తొలి విజయంతో కాంగ్రెస్‌లో విజయ దరహాసం

నవతెలంగాణ-వైరా
వైరా నియోజక వర్గం ఏర్పడిన 15 సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలలో కాంగ్రెస్‌ పార్టీకి విజయం లభించక పార్టీ, నాయకులు తీవ్ర నైరాశ్యంతో ఉన్న సమయంలో ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఓటర్లు ఇచ్చిన అద్భుతమైన తీర్పుతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, విజయదరహాసం తొణికిసలాడుతోంది. నియోజక వర్గం ఏర్పడిన 2009 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ రామచంద్రనాయక్‌ తెలుగుదేశం, సీపీఐ(ఎం), సీపీఐ కూటమి అభ్యర్థి డాక్టర్‌ బానోత్‌ చంద్రావతి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ ఒక కూటమిగా, సిపిఐ అభ్యర్థిగా డాక్టర్‌ మూడు నారాయణ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బానోత్‌ బాలాజీ, సీపీఐ(ఎం) బలపర్చిన వైఎస్‌ఆర్‌ సిపి అభ్యర్థి బానోత్‌ మదన్‌ లాల్‌ పోటీ చేయగా మదన్‌ లాల్‌ విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా బానోత్‌ మదన్‌లాల్‌, మిత్రపక్షాల అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థి బానొత్‌ విజయా బాయి, స్వతంత్ర అభ్యర్థిగా లావుడియ రాములు నాయక్‌, సీపీఐ(ఎం) అభ్యర్థిగా బూక్యా వీరభద్రం తలపడగా స్వతంత్ర అభ్యర్థి లావుడీయా రాములు నాయక్‌ అనూహ్య విజయం సాధించారు. సుమారు 15 ఏళ్లు నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజా ప్రతినిది లేడన్న బాధ ఆ పార్టీ శ్రేణులను నైరాశ్యంలోకి నెట్టింది. గత నెల 30 న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నో రాజకీయ అంశాలు కలిసి వచ్చినవి. ఎలాగైనా నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేయాలన్న పట్టుదల ఏర్పడింది. అందుకే రాజకీయ పొత్తులో భాగంగా ఒక దశలో వైరా సీటును సీపీఐ(ఎం)కు కేటాయిస్తున్నట్లు వార్తలు రాగా కాంగ్రెస్‌ కార్యకర్తలు కోపం వూగిపోయారు. సోషల్‌ మీడియాలో చెలరేగి పోయారు. ఎట్టకేలకు సీపీఐ(ఎం)తో పొత్తు విఫలం కావడంతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మాలోత్‌ రామచంద్ర నాయక్‌ పోటీ చేశారు. బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా బానోత్‌ మదన్‌ లాల్‌ ప్రత్యర్థిగా నిలిచారు. ప్రభుత్వ వ్యతిరేకత, నియోజక వర్గంలో కొంత మేరకు అభ్యర్థి పై వ్యతిరేకతతో బిఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌ లాల్‌ ఓటమి చెందారు. కాంగ్రెస్‌ పార్టీకి చంద్ర బాబునాయుడు అరెస్ట్‌ తర్వాత జరిగిన పరిణామాలలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్‌ కామెంట్స్‌ టిడిపిని, ముఖ్యంగా ఐటి నిపుణులను రెచ్చగొట్టినట్లయింది. తెలుగు దేశం, కోదండ రామ్‌, వైఎస్‌ షర్మిల ఎన్నికల బరిలో నిలవకుండా కాంగ్రెస్‌ విజయానికి కృషి చేయటం, అపార రాజకీయ అనుభవం, అర్థ, అంగ బలం కలిగిన నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఇక్కడి ప్రత్యర్ధులనే కాక, నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌నే సవాలు విసిరిఎన్నికల బరిలో ఉండటంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకొత్త జవ సత్వాలు వచ్చినవి. కాంగ్రెస్‌ గెలుస్తుందన్న మౌత్‌ టు మౌత్‌ ప్రచారం కూడా కాంగ్రెస్‌కు బాగా కలిసి వచ్చింది. ఇన్ని అంశాలు కలిసి వచ్చిన నేపథ్యం లభించిన భారీ విజయం వైరా నియోజక వర్గ కాంగ్రెస్‌ శ్రేణులలో విజయ దరహాసం నింపింది.

Spread the love