శోక సంద్రంగా నేపాల్‌ గ్రామాలు

Villages of Nepal mourn– మృతులకు సామూహిక అంత్యక్రియలు
– క్షతగాత్రులకు ఉచిత వైద్యం : ప్రభుత్వ ప్రకటన
– మరోసారి ప్రకంపనలు
ఖాట్మండు : భారీ భూకంపం నుంచి నేపాల్‌ గ్రామాలు ఇంకా తేరుకోలేదు. శుక్రవారం రాత్రి భూకంపం సంభవించగా, ఇప్పటివరకూ వారికి పూర్తిస్థాయిలో సహాయం లభించడం లేదు. కొన్ని గ్రామాల్లో తాగడానికి మంచి నీరు కూడా లేని పరిస్థితి నెలకొంది. 6.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపంతో జాజర్‌కోట్‌, వెస్ట్‌ రుకుమ్‌ జిల్లాల్లోని గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. రెండు జిల్లా ల్లోనూ 157 మంది మరణించగా, సుమారు 400 మంది గాయపడిన సంగతి తెలిసిందే. వందల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. గ్రామస్తులం తా కలిసి మృతులకు సామూహికంగా అంత్యక్రియ లు నిర్వహిస్తున్నారు.
ట్రాక్టర్లతో దుంగలు, మృతదేహాలను శ్మశాన వాటికలకు తరలించి అంతిమ సంస్కారాలు జరిపిస్తున్నారు. మరణించిన వారిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి భూకంపం రావడంతో ఎక్కువమంది నిద్రలోనే కన్నుమూశారు. కొన్ని చోట్ల కుటుంబాలు కుటుంబాలే మరణించడం లేదా కుటుంబంలో ఒక్కరే సజీవంగా ఉండడంతో ఆయా మృతదేహాల కు అంత్యక్రియలు చేసేవారే లేకుండా పోయారు. అనాథ శవాల్లా వాటికి అంత్యక్రియలు జరిపించాల్సి వచ్చిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను తరలించడం, శిథిలాల ను తొలగించడం వంటి పనులను గ్రామస్తులే నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడే ఇండ్లు కట్టుకోలే మని, ఈలోగా టెంట్లు, పరుపులు తదితర సామగ్రి ప్రభుత్వం అందజేస్తే ఈ చలిలో వాటితోనే గడుపుతామని ఒక గ్రామస్థుడు చెప్పారు.
క్షతగాత్రులకు ఉచిత వైద్యం
భూకంపం వల్ల గాయపడిన వారికి అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించాలని నేపాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున అందించనున్నట్టు ప్రకటించింది. ఆదివారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం తరువాత ఆరోగ్య శాఖ మంత్రి మోహన్‌ బహదూర్‌ బస్నెట్‌ విలేకరులతో మాట్లాడుతూ.. సహాయక కార్యకలాపాలు ముగింపు దశకు చేరుకున్నాయని, ఖాట్మండుతో సహా అన్ని ప్రదేశాల్లో ఆస్పత్రులను భూకంప బాధితుల చికిత్స కోసం సిద్ధంగా ఉంచామని తెలిపారు. విదేశాలు అందించే సహాయాన్ని ఎలా సమీకరించాలనే దానిపై తదుపరి సమావేశంలో చర్చిస్తామమని చెప్పారు.
మళ్లీ భూకంపం
శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపం నుంచి నేపాల్‌ తేరుకోకముందే ఆదివారం తెల్లవారు జామున మరో భూకంపం వచ్చింది. 4:38 గంటల సమయంలో 3.6 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. రాజధాని ఖాట్మండుకు వాయువ్యం గా 169 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్ర ఉందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలియజేసింది. శనివారం మధ్యాహ్నం 3.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు వివరించింది.

Spread the love