పీటీ ఉష‌పై వినేశ్ ఫోగ‌ట్ ఫైర్‌..

నవతెలంగాణ – న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్ల‌ర్ వినేశ్ ఫోగ‌ట్‌.. 53 కిలోల ఫ్రీ స్ట‌యిల్ రెజ్లింగ్ ఫైన‌ల్ రోజున అధిక బ‌రువుతో అన‌ర్హ‌త వేటుకు గురైన విష‌యం తెలిసిందే. ఆ రోజున నీర‌సించిన వినేశ్‌కు ఒలింపిక్స్ విలేజ్‌లోని క్లినిక్‌లో చికిత్స చేశారు. ఆ స‌మ‌యంలో భార‌త ఒలింపిక్ సంఘ అధ్య‌క్షురాలు పీటీ ఉష‌.. ఆ రెజ్ల‌ర్‌ను ప‌రామ‌ర్శించారు. అయితే ఆ ఇద్ద‌రి భేటీకి చెందిన ఓ ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఆ ఫోటోపై ఇప్పుడు రెజ్ల‌ర్ వినేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓ ఫోటో క్లిక్ చేసి, ఆ అంశాన్ని రాజ‌కీయం చేసిన‌ట్లు రెజ్ల‌ర్ ఆరోపించారు. పీటీ ఉష వ్య‌వ‌హ‌రించిన తీరును వినేశ్ త‌ప్పుప‌ట్టారు. త‌న‌కు తెలియ‌కుండా ఫోటో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశార‌ని పీటీ ఉష‌పై వినేశ్ ఫోగ‌ట్ ఆరోప‌ణ‌లు చేశారు.  పీటీ ఉష నుంచి త‌న‌కు ఎటువంటి మ‌ద్ద‌తు ల‌భించ‌లేద‌ని రెజ్ల‌ర్ వినేశ్ తెలిపారు. త‌న‌కు ఎటువంటి మ‌ద్ద‌తు ల‌భించిందో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఓ స్థానిక న్యూస్ ఛాన‌ల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఆమె మాట్లాడుతూ.. పీటీ ఉష మేడం హాస్పిట‌ల్‌ను త‌న‌ను క‌లిశార‌ని, ఓ ఫోటో తీశార‌ని, మీరు చెప్పిన‌ట్లే, రాజ‌కీయాల్లో తెర‌వెనుక చాలా జ‌రుగుతుంద‌న్నారు. అలాగే పారిస్‌లోనూ రాజ‌కీయం జ‌రిగింద‌న్నారు. అందుకే త‌న గుండె ప‌గిలింద‌ని, రెజ్లింగ్ వీడ‌వ‌ద్దు అని చాలా మంది వేడుకున్నార‌ని, ఎక్క‌డ‌కు వెళ్లిన రాజ‌కీయం ఉంద‌ని వినేశ్ తెలిపారు.

Spread the love