మహిళలపై హింస మానవ హక్కుల ఉల్లంఘన

Towards Beijing +30: UNiTE to End Violence Against Women and Girls”నేల సగం – నింగి సగం.. మహిళదే. కానీ అవకాశాల్లోనే సుదూరంగా వుంది. ఇక హింస గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అన్ని రంగాల్లో తన శక్తియుక్తులను చాటుకుంటున్నా హింసను భరిస్తూనే ఉన్నది. నేడు మహిళలపై హింసా నిర్మూలన దినం సందర్భంగా నేటి సమాజంలో స్త్రీల స్థితిగతులపై మహిళా ఉద్యమ నేతల అధ్యయనం…
ప్రతి ఏడాది నవంబర్‌ నెలలో 14 తేదీ నుండి పిల్లల హక్కుల క్యాంపెయిన్‌ జరుగుతుంది. నవంబర్‌లోనే ట్రాన్స్‌ జెండర్‌ మృతులను జ్ఞాపకం చేసుకునే రోజు జరుపుకుంటాం. నవంబర్‌ 25 నుండి డిశెంబర్‌ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినం వరకు 16 రోజులపాటు స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవగాహనా సదస్సులు, కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ఈ ప్రదర్శనలు జరుతాయి. ఈ ఏడాది నినాదం Towards Beijing +30: UNiTE to End Violence Against Women and Girls”గా యూ.ఎన్‌ పేర్కొన్నది. 16 రోజుల ఏక్టివిజం రావడానికి ముగ్గురు మహిళల పోరాటం, ఆత్మ త్యాగం ముఖ్యమైనవి.
1960లో డొమినికన్‌ రాజ్యంలో పాట్రియా, మినెర్వా, మారియా అనే పేర్లతో అక్కచెల్లెళ్ళు ఆ దేశ నియంత మీద పోరాటం చేసి ధైర్యంగా నిలబడినప్పుడు రాజు వారిని హత్య చేయించాడు. ఆ తర్వాత వారు ముగ్గురూ ‘మీరా బెల్‌ సోదరీమణులు’గ ప్రాచుర్యం పొందారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింసకు ప్రతీకగా నిలిచింది. 1999లో ఐక్య రాజ్య సమితి ఈ రోజు అధికారికంగా గుర్తించి మహిళలపై హింసకు వ్యతిరేక దినంగా ప్రకటించి ఒక థీంతో జరుపుతోంది. ఈ పదహారు రోజులూ మహిళలకు వివిధ కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తుంటారు.
అవగాహన పెంచాలి
ప్రపంచవ్యాప్తంగా ఈ నాడు నెలకొన్న భయానక వాతావరణం, యుద్ధాలు, పెట్రేగిపోతున్న మతోన్మాద శక్తులు స్త్రీల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. గ్రామ స్థాయి నుంచి గ్లోబల్‌ స్థాయి వరకు ఎలాంటి తేడాలు లేకుండా హింస స్త్రీల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఇంట్లో కుటుంబ హింస, పనిచేసే చోట లైంగిక వేధింపులు, పబ్లిక్‌ స్థలాల్లో లైంగిక దాడులు పెచ్చుమీరిపోతున్నాయి. స్త్రీలకు, పిల్లలకు రక్షణ లేని పరిస్థితులు పెరిగిపోతున్నాయి. ఈ హింసలను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఎన్నో రక్షణ చట్టాలను చేసింది. గృహహింస నిరోధక చట్టం 2005, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిషేద చట్టం 2013, పిల్లల మీద లైంగిక దాడుల నిసేధ చట్టం 2012… ఇలా ఎన్నో చట్టాలు వచ్చాయి. అయినా ఎందుకు హింస తగ్గడం లేదు అనేది తప్పకుండా ఆలోచించాల్సిన అంశం. ఈ చట్టాల అమలు తీరు పేలవంగా ఉండడం, నేరాలకు సరైన శిక్షలు సకాలంలో పడకపోవడం ముఖ్య కారణాలు. ఉదాహరణకి గృహ హింస నిరోధక చట్టంలో కేసు తీర్పు 60 రోజుల్లో రావాలి. కానీ ఆరేండ్లకు కూడా రాని పరిస్థితి. న్యాయ స్థానాల్లో కేసులు పేరుకుపోవడం తప్ప స్త్రీలకు ఎలాంటి న్యాయమూ జరగకపోవడం వల్ల హింసలో మగ్గుతున్న స్త్రీలకు ఎలాంటి వెసులుబాటు దొరకడం లేదు.
పోరాటమే ఆయుధం
అన్ని రంగాల్లోను బలంగా వేళ్ళూనుకునిపోయిన పితృస్వామ్యం స్త్రీలకు ఎలాంటి న్యాయమూ అందనివ్వడం లేదు. స్త్రీలపై హింస తగ్గాలంటే అన్ని చట్టాలను కఠినంగా అమలుచెయ్యాలి. నేరానికి తగిన శిక్షలను విధించి అమలు చెయ్యాలి. తమ కోసం అమలులో ఉన్న చట్టాల గురించి మహిళలకు పెద్ద ఎత్తున అవగాహన కలిగించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక సపోర్ట్‌ సిస్టమ్‌ల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలి. అంటే పల్స్‌ పోలియో గురించి ఏ స్థాయిలో ప్రచారం చేసి అవగాహన కలిగించారో ఆ స్థాయిలో చట్టాల గురించి, సహాయ సంస్థల గురించి ప్రచారం చెయ్యాలి. 181 హెల్ప్‌లైన్‌ ఉందని, భూమిక హెల్ప్‌లైన్‌కి ఫోన్‌ చేసి మీ సమస్యలు చెప్పుకోండని, సఖి సెంటర్‌లు మీ కోసమే ఉన్నాయి, వచ్చి మీ సమస్యలను పంచుకోండి లాంటి క్యాంపెయిన్స్‌ పెద్ద ఎత్తున చేపట్టి హింసలో నలుగుతున్న మహిళలకు అండగా ఉంటే వారిపై జరుగుతున్న హింస కొంతవరకైనా తగ్గే అవకాశం ఉంది. కుటుంబం, సమాజం, రాజకీయ నాయకులు స్త్రీల మీద హింసను వారి మానవ హక్కుల ఉల్లంఘనగా అర్థం చేసుకుకి దానికి తగిన ఆచరణకు సిద్ధమైనప్పుడు స్త్రీలపై హింస అంతమౌతుంది. అంతవరకు పోరాటమే ఆయుధం.
– కొండవీటి సత్యవతి

Spread the love