పాట‌ల పూదోట‌లో వ‌సంతాలు విర‌బూయించిన వేటూరి

– పొన్నం రవిచంద్ర, 9440077499
ఆయన పేరు వింటే కృష్ణాతరంగాలు సారంగ రాగాలు వినిపిస్తాయి. ఆయన పేరు తలచినంతనే పాట వెన్నెల పైటేసి ఒయ్యారమొలకబోస్తుంది. నాట్యం విలాసంగా నర్తిస్తుంది. ఆయనే పాటల సిరి.. వేటూరి. ఆ సుందరమూర్తి శృగార కవే కాదు.. ఆధ్యాత్మిక తత్వాన్ని, జీవిత పరమార్థాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకున్న భక్త యోగకవి. అల్లరి పాటలతో ‘మాస్‌’ మనసులను దోచుకున్నా, యమకగమకాలతో ‘క్లాస్‌’ మదిని ఝమ్మనిపించినా అది ఆయనకు మాత్రమే సాధ్యం. సాహిత్య విలువలు కలిగిన వైవిధ్యభరిత గీతాలెన్నింటినో మనకందించి, అన్ని కోణాల్లో తరచి తరచి అన్నిరకాల రసాల్ని పాట ద్వారా విహరింపజేసి, అందరి మదిలో పాటై నిలిచిపోయిన సినీ కవిరాజు వేటూరి. మూడు దశాబ్దాలు తెలుగు పాటకు కర్త, కర్మ, క్రియగా మారిన వేటూరిని ఒక్కమాటలో ‘తెలుగుపాటల పూదోట’ అనవచ్చు. ఆయన తెలుగు నుడికారానికి గుడి కట్టాడు. జర్నలిస్టుగా తన వృత్తి ప్రారంభించి మాంత్రికుడిగా తెలుగు పాటను హైజాక్‌ చేశాడు. మారుతున్న కాలానికి తగినట్లు తన పాళీని, బాణీని మార్చి కొత్త తరంతోను పోటీ పడి వాడిలోనూ, వేడిలోనూ, వేగంలోనూ తనకి తానే సాటి అనిపించుకున్న వేటూరి. మే 22, న ఆయన 13వ వర్ధంతి సందర్భంగా సోపతి పాఠకుల కోసం అందిస్తున్న వ్యాసం.
వేటూరి సుందరరామ్మూర్తి 1936 జనవరి 29న కృష్ణా జిల్లా, దివిసీమలో ఉన్న కదళీపురం (దాన్ని ప్రస్తుతం పెదకళ్ళేపల్లి అంటున్నారు.) గ్రామంలో వేటూరి చంద్రశేఖర్‌ శాస్త్రి, కమలాంబ దంపతులకు జన్మించాడు. ఆయన బాల్యం విజయవాడలో గడచింది. బీసెంట్‌ రోడ్డులో ఉన్న చిన్న స్కూల్లో కొన్నేళ్ళు చదువుకున్నాడు. తర్వాత జగ్గయ్యపేటలో చదువుకున్నాడు. కాలేజీ చదువు మద్రాసులో జరిగింది. 1956లో బిఎ పాసై నిరుద్యోగిగా ఉన్న రోజుల్లో నార్ల వెంకటేశ్వరరావు వేటూరిని పిలిపించి రేపటి నుంచి ఉద్యోగంలో చేరమని చెప్పడంతో ఆయన జర్నలిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
జర్నలిస్ట్‌గా..
