నవతెలంగాణ – మణిపూర్: ఇరు వర్గాల ఘర్షణలతో మణిపూర్ మే 3 నుంచి భగ్గుమంటూనే ఉంది. కుకీ వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలతో నెలకొన్న ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని చింగరేల్‌లో మణిపూర్ మంత్రి ఎల్ సుసింద్రో ప్రైవేట్ గోడౌన్‌కు కొందరు నిప్పంటించారు. శుక్రవారం రాత్రి ఆందోళనకారులు ఈ గోడౌన్‌కు నిప్పంటించడంతో ఇది పూర్తిగా దగ్ధమైందని పోలీసులు తెలిపారు. ఇదే జిల్లాలోని ఖురై ప్రాంతంలో మణిపూర్ ఆహార శాఖ మంత్రి నివాసానికి కొందరు నిప్పంటించే ప్రయత్నం చేశారు. సకాలంలో పోలీసులు వీరిని అడ్డగించడంతో వారి ప్రయత్నం విఫలమైంది. మంత్రి నివాసం నుంచి ఆందోళనకారులను చెద్దరగొట్టేందుకు పోలీసులు పలు మార్లు భాష్ప వాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనల్లో ఎవరికి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలతో నిరాశ్రయులైన వారికి ఇండ్లను నిర్మించేందుకు అవసరమైన స్ధలాలను మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ పరిశీలించిన కొద్దిసేపటికే మంత్రి గోడౌన్, నివాసంపై దాడులు జరగడం విశేషం.