మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస..

నవతెలంగాణ – ఇంఫాల్‌: మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. కాంగ్‌పోక్పీ జిల్లాలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఐఆర్‌బీ జవాన్‌ సహా మరో పౌరుడు మృతిచెందారు. సోమవారం రాత్రి హరోథెలా, కోబ్షా గ్రామాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఐఆర్‌బీ జవాన్‌, వారి వ్యాన్‌ నడుపుతున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తోటి సిబ్బంది వారిని హుటాహుటిన దవాఖానకు తరలించినప్పటికీ లాభం లేకుండా పోయిందని అధికారులు చెప్పారు. మృతులను హెన్మిన్లెన్ వైఫే, తంగ్మిన్‌లున్ హాంగ్సింగ్‌గా గుర్తించామన్నారు. కాల్పులకు సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈనేపథ్యంలో ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించామని చెప్పారు. దాడి ఘటనతో సంబంధమున్నవారి కోసం గాలిస్తున్నామన్నారు. కాగా, కుకీ-జో కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకున్నారని ఓ గిరిజన సంస్థ ప్రకటించింది. దీంతో జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.

Spread the love