వేటూరి జర్నలిస్ట్‌గా ఉద్యోగంలో చేరిన తర్వాత నార్ల వెంకటేశ్వరరావు వేటూరికి తెలుగు వర్ణక్రమాన్ని, జీవనానికి సంబంధించి భాషాప్రయోగాలను దగ్గరుండి నేర్పించారు. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో జర్నలిస్టుగా ఉన్నప్పుడు వేటూరి ఓసారి ఎన్‌.టి.రామారావును ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాడు. అపుడు ‘బ్రదర్‌… మీరు సినిమా రంగంలోకి రావచ్చు కదా’ అని ఎన్టీఆర్‌ అనడంతో వేటూరి ‘నేనెందుకు పనికొస్తానండీ’ అని అనడంతో ‘కాదు మీ దగ్గర ఆ ధోరణి చూస్తున్నాను. మాకు అవసరమయ్యే టట్టున్నారు’ అని అనేసరికి ‘మీకవసరం అయినప్పుడు వస్తానులెండి’ అని చెప్పిన వేటూరి ఆ తర్వాత ఆంధ్రపత్రికలో పని చేయలేక రిజైన్‌ చేశాడు. అది తెలిసి ఎన్టీఆర్‌ వేటూరిని పిలిపించి ‘మీరిక్కడే ఉండండి ప్రస్తుతం పనిలేదని వెళిపోవద్దు’ అని చెప్పడంతో వేటూరి మద్రాసులోనే వుండి ఎవరైనా ‘పాట’ ఇస్తారేమోనని చూసి అవకాశం రాక కొన్నాళ్ళకు హైదరాబాద్‌ వచ్చి ఆంధ్రప్రభలో జర్నలిస్టుగా చేరాడు. వేటూరి, తన ముప్పయ్యవ ఏట ఆంధ్రజనతకి ఎడిటర్‌గా పనిచేశారు. 1956 నుంచి పద్దెనిమిదేండ్ల పాటు పాత్రికేయ వృత్తిలో ఉన్న వేటూరి 1968లో ఎడిటర్‌గా రిజైన్‌ చేసి, స్వతంత్రగా పబ్లికేషన్‌ స్థాపించి విశ్వనాథ సత్యనారాయణతో ‘చందవోలు రాణి’ నవలను ఆడిగి రాయించుకుని, సుందర ప్రచురణలు పేరున ప్రచురించాడు. తరవాత ఆయన రాసిన ‘జీవనరాగం’, ‘దేవాలయ చరిత్ర’ పుస్తకాలను కూడా ప్రచురించాడు. 1970లో ఆకాశవాణిలో చేరేందుకు వెళ్లగా బాలాంత్రపు రజనీకాంతరావు వేటూరిని ఏదైనా రచన చేసివ్వమని అడగటంతో, ‘సిరికాకుళం చిన్నది” అనే సంగీత నాటకాన్ని రాసి ఇచ్చాడు. ఈ సమయంలో చక్రపాణి మహిళల కోసం ప్రత్యేకంగా ‘వనిత’ అనే పత్రికను ప్రారంభిస్తూ వేటూరిని ఎడిటర్‌గా రమ్మని ఆహ్వానించాడు. అదే సమయంలో దేశ రక్షణ నిధి సమర్పించడానికి ఎన్‌.టి.రామారావు దేశాటనం చేసి, ఆ నిధిని తీసుకుని ఆయన ఫతేమైదాన్‌లో లాల్‌ బహదూర్‌ శాస్త్రికి సమర్పించడానికి వచ్చారు. అది కవర్‌ చేయడానికి వెళ్ళిన వేటూరిని చూసిన రామారావు ఆయనను పిలిచి ఎందుకు మద్రాసు వదిలి వెళ్ళావయ్యా అని మందలించారు. తర్వాత వేటూరి రాసిన రేడియో నాటకం ‘సిరికాకుళం చిన్నది’ విని మద్రాసు రమ్మని కబురు పంపిన ఎన్టీఆర్‌ వేటూరిని కె. విశ్వనాధ్‌ కి పరిచయం చేశాడు.
