ఎన్నికల బాండ్లపై పార్టీల అభిప్రాయాలు

Views of parties on electoral bondsన్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీం కోర్టు చారిత్రక తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆ తీర్పును స్వాగతించగా పాలక పక్షం బీజేపీ ఆ తీర్పును గౌరవిస్తామని పేర్కొంది.
మా వైఖరి సరైందే : కాంగ్రెస్‌
”ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. ఒక దేశంగా మనం మరింత బలోపేతమమయ్యాం. ఈనాడు మా వైఖరి సరైందేనని రుజువైంది.” అని కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖెరా వ్యాఖ్యానించారు. ఏడేండ్లుగా ఈ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ లోపల, వెలుపల పోరాడుతోందన్నారు. తాజాగా సుప్రీం ఇచ్చిన తీర్పుతో తాము తీసుకున్న వైఖరి సరైందేనని రుజువైందన్నారు. దాపరికానికి, రాజకీయ జవాబుదారీతనాన్ని ఎగవేయడానికి ఈ పథకం సరైన సాధనమని ఆయన విమర్శించారు.
తీర్పును గౌరవిస్తాం : బీజేపీ
‘ఎన్నికల బాండ్లపై సుప్రీం ఇచ్చిన తీర్పును బీజేపీ గౌరవిస్తుంది.’ అని బీజేపీ నేత రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. ఎన్నికల నిధుల వ్యవహారంలో పారదర్శకతను తీసుకురావడమే ఎన్నికల బాండ్ల లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.
స్వాగతిస్తున్నాం తమిళనాడు సీఎం స్టాలిన్‌
‘రాజ్యాంగ విరుద్ధమని ఎన్నికల బాండ్ల పథకాన్ని కొట్టివేస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పు స్వాగతిస్తున్నాం” అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసింది : ఆర్జేడీ
”ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచింది.” అని ఆర్జేడీ వ్యాఖ్యానించింది. కేంద్రంలోని పాలక బీజేపీకి లబ్ది చేకూరేందుకే ఈ పథకాన్ని తీసుకువచ్చారని ఆర్జేడీ బీహార్‌ ప్రతినిధి తివారీ వ్యాఖ్యానించారు.
బాండ్లను ప్రవేశపెట్టిన పార్టీకి ఎదురు దెబ్బ : తృణమూల్‌
‘ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టిన రాజకీయ పార్టీకి ఈ తీర్పు పెద్ద ఎదురు దెబ్బ’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. పార్టీ ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల మూలాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకుందని అన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. నిధుల విషయంలో పారదర్శకత వుండాలనే తమ పార్టీ ఎప్పుడూ చెబుతూ వస్తోందన్నారు.
చారిత్రకం : మాజీ సీఈసీ కృష్ణమూర్తి
‘సుప్రీం తీర్పు చారిత్రకం’ పరిశుద్ధమైన ప్రజాస్వామ్య ప్రయోజనాల రీత్యా ఇది చాలా కీలకమైన తీర్పు. ఈ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. రాజకీయ పార్టీలు దీన్నుండి పాఠాలు నేర్చుకోవాలి” అని మాజీ చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ టి.ఎస్‌.కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.
ఎలా గుర్తిస్తారు ?
రాజకీయ నిధుల వ్యవహారంలో పారదర్శకతను తీసుకురావడానికి ఈ ఎన్నికల బాండ్ల పతకం సరైనది కాదంటూ తాను గతంలో బహిరంగంగానే ప్రకటనలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బ్యాంక్‌ ద్వారా వస్తోంది కాబట్టి ఇది పారదర్శకతను పెంపొందిస్తుందని చెబుతున్నప్పటికీ ఈ పథకం ఎంత మాత్రమూ సరైన పద్దతి కాదన్నారు. ఎందుకంటే ఈ విరాళమిచ్చిన దాత పేరు, నిధులు మూలం తెలియనపుడు ఇది సక్రమమైన డబ్బా లేక అవినీతి డబ్బా అనేది ఎలా గుర్తిస్తారని ఆయన ప్రశ్నించారు.
స్వాగతించిన అన్నాడీఎంకే
అన్నాడీఎంకే చీఫ్‌ కె.పళనిసామి సుప్రీం తీర్పును స్వాగతించారు. ”బాండ్ల ద్వారా భారీ మొత్తాలు అందుకున్న పార్టీలు మమ్మల్ని నొక్కేశాయి. వారి ధన బలంతో మమ్మల్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. కచ్చితంగా ఈ తీర్పును స్వాగతిస్తున్నాం.” అని పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా తమ పార్టీ నిధులు స్వీకరించలేదని చెప్పారు. ఎన్నికల బాండ్ల ద్వారా భారీ మొత్తాలు విరాళంగా అందుకున్న పార్టీల వివరాలను మీడియా బయటపెట్టాలని కోరారు. అసెంబ్లీ హౌస్‌ వెలుపల ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Spread the love