిల్లల విభాగం డాక్టర్‌ మొహమ్మద్‌ తబాషా సోమవారం మీడియాకు తెలిపారు. రోజురోజుకి ఈ సంఖ్య పెరిగే ప్రమాదముందన్నారు. గాజాలోని 35 ఆసుపత్రుల్లో 23 పూర్తిగా మూతపడ్డాయి. మిగిలిన ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య కార్యకర్తలు మరియు రోగులను ఇజ్రాయెల్‌ సైన్యం బయటికి అనుమతించడం లేదని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. గాజా నగరానికి పశ్చిమాన ఉన్న అల్‌-రిమాల్‌, తాల్‌ అల్‌-హవా, అల్‌-తుఫా, షేక్‌ అజ్లిన్‌ పరిసరాలు, బీచ్‌ శరణార్థి శిబిరంపై బాంబు దాడులు జరగగా, శరణార్థుల శిబిరంపై జరిగిన దాడిలో ఏడుగురు చనిపోయారు. ఐక్యరాజ్య సమితి పాఠశాలపై కూడా దాడి జరిగింది. గాజాలో ఇప్పటివరకు 11,360 మందికి పైగా మరణించినట్లు సమాచారం. అయితే కమ్యూనికేషన్‌ వ్యవస్థ దెబ్బతినడంతో కచ్చితమైన సమాచారం లభించడం లేదు. ఈ పరిస్థితుల పట్ల ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు గాజాలోని ప్రధాన ఆస్పత్రి అల్‌-షిఫాను హమస్‌ కమాండ్‌ సెంటర్‌గా ఉపయోగిస్తు న్నారని, ఇందుకు సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారాలున్నాయని ఇజ్రాయిల్‌ చేసిన ఆరోపణలను హమస్‌ ఖండించింది. ఇందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని హమస్‌ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.
ఆస్పత్రి కింద సొరంగం
గాజా నగరంలోని చిల్డ్రన్స్‌ రాంటిసి ఆసుపత్రిలో హమాస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని సోమవారం రాత్రి ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. దాడికి పాల్పడిన ఆసుపత్రి కింద సొరంగంలో హమాస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను కనుగొన్నట్లు ఐడిఎఫ్‌ ప్రతినిధి రియర్‌ అడ్మ్‌ డేనియల్‌ హగారి మీడియాతో తెలిపారు. సూసైడ్‌ బాంబ్‌ దుస్తులు, గ్రానైడ్స్‌, ఎకె-47 రైఫిల్స్‌, పేలుడు పరికరాలు, ఆర్‌పిజిలు, ఇతర ఆయుధాలు, కంప్యూటర్లు, డబ్బు వంటివి అక్కడ కనుగొన్నట్లు హగారి మీడియాతో తెలిపారు. అయితే ఈ ఆసుపత్రి నుండి సైనికులపై కాల్పులు జరిపిన వారిని హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ఓ వీడియో ద్వారా పేర్కొంది.
గాజాపై హమాస్‌ పట్టు కోల్పోతోంది : ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి
కీలక ప్రాంతమైన గాజాపై హమాస్‌ పట్టు కోల్పోతోందని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌ మీడియాతో చెప్పారు. ‘ఇజ్రాయెల్‌ సైన్యం గాజాను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ఉగ్రవాదులు దక్షిణం దిశగా పారి పోతున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌ రక్షణ బలగాలను ఆపగలిగే శక్తి హమాస్‌కు లేదు.’ అని ద టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ అనే ఆన్‌లైన్‌ వార్తాపత్రికకు గాలంట్‌ తెలిపారు.

Spread the love