ఓ సీత కథతో సినీ రంగ ప్రవేశం
దర్శకులు కె. విశ్వనాధ్‌ ‘ఓ సీత కథ’ లో మొదటి పాట రాయించారు. ఆయన సినీ రంగంలో గీత రచయితగా చేరిన తర్వాత వ్యక్తిగత ప్రవర్తన దగ్గర నుంచి ప్రతి క్షణం ఎలా ఉంటున్నాడు, ఎలా ఉండకూడదో, ఎలా ఉండాలో చెప్తూ వేటూరిని కె.విశ్వనాధ్‌ తన తమ్ముడిగా చూసుకుంటూ, ఆయనకొక గైడ్‌గా ఉన్నాడు. ‘ఓ సీత కథ’ లో వేటూరి ‘భారత నారీ చరితము, మధుర కథాభరితము’ అనే హరికథను రాశారు. తర్వాత విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘సిరిసిరి మువ్వ’ సినిమాలో పాటలన్నీ వేటూరి రాశాడు. అందులో ”ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈవేళా, చెలరేగింది ఒక రాసలీలా” పాటతోబాటు అన్నీ పాటలూ హిట్టే. ఇలా ‘ఓ సీత కథ’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వేటూరి, సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో ఈ సినిమాలాలోని పాటలకు వోణీలు వేయించి మంచి పేరు సంపాదించు కున్నాడు. ఆ తర్వాత 1975 లో బాపు రూపొందించిన ‘భక్త కన్నప్ప’ చిత్రం ద్వారా వేటూరి గీత రచయితగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ సమయంలో కె. రాఘవేంద్రరావు, ‘అడవి రాముడు’ చిత్రం తో వేటూరిని కమర్షియల్‌ చేసి, ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను, కోకెత్తుకె ళ్ళింది కొండగాలి’ వంటి పాట రాయించి మాస్‌ రైటర్ని చేసాడు. వేటూరి మాస్‌ పాటలతో పాటు ‘శంకరాభరణం. సాగర సంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతి ముత్యం…’ లాంటి చిత్రాలకు సాంప్ర దాయ కీర్తనల్లోని పల్లవుల్ని, పురాణ సాహిత్యంలోని పంక్తుల్నీ గ్రహించి అందమైన పాటల్ని అందించాడు. ”పిల్లన గ్రోవికి నిలువెల్లగాయాలు అల్లన మ్రోవిని తాకితే గేయాలు”, ”నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ” ”ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు కదులు ఎదలోని సడులే మృదంగాలు” లాంటి అపురూప పదవిన్యాసాలు ఆయన పాటల్లో అడుగడుగునా కనిపిస్తాయి. వేటూరి చాలా రకాల పాటలను రాసాడు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. పండితుల నుండి పామరుల వరకు అందరిని అలరించిన విశిష్ట శైలి ఈయన సొంతం. వేటూరికి తెలుగంటే మమ కారం. అయితే వేటూరి తన పాటల్లో సంస్కృత సమాసాలు కూడా వాడారు. అవి చాలా గంభీరంగా కూడా వుంటాయి. ‘సాగర సంగమం’లో ”ఓం నమశ్శివాయ చంద్రకళాధర సహృదయా” పాటలో ”త్రికాలములు నీ నేత్రత్రయమై, చతు ర్వదములు ప్రాకారములై, గజముఖ షణ్ముఖ ప్రమాధాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై, అద్వైతమే నీ ఆది యోగమై, నీ లయలే ఈ కాలగమనమై, కైలాస గిరివాస నీగానమే జంత్రగాత్ర ముల శ్రుతి కలయా” అంటూ వర్ణించడం ఒక్క వేటూరికే చెల్లింది అనడంలో అతిశ యోక్తి లేదు. శివ స్వరూపానికి వేటూరి ఇచ్చిన విశ్లేషణ మనం మరెక్కడా చూడం. కె.