– జమిలికి మేం వ్యతిరేకం
– కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై బీజేపీ సర్కారు వివక్ష
– సర్వమత సమ్మేళనమే కాంగ్రెస్ వైఖరి
– ‘ఇండియా’ కూటమిని బలోపేతం చేయాలి
– 5 రాష్ట్రాల ఎన్నికల్లో వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటు
– సీడబ్ల్యూసీ సమావేశంపై కాంగ్రెస్ నేత చిదంబరం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్ పార్టీ జమిలి ఎన్నికల ప్రతిపాదనను తిరస్కరిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం తెలిపారు. జమిలి ఎన్నికలు నిర్వహించడమంటే రాష్ట్రాల హక్కులను అణచివేయటమేనని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలు నిర్వహించాలంటే అనేక రాజ్యాంగ సవరణలు అవసరమనీ, దానికి తగిన సంఖ్యా బలం అధికార పక్షానికి లేదని చెప్పారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు శుక్రవారంనాడిక్కడి ఓ ఐదు నక్షత్రాల హౌటల్‌లో ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో సోనియాగాంధీ, రాహూల్‌గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సీడబ్ల్యుసీ సభ్యులు జైరాంరమేష్, పవన్‌ఖేరాతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి అశాజనకంగా ఉందన్నారు. ఇండియా కూటమిని బలోపేతం చేయాలని సీడబ్ల్యూసీ సభ్యులు అభిప్రాయపడ్డారని చెప్పారు. వీలైనంత వేగంగా సీట్ల సర్దుబాటు ఖరారు కావాలని అభిప్రాయపడ్డారని వివరించారు. సనాతన ధర్మం కాదనీ, సర్వమత సమ్మేళనమే కాంగ్రెస్ కోరుకుంటోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో రాజకీయ, ఆర్ధిక, భద్రతా సవాళ్లకు సంబంధించి స్ధూలంగా ముసాయిదా తీర్మానంలో ప్రస్తావించామని తెలిపారు. రాజ్యాంగం, ఫెడరల్ వ్యవస్ధలు బలహీనపడుతున్నాయనీ, రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గిపోయాయనీ, వాటి బాధ్యతల నిర్వహణలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షను ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. కర్ణాటకలో బియ్యం పంపిణీకి సంబంధించిన హామీ నెరవేరకుండా కేంద్రం ఎఫ్‌సీఐకి ఆదేశాలు పంపిందని తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రకృతి వైపరీత్యం సంభవించినా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. మాణిపూర్‌లో పరిస్ధితులు తీవ్రంగా, ఉద్రేకంగా ఉన్నా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పర్యటించకపో వటం దురదృష్టకరమని అన్నారు. కాశ్మీర్‌లో సాధార ణ పరిస్థితులు లేవనీ, దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్ధితులు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర సరిహద్దుల్లో చైనా దళాలు ఒక్క అంగుళం కూడా వెనక్కు తగ్గటం లేదనీ, చొరబాటు కొనసాగుతూనే ఉందనీ, భారతదేశం తన భూభాగాన్ని కోల్పోతున్నదని చెప్పారు. దేశంలో ఆర్థిక, ఆహార ద్రవ్యోల్బణం పెరగటంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేకపోతున్నదని విమర్శించారు. మరోవైపు దేశంలో నిరుద్యోగం పెరిగి, ఆర్థిక వృద్ధి తగ్గుతున్నదనీ, ఏడు నెలలుగా ఎగుమతులు తగ్గిపోయి, తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడుతున్నదని అన్నారు. మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రధాని మోడీ తనకేమీ పట్టనట్టు వ్యవహరించారని విమర్శించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో తొమ్మిది అంశాలపై చర్చించాలంటూ కేంద్రాన్ని కోరుతూ సోనియాగాంధీ లేఖ రాశారని తెలిపారు. ఆ లేఖకు ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. కాంగ్రెస్ తలపెట్టిన భోపాల్ ప్రదర్శన ఎందుకు రద్దు చేశారో తమకు సమాచారం లేదని వివరించారు. జైరాం రమేష్ మాట్లాడుతూ సీడబ్ల్యూసీ సమావేశంలో కేరళ కాంగ్రెస్ నేత ఉమెన్ చాందీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ తీర్మానం చేసినట్టు తెలిపారు. అలాగే మణిపూర్ దుస్సంఘటనల్లో ప్రాణాలు కొల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ మరో తీర్మానం కూడా ఆమోదించామన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతూ మరో తీర్మానాన్ని కూడా సీడబ్ల్యూసీ సమావేశం ఆమోదించిందని తెలిపారు.
కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల
మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే…ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కర్నాటక సీఎం సిద్దరామయ్య, కేసీ.వేణుగోపాల్, రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి చేరారు. హైదరాబాద్‌లో తన నివాసంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం ఉదయం కార్యకర్తల సమావేశం… ఆ తర్వాత డోర్ టు డోర్ ఐదు హామీల కరపత్రాల పంపిణీ, దీంతోపాటు బీఆర్‌ఎస్ వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేస్తారు. మధ్యాహ్నం కార్యకర్తలతో కలిసి సామూహిక భోజనాలు, సాయంత్రం గాంధీ, అంబేద్కర్, కొమురంబీమ్ విగ్రహాల వద్ద భారత్ జోడో మార్చ్ నిర్వహిస్తారు.