కాళేశ్వరంపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోంది

కాళేశ్వరంపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోంది– ఏడాది చివరికల్లా ఐదు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు
– వర్షాకాలంలోపు చెరువుల పూడికతీత పనులు పూర్తి : నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవినీతిపై విజిలెన్స్‌ విచారణ కొనసాగుతోందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్‌పై మరో వైపు జ్యూడిషియల్‌ విచారణ కోసం హైకోర్టు చీఫ్‌ జడ్జికి లేఖ రాశామనీ, అనుమతి రాగానే విచారణ ప్రారంభమవుతుందని తెలిపారు. ఏడాది చివరి కల్లా 4.5 లక్షల ఎకరాల నుంచి 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నీటి పారుదల శాఖలో గత పాలకులు ఓ ప్రణాళిక లేకుండా నిర్మాణాలు చేపట్టడం వల్ల అప్పులు పెరిగాయే తప్ప కొత్తగా అయకట్టు సాగులోకి రాలేదన్నారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా అవసరమైన నిధులను ఖర్చు చేసి కొత్త ఆయకట్టు సష్టించాలని సూచించారు. కష్ణ, గోదావరి పరివాహకంలో 18 ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను సత్వరమే పూర్తి చేయడంతో పాటు రాబోయే ఐదేండ్లలో ఏ ప్రాజెక్టు కింద ఎన్ని ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయో సమాచారం సిద్ధం చేయాలని ఆదేశించారు. వేసవి కాలంలోపు రాష్ట్రంలోని చెరువుల పూడికతీత, జంగిల్‌ కటింగ్‌ పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. మంథని నియోజక వర్గానికి నీరందించే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సూచన మేరకు కోయిన ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీ నీటితో పాటు విద్యుత్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని తెలిపారు. ఈ సమీక్షలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జ, ఈఎన్‌సీ మురళీధర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Spread the love