విశ్వనాథ్‌ సినిమా ‘సప్తపది’లో సంస్కృత పదాలతో ‘అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీం’ పాటను గురించి చెప్పుకుందాం. పార్వతీ దేవిని ”శుభగాత్రి గిరిరాజపుత్రీ, అభినేత్రి శర్వార్ధగాత్రీ, సర్వార్ధ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభా ధవళకీర్తీ” అంటూ కీర్తించారు. ఇందులో శర్వార్ధగాత్రి అంటే శివునిలో అర్ధభాగం అని, సర్వార్ధ సంధాత్రి అంటే సకల కార్యాలను నెరవేర్చే శక్తి స్వరూపిణి అని వేటూరి భావం. ఇక రెండవ చరణంలో మహాలక్ష్మీదేవిని కీర్తించారు. ”శ్రీపాద విచలిత, క్షీరాంబు రాశీ, శ్రీపీఠ సంవర్ధినీ, డోలాసుర మర్దినీ” అంటూ వర్ణించారు. మూడవ చరణంలో సరస్వతీ దేవిని అద్భుతంగా వర్ణించారు. ”ఇందు వదనే, కుందరదనే వీణా పుస్తక ధారిణే అంటూ… సరస సాహిత్య స్వరస సంగీత స్తనయుగళే” అన్నారు. అంటే సంగీతం, సాహిత్యాలను రెండు వక్షో జాలుగా కలిగిన తల్లి అనే అర్థంలో ఈ చరణం రాశారు. ఇక చివరి చర ణాన్ని ముగురమ్మల మూల పుటమ్మ గురించి ‘హే బ్రహ్మచారిణే, దుష్కర్మవారిణే’, హే విలంబితా కేశపాశినే, మహి షమర్దన శీల, మహిత గర్జనలోల, భయద నర్తనకేళికే.. కాళికే” అంటూ వర్ణించడం వేటూరికే సాధ్యం. ‘సప్తపది’ చిత్రంలో ”ఏ కులము నీదంటే గోకులము నవ్వింది, మాధవుడు యాదవుడు నీ కులమే లెమ్మంది” అనే పాటలో ”ఆదినుంచి ఆకాశం మూగది… అనాదిగా తల్లి ధరణి మూగది, నడుమ వచ్చి ఊరుముతాయి మబ్బులు… ఈ నడమంత్రపు మనుషులకే మాటలు” అంటూ ఎప్పుడో విద్యార్థి దశలో రాసుకున్న భావగీతం విశ్వనాథ్‌కు నచ్చడంతో, సన్ని వేశాన్ని సృష్టించి ఈ పాటను వాడుకు న్నారు. సందర్భోచితంగా పాటరాయడం వేటూరి గొప్పతనానికి నిదర్శనం. అలాగే ‘భైరవద్వీపం’ చిత్రంలో ”శ్రీతుంబుర నారద నాదామృతం, స్వరరాగ రసభావ తాళాన్వితం” పాటలో సింహభాగం సంస్కృత సమాసాలే!”. చిరంజీవి సినిమా ‘ఛాలెంజ్‌’లో సంస్కృత సమాసాలతో కూడిన ”ఇందువదన, కుందరదన, మంద గమన, మధురవచన, గగన జఘన సొగసు లలనవే” పాటను రాశారు. నాయికను వర్ణిస్తూ చంద్రబింబం వంటి ముఖ వర్చస్సు, మల్లెపూల వంటి పల్వరస, సుతారపు నడక, మధురమైన భాష కలిగిన చిన్నదానా నీకు ఆకాశ మంతటి విశాలమైన కటి ప్రదేశం వున్నది అంటూ వేటూరి తనదైన శైలిలో చమత్క రించారు. అలాగే ‘గీతాంజలి’ సినిమాలో ”ఆమనీ పాడవే హాయిగా, మూగవైపోకు ఈ వేళా” అనే పాటలో ”వయస్సులో వసం తమే ఉషస్సులా జ్వలించగా, మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా” అంటూ ఎండమావి నిరాశను రాసినట్లు పోలుస్తూ లోతైన భావాన్ని వ్యక్తీకరించారు. ఇక సమాసాలు పొసగని పదాలకు సమాసాన్ని కలుపుతూ దుష్టసమాసాలను కూడా వేటూరి యాదేచ్చగా వాడారు. నియమాలకు వ్యతిరేకంగా తెలుగు పదాలను సంస్కృత పదాలను కలిపేస్తూ పాటలు కూడా రాశారు. అడవిరాముడు చిత్రానికి సింగిల్‌ కార్డ్‌ పాటల రచయిత వేటూరి గారే. అందులో ”ఆరేసుకోబోయి పారేసుకున్నావు హరీ” అనే పాటను ఆరోజుల్లో కోటి రూపాయల పాట అని చెప్పుకునేవారు. ‘ప్రేమించు-పెళ్ళాడు’ చిత్రంలో ”నిరంతరమూ వసంతములే, మందారముల మరందములే” అనే పాట లో ఋతువులు మారిపోతున్నా ప్రేమికు లకు మాత్రం అన్ని రుతువులూ వసంత ఋతువులే అంటూ ఓ మంచి పాటను రాశారు. అగ్నిపత్రాలు రాసి గ్రీష్మరుతువు సాగిపోగా, మెరుపు లేఖలు రాసి మేఘం మూగవోయిందట. మంచు ధాన్యాలు కొలిచి పుష్యం వెళ్లిపోతే, మాఘమాసంలో అందమే అత్తరయిందట. ఇలావుంటాయి వేటూరి మధురిమలు. అలాగే ‘ఆఖరి పోరాటం’ చిత్రంలో ”ఆషాఢం ఉరుముతు వుంటే, నీ మెరుపే చిదుముకున్నా… హేమంతం కరుగుతూ వుంటే, నీ అందం కడుగుతున్నా” అని కూడా ఋతువుల పనిపట్టారు. 