వికసిత్‌ తెలంగాణ పత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం

వికసిత్‌ తెలంగాణ పత్రాన్ని త్వరలో విడుదల చేస్తాం– ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ప్రజలకు ఏం చేస్తాం? మా ప్రణాళిక ఏంటి? అనే దానిపై ప్రజల ముందు స్పష్టంగా ఉంచుతామనీ, త్వరలోనే వికసిత్‌ తెలంగాణ పత్రాన్ని విడుదల చేస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 21 రాష్ట్రాల్లో ఓటింగ్‌ సరళి చూస్తుంటే మోడీ మేనియా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణలోనూ 12 సీట్లు గెలుస్తామనే నమ్మకం కలుగుతోందన్నారు. 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారనీ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలేమో ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరిపోతున్నారని చెప్పారు. నవంబర్‌, డిసెంబర్‌ మళ్లీ ఎన్నికలు వస్తాయనీ, అధికారంలో బీఆర్‌ఎస్‌ వస్తుందని కేసీఆర్‌ జోస్యం చెబుతున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన పదవి ఎక్కడ పోతుందో అన్న అభద్రతాభావంలో ఉన్నారని చెప్పారు. ప్రజల ఆలోచనలను డైవర్ట్‌ చేసేందుకు బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ లు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాయని విమర్శించారు. అధికారం పోయినా కేసీఆర్‌, కేటీఆర్‌ అహంకారం తగ్గలేదన్నారు. కేసీఆర్‌ బస్సుయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు భవిష్యత్తు లేదన్నారు. రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల మార్పు ఉండదనీ, తెలంగాణలో ప్రచారానికి ఏపీ కూటమి నేతలెవ్వరూ రారని చెప్పారు.

Spread the love