డీపీఆర్‌ ప్రకటించాకే బాధితులను తరలించాలి

Victims should be moved only after DPR is announced– నిర్వాసితుల పునరావాసానికి
– మూసీ పీపుల్స్‌ అర్బన్‌ మిషన్‌ ఏర్పాటు చేయాలి
– ఒక్క కుటుంబానికి అన్యాయం జరిగినా ఊరుకోం : మూసీ, హైడ్రాపై సీపీఐ ఆధ్వర్యంలో సెమినార్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మూసీ నిర్వాసితుల పునరావాసం కోసం పౌర సమాజం భాగస్వామ్యంతో ”పీపుల్స్‌ అర్బన్‌ మిషన్‌” ఏర్పాటు చేయాలని పలువురు వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ”హైడ్రా, మూసీ ప్రక్షాళన, పేద, మధ్యతరగతికి ప్రత్యామ్నాయం” అనే అంశంపై సీపీఐ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన చేపట్టాల్సిందేననీ, అయితే పేద, మద్యతరగతి నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ముందుకెళ్లాలని సూచించారు. గత సర్కార్‌ పదేండ్ల పాలనలో తెలంగాణ విధ్వంసమైందని ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారని గుర్తు చేశారు. ప్రస్తుత సర్కార్‌ సైతం అదే పద్ధతిలో పాలన సాగిస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మా, వ్యర్ధాలతోనే మూసీ కాలుష్య సాగరంగా మారిందని అంటున్న సర్కార్‌ తిరిగి మూసీ చుట్టు పక్కల కొత్తగా ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ఎందుకు అనుమతులిస్తున్నదని ప్రశ్నించారు. పొల్యూషన్‌కు భయపడి ప్రపంచ దేశాలు ఫార్మా రంగాన్ని వద్దనుకుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రంలో వాటికి ఎందుకు పెద్దపీట వేస్తున్నదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తే వారు 21 హక్కులు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఉద్వీగమైన పరిస్థితుల్లో ప్రజలతో సంప్రదింపులు జరిపి ఒప్పించాల్సిన బాధ్యత పాలకులదేనని స్పష్టం చేశారు. ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మాట్లాడుతూ ఏ ప్రాజెక్ట్‌ చేపట్టాలనుకున్నా ముందుగా డిటేయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) ప్రకటించాలని అన్నారు. అలాంటిదేమి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం మూసీ విషయంలో తొందరపాటు చర్యలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. సర్కార్‌ చర్యల వల్ల నిర్వాసితులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. మూసీ విషయంలో బాధితులెవరు? నిందితులెవరు అనే విషయాన్ని తేల్చాల్సిన అవసరముందని సర్కార్‌కు సూచించారు. బతకడం కోసం ప్రభుత్వ స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న వారు నిందితులు ఎన్నటికీ కారని స్పష్టం చేశారు. చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పరిధిని నిర్థారించే యంత్రాంగం లేక పోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు మోసపోతున్నారని గుర్తు చేశారు. నిర్వాసితులు ఇప్పుడున్న దాని కంటే మెరుగైన జీవనాన్ని అందిస్తామంటే స్వయంగా తరలిపోతారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ మూసీ కాలుష్యానికి కాంగ్రెస్‌, టీడీపీ, బీఆర్‌ఎస్‌ అందరూ బాధ్యులేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ జల వ్యవస్థను పునరుద్ధరించాలనే రేవంత్‌రెడ్డి నిర్ణయం సరైనదే అయినప్పటికీ దాన్ని ఆచరించే పద్ధతి సరిగ్గా లేదని అన్నారు. ఎవరు మాట్లాడితే వారిపై బుల్డోజర్లు నడిపిస్తా అనడం సరికాదని పేర్కొన్నారు.
ప్రజలతో క్షేత్రస్థాయిలో సంప్రదింపులు జరిపిన తర్వాతే ముందుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్సీ కోదండరామ్‌ మాట్లాడుతూ తెలంగాణలో 60 శాతం మంది ప్రజలు నగరాల్లో నివసిస్తున్నారనీ, రైటూ సిటీ అనే నినాదాన్ని అందిపుచ్చు కోవాలని అన్నారు. పునరుద్ధరణ పేరుతో పేద, మద్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చడం సరికాదనీ, వ్యర్థాలను శుద్ధిచేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. మూసీ పునరుజ్జీవనానికి తమ పార్టీ సమ్మతమే అయినప్పటికీ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగినా ఊరుకోబోమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సమావేశం చివర్లో పార్టీ వైఖరిని ఏక వాక్యంలో చెప్పారు. పలువురు మూసీ, హైడ్రా బాధితులు తమ గోడును ఈ సందర్భంగా వెల్లబోసుకున్నారు. సెమినార్లో వ్యక్తమైన అభిప్రాయాలతో పాటు, క్షేత్రస్ధాయి లో పర్యటించి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామని పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పల్లా వెంకటరెడ్డి, బాలమల్లేశ్‌, బోస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love