నవతెలంగాణ – హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటున్నాడు. రెగ్యులర్ గా డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు మరో కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అతనికి వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయాలని, అందుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని వెల్లడించాడు. ఇందుకు దాతల సాయం కోరాడు. పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ యూట్యూబ్ లో ఓ వీడియో విడుదల చేశాడు నూకరాజు. ఎన్నో ఆసుపత్రులు తిరిగామని, ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేదని, మూడేళ్ల క్రితం రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, అప్పటి నుండి ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. పరిస్థితులో మార్పు లేకపోవడంతో అతనికి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారని, దీనికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. దయచేసి తోచినంత సాయం చేయాలని చేతులెత్తి వేడుకుంటున్నానని నూకరాజు అభ్యర్థించాడు.