మ‌ళ్లీ ల్యాండైన విక్ర‌మ్‌..

నవతెలంగాణ- న్యూఢిల్లీ: చంద్ర‌యాన్‌-3 మిష‌న్ సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్‌గా కొన‌సాగుతోంది. తాజాగా విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను మ‌ళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. చంద్రుడి ఉప‌రిత‌లంపై మ‌రో చోట విక్ర‌మ్ ల్యాండైంది. దీనికి సంబంధించిన విష‌యాన్ని ఇస్రో ఇవాళ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో వెల్ల‌డించింది. తాము ఇచ్చిన క‌మాండ్‌కు విక్ర‌మ్ స‌క్ర‌మంగా స్పందించిన‌ట్లు ఇస్రో చెప్పింది. ఆగ‌స్టు 23వ తేదీన తొలిసారి చంద్రుడి ద‌క్షిణ ద్రువంపై విక్ర‌మ్ ల్యాండైన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మిష‌న్ ల‌క్ష్యంలో భాగంగా ఆ ల్యాండ‌ర్‌ను మ‌రో చోట దించారు. దీని కోసం నిర్వ‌హించిన హాప్ ఎక్స్‌ప‌రిమెంట్ విజ‌య‌వంతం అయిన‌ట్లు ఇస్రో తెలిపింది. క‌మాండ్ ఇచ్చిన త‌ర్వాత విక్ర‌మ్ ల్యాండ‌ర్ ఇంజిన్లు ఫైర్ అయ్యాయని, ఆ త‌ర్వాత ఆ ల్యాండ‌ర్ దాదాపు 40 సెంటీమీట‌ర్ల మేర‌కు పైకి లేచి.. సుమారు 30 నుంచి 40 సెంటీమీట‌ర్ల దూరంలో సుర‌క్షితంగా ల్యాండ్ అయిన‌ట్లు ఇస్రో వెల్ల‌డించింది. ఈ మిష‌న్‌కు చెందిన వీడియోను కూడా ఇస్రో త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది. విక్ర‌మ్ ల్యాండ‌ర్ చేప‌ట్టిన ప్ర‌యోగం చాలా కీల‌క‌మైంద‌ని ఇస్రో తెలిపింది.

Spread the love