1979లో వచ్చిన కె. రాఘ వేంద్రరావు సినిమా ‘వేటగాడు’ లో వేటూరి మొత్తం 7 పాటలు రాశారు. వాటిలో ”ఆకు చాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే… ఆకాశ గంగొ చ్చింది, అందాలు ముంచెత్తింది” అని ఎన్‌.టి.ఆర్‌, శ్రీదేవి కోసం ఒక రెయిన్‌ సాంగ్‌కు పల్లవి రాశారు. దీనికి సెన్సారు వారు అభ్యంతరం పెట్టారు. అప్పుడు… ఆ పల్లవిని ”ఆకుచాటు పిందె తడిసే, కొమ్మమాటు పువ్వు తడిసే…” అని మార్చారు. చూడండి వేటూరి చతురత. ఇది వానపాట కావడంతో చినుకు అనే పదంతో వేటూరి ఆడుకున్నారు. ”ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే, చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే, ఓ చినుకు నిను తాకి తడియారిపోతుంటే, ఓ చినుకు నీ మెడలో నగలాగా నవుతుంటే, నీ మాట విని మబ్బు మెరిసి జడివాన కురిసిందని రాస్తూ… మరొక చరణంలో ‘మెరుపు’ అనే మాటతో ఆటాడుకున్న చతురుడు వేటూరి. అందులోనే ”జాబిలితో చెప్పనా జాము రాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా” అనే పాటలో ”తుమ్మెదలం టని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు” అంటూ తుంటరి వాక్యం కూడా రాశారు. ‘గోరింటాకు’ చిత్రంలో ”కొమ్మకొమ్మకో సన్నాయి” అనే పాట ఎంతో పాపులర్‌ పాట. ఈ పేరుతోనే వేటూరి సినీ ప్రము ఖుల మీద వ్యాస సంకలనాన్ని వెలువరిం చారు. ‘మేఘసందేశం’ చిత్ర పాటల కంపోజింగ్‌ మైసూరు లలిత్‌ మహల్‌ రాజ భవనంలో జరిగినప్పుడు, సంగీత దర్శ కుడు రమేశ్‌ నాయుడు ఒక పాటకు స్వరాలు అల్లుతున్నారు. వేటూరి పాలెస్‌ ఆవరణలో పచార్లు చేస్తుండగా వర్షం ఆరంభమై చిరుజల్లులతో బాటు, చల్లటి గాలి వీచసాగింది. ఆ నేపథ్యంలో పుట్టిందే ”ఆకాశ దేశాన ఆషాడ మాసాన మెరిసేటి ఓ మేఘమా… విరహమో దాహమో విడలేని మోహమో… వినిపించు నా చెలికి మేఘసందేశం” అనే టైటిల్‌ సాంగ్‌. వేటూరి సాహితీ సౌందర్యాన్ని ఆస్వాదించా లంటే క్లుప్తంగా కొన్ని పాటలు గుర్తు చేయాలి. ‘మల్లెపూవు’ చిత్రంలో ”ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులని, ఆ చితి మంటల చిటపటలే నాలో పలికే కవితలని”; ‘ముద్దమందారం’లో ”ముద్దుకే ముద్దొచ్చేమందారం, మువ్వల్లే నవ్వింది సింగారం” పాటలో ”మల్లెపువ్వా కాదు మరుల మారాణి, బంతిపూవా కాదు పసుపు పారాణి.. పరువాల పరవళ్ళు పరికిణీ కుచ్చిళ్లు, కన్నెపిల్లా కాదు కలల కాణాచి” అని రాసిన విధానం; ‘మేఘసందేశం’ లో ”పాడనా వాణి కల్యాణిగా” పాటలో ”నా పూజకు శార్వాణిగా, నా భాషకు గీర్వాణిగా, శరీర పంజర స్వరప్రపంచక మధురగాన శుకవాణిగా” అంటూ కల్యాణి రాగంలో రమేశ్‌ నాయుడు స్వరపరచేలా రాయడం; ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమాలో దేవకన్య ఇంద్రజ భూలోకంలో అడుగిడుతూ భూలోకపు అందాలను వర్ణించే ”అందాలలో అహో మహోదయం భూలోకమే నవో దయం, పువ్వు నవ్వు పులకించే గాలిలో… నింగీనేలా చుంబించే గాలిలో ఆనందాల సాగే విహారమే” పాట వినోదయాత్రకు వచ్చినట్లు వర్ణించిన వేటూరీ… సాహో… ‘ఇంటింటి రామాయణం’ సినిమాలో ”వీణ వేణువైన సరిగమ విన్నావా… తీగ రాగమైన మధురిమా కన్నావా, తనువు తహతహలాడాల, చెలరేగాల, చెలి ఊగాల ఉయ్యాల ఈవేళలో” కూడా ఒక అద్భుతమైన భావగీతం. వేటూరి రాసిన వేనవేల పాటల్లో ఇలాంటి మధురమైన గీతాలు ఎన్నో.. ఎన్నోన్నో ఉన్నాయి.
శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని ‘మాతృదేవోభవ’ సినిమాకి రాసిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే…’ అనే పాట ద్వారా 1994 ఏడాదికి గాను వేటూరి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది తెలుగు పాటకు రెండవ జాతీయ పురస్కారం. అయితే కేంద్ర ప్రభుతం తెలుగు భాషకు ప్రాచీన భాషా హౌదా ఇవ్వనందుకు నిరసనగా తన పాటకు వచ్చిన జాతీయ పురస్కారాన్ని తిరిగి ఇచ్చి వేసిన మాతృ భాషాభిమానం ఈయన వ్యక్తిత్వ శైలికి ఒక మచ్చు తునకగా చెప్పవచ్చు. కళాతపస్వి కె.విశ్వనాథ్‌, కె.వి.మహదేవన్‌, ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించాడు.
వేటూరి పుస్తకాలు
వేటూరి 2004 లో రేడియో కోసం రాసిన సంగీత నాటిక ‘సిరికా కొలను చిన్నది’.
ఇది రాయల నాటి తెలుగు సంస్కృతిని, ప్రజా జీవన సరళిని ప్రతిబింభించే కథ.
కథా స్థలం కృష్ణా నదీ తీరాన ఆంధ్ర విష్ణు క్షేత్రంగా ప్రసిద్దికెక్కిన శ్రీకాకుళంకు సంబందించినది కాగా
2007 లో ఉత్తమ సాహితీ సుగందాలు గుబాళించే అజరామర సినీ గీతాలను తెలుగు కళామతల్లి
చరణ సుమాలుగా అర్పించిన సారస్వత మూర్తి నవనవోన్మేష విశిష్ట రచనా స్ఫూర్తి వేటూరి కలం
నుండి పల్లవించిన ఎందఱో సినీ మహనీయుల ప్రస్తుతి వ్యాసాలతో రూపొందించిన పుస్తకం
కొమ్మ కొమ్మకో సన్నాయీ’.
డబ్బింగ్‌ చిత్రాలకు వేటూరి పాటలు

వేటూరి తెలుగు చిత్రసీమను ఎలుతూ తీరికలేని సమయంలో కూడా మణిరత్నం వంటి దర్శకులనూ, ఎ.ఆర్‌. రెహమాన్‌ వంటి సంగీత దర్శకులనూ కాదనలేక పరిమితమైన డబ్బింగ్‌ చిత్రాలకు మాత్రమే వేటూరి పాటల్ని రాశాడు. తెలుగులో ఆరు వందలకు పైగా అనువాద చిత్రాలకు రచన చేసి అత్యధిక డబ్బింగ్‌ పాటలనందించిన రాజశ్రీ తర్వాత కేవలం యాభైలోపు డబ్బింగ్‌ చిత్రాలకు పాటలు రాసి ఎక్కువ ‘హిట్స్‌’ను సాధించిన ఘనత వేటూరికే దక్కుతుంది. ఉదాహరణగా…
వేటూరి ఇద్దరు చిత్రంలో ”శశివదనే శశివదనే స్వర నీలాంబరి నీవా”, బొంబాయి చిత్రంలో ”కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే”, దశావతారం చిత్రంలో ”ముకుందా ముకుందా కృష్ణా ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా”, యువ చిత్రంలో ”సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా”, సఖి చిత్రంలో కలలైపోయెను నా ప్రేమలు అలలై పొంగెను నా కన్నులు”, సూర్య సన్‌ఆఫ్‌ కృష్ణన్‌ చిత్రంలో ”నిదరే కల ఐనది, కలయే నిజమైనది బతుకే జతఐనది, జతయే అతనన్నది”, నువ్వు-నేను-ప్రేమ చిత్రంలో ”ప్రేమించే ప్రేమవో, ఊరించే ఊహవో” లాంటి హిట్‌ పాటలతో, ‘మెరుపు