కంపెనీల చట్టాన్ని ఉల్లంఘించారు

– అదానీ పవర్‌పై కంపెనీల రిజిస్ట్రార్‌ తీర్పు
– జరిమానాల వడ్డింపు

న్యూఢిల్లీ : గౌతమ్‌ అదానీ నేతృత్వంలోని అదానీ పవర్‌ కంపెనీ రెండు వేర్వేరు సందర్భాలలో కంపెనీల చట్ట నిబంధనలను ఉల్లంఘించిందని కంపెనీల రిజిస్ట్రార్‌ గుజరాత్‌ కార్యాలయం ఈ నెల ప్రారంభంలో తీర్పు చెప్పింది. 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలలో కొన్ని లావాదేవీలను బయటపెట్టనందుకు అదానీ పవర్‌ను దోషిగా తేల్చింది. దీనికి సంబంధించి కంపెనీ ఛైర్‌పర్సన్‌ గౌతమ్‌ అదానీ, ఆయన సోదరుడు రాజేష్‌ అదానీ, కంపెనీ సీఈఓ వినీత్‌ ఎస్‌ జైన్‌లకు రూ. 75,000 చొప్పున జరిమానా విధించింది. 2014-15, 2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వార్షిక రిటర్న్‌లు దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు కూడా ఆ కార్యాలయం కంపెనీని తప్పు పట్టింది. దీనికి సంబంధించి అదానీ పవర్‌ కంపెనీ, దానికి చెందిన ముగ్గురు అధికారులకు రూ. 10,200 చొప్పున జరిమానాలు విధించింది. ఈ రెండు సందర్భాలకు సంబంధించి ఈ నెల 8న జారీ చేసిన ఆదేశాలు 15వ తేదీన అందుబాటులోకి వచ్చాయి.
కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 189 ప్రకారం సంస్థలు తాము కుదుర్చుకునే ఒప్పందాలకు సంబంధించిన లావాదేవీలను వెల్లడించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను పాటించడంలో అదానీ కంపెనీ విఫలమైందని కంపెనీల రిజిస్ట్రార్‌ గుజరాత్‌ కార్యాలయం అధికారి ఆర్‌సీ మిశ్రా తీర్పు చెప్పారు. అప్పటికే వ్యాపార సంబంధాలు ఉన్న రెండు పక్షాల మధ్య కుదిరే ఒప్పందాలే ఈ లావాదేవీలు. ఇలాంటి లావాదేవీలను నమోదు చేసి అధికారులకు, కంపెనీ బోర్డుకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రయోజనాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నివారించేందుకు లావాదేవీలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో కొన్ని మినహాయింపులు ఉంటాయంటూ అదానీ పవర్‌ చేసిన వాదనను అధికారి తోసిపుచ్చారు.
కంపెనీల చట్టంలోని సెక్షన్‌ 92 (4) ప్రకారం వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసిన 60 రోజుల లోగా సంస్థలు తమ వార్షిక రిటర్న్‌లను కంపెనీల రిజిస్ట్రార్‌కు సమర్పించాలి. అయితే అదానీ పవర్‌ కంపెనీ సమర్పించిన రిటర్న్‌లలో వాటాదారుల వివరాలను చేర్చలేదు. ఈ కేసులో రాజేష్‌ అదానీ, వినీత్‌ ఎస్‌ జైన్‌తో పాటు కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి వినోద్‌ భందావత్‌లకు జరిమానా విధించారు. అదానీ పవర్‌పై వచ్చిన తీర్పు ప్రతిని కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ సామాజిక మాధ్యమాలలో షేర్‌ చేశారు.

Spread the love