– వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్
– వర్చువల్ గా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
నవతెలంగాణ-పటాన్‌చెరు
ప్రజలను భాగ్యస్వామ్యం చేసేందుకే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పటాన్‌చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం దగ్గర శనివారం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ప్రారంభించారు. వర్చువల్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసేలా గ్రామాల్లో ప్రత్యేక ప్రచార రథాలు తిరిగనున్నాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పేదరికం తెలిసిన వ్యక్తి అని, మహిళల ఆత్మ గౌరవాన్ని దష్టిలో పెట్టుకొని మహిళలకు 10 కోట్ల మందికి మరుగుదొడ్లు మంజూరు చేసి అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. యూపీలో అరేళ్లలో 50 లక్షల మందికి ఇండ్లు నిర్మించామన్నారు. తెలంగాణలో 2 లక్షల ఇండ్లు కూడా కట్టలేదని విమర్శించారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద 35 లక్షల మందికి ఎకరానికి రూ.6 వేలు ఇస్తున్నామని తెలిపారు. ఎరువుల సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తుందని గుర్తు చేశారు. ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా 10 కోట్ల మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చామన్నారు. ప్రతి పల్లెలకు ప్రధాని నరేంద్ర మోడీ గ్యారెంటీ పేరు మీద ప్రచార రథాలు వస్తున్నాయన్నారు. దేశంలోని 81 కోట్ల పేద ప్రజలకు గత రెండు సంవత్సరాలుగా ఒకరికి చొప్పున 5 కిలోల బియ్యం ఇస్తున్నామని తెలిపారు. పేదలకు ఏదైనా జబ్బు చేస్తే ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వర్తిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, డిఎల్పిఓ సతీష్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, రుద్రారం గ్రామ సర్పంచ్ సుదీర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.