కలలు’, ‘రాగమాలిక’, ‘తెనాలి’, ‘వల్లభ’, ‘వేసవి’, ‘యముడు’, ‘అమృత’, ‘ఆరు’ వంటి ఎక్కువ తమిళ చిత్రానువాదాలకు, గురు (హిందీలో గురుకాంత్‌), దేవరాగం (మలయాళం) వంటి ఇతర భాషా చిత్రానువాదాలకు వేటూరి ఎన్నో ‘హిట్‌ సాంగ్స్‌’ రాశాడు. ఆయన పాటలు రాసిన చివరి చిత్రం ‘విలన్‌’ కూడా తమిళం నుంచి డబ్‌ చేసిందే! ”అనువాద గీతాన్ని వీలైనంత వరకు మాతృకలోని భావాలకు దగ్గరగానే రాయడానికి నేను ప్రయత్నిస్తాను. వీలుకాని సందర్భంలో మాత్రమే ఒరిజినల్‌ కవి ఆత్మను కచ్చితంగా ఆవిష్కరించలేకపోతాను” అని చెప్పేవాడు.
విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో వేటూరి విగ్రహం
వేటూరి పాటలు రాసిన ఆఖరి సినిమా 2010 లో వచ్చిన ‘విలన్‌’.
మొత్తం మీద వేటూరి సుమారు ఐదు వేల పాటలు రాశారు.
ఇంత పెద్ద సంఖ్యలో పాటలు రాసిన తెలుగు గేయకవులు లేరనే చెప్పాలి.
ఆయన 75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు.
వేటూరి మరణం తర్వాత విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేశారు.

పురస్కారాలు
తెలుగు చలనచిత్ర రంగంలో ఎందరో మహానుభావులు న్నారు. వారి మధ్య వేటూరికి ఒక ప్రత్యేకస్థానం ఉంది. ఆయన కలం నుండి జాలువారిన ప్రతిఅక్షరం విలువైనదే. ఆయన రాసిన ప్రతిపాట గుర్తుంచుకోదగినదే. మూడు దశాబ్దాల కెరిర్‌లో ఎనిమిది నందులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నాడు.
1994లో మాతృదేవోభవ చిత్రంలోని ”రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే…
” గీతానికి ”జాతీయ స్థాయిలో ఉత్తమ గీతం”గా పురస్కారం అందుకోగా, 1977లో పంతులమ్మ చిత్రంలోని ”మానస వీణా మధుగీతం..”, 1979లో శంకరా భరణం చిత్రంలోని ”శంకరా నాదశరీరపరా..”, 1984లో కాంచనగంగ చిత్రంలోని ”బృందావని ఉంది..”, 1985లో ప్రతిఘటన చిత్రంలోని ”ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో..”, 1991లో చంటి చిత్రంలోని ”పావురానికి పంజరానికి పెళ్లిచేసే పాడు లోకం..”, 1992లో సుందరకాండ చిత్రంలోని ”ఆకాశాన సూర్యుడండడు సంధ్యవేళకి..”, 1993లో రాజేశ్వరి కళ్యాణం చిత్రంలోనని ”ఓడను జరిపే..”, 2000లో గోదావరి చిత్రంలోని ”ఉప్పొంగెలే గోదావరి..” ఎనిమిది గీతాలకు ”నంది అవార్డులు” రాగా, 1992లో సుందర కాండ చిత్రంలోని ”ఆకాశాన సూర్యుడండడు సంధ్యవేళకి..”, 1994లో మాతృదేవో భవ చిత్రంలోని ”వేణువై వచ్చాను భువనానికి..”, ఉత్తమ గీతాలుగా ”మనస్విని పురస్కారాలు” అందుకున్నారు. 2000 లో గోదావరి చిత్రంలోని ”ఉప్పొంగెలే గోదావరి..” గీతానికి ”ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు” అందుకున్నారు.

Spread the love