అభిమానులకు విరాట్ బర్త్ డే కానుక.. సఫారీల ముందు టార్గెట్

నవతెలంగాణ – హైదరాబాద్: భారత క్రికెట్‌ అభిమానులతో పాటు యావత్‌ ప్రపంచ క్రికెట్‌ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం ఈడెన్‌ గార్డెన్స్‌ లో సాక్షాత్కారమైంది. పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ.. భారత  బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌  టెండూల్కర్‌ వన్డేలలో నెలకొల్పిన 49 సెంచరీల రికార్డును సమం చేశాడు.  నేడు 35వ  పుట్టినరోజు జరుపుకుంటున్న బర్త్‌ డే బాయ్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీ (121 బంతుల్లో 101 నాటౌట్‌,  10 ఫోర్లు)కి తోడు  శ్రేయస్‌ అయ్యర్‌ (87 బంతుల్లో 77, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ  (24 బంతుల్లో 40, 6 ఫోర్లు, 2 సిక్సర్లు)   మెరుపులతో భారత్‌  నిర్ణీత 50 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.  కోహ్లీకి  వన్డేలలో ఇది 49వ  సెంచరీ కాగా మొత్తంగా 79వది.  0.3 ఓవర్లలో 93 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన  భారత్‌ను  కోహ్లీ – అయ్యర్‌ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ  కుదురుకునేదాకా   కాస్త నెమ్మదిగా ఆడినా  క్రీజులో  సెట్‌ అయ్యాక  సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కోహ్లీ అర్థ సెంచరీ 67 బంతుల్లో పూర్తికాగా  శ్రేయస్‌ 64 బంతుల్లో హాఫ్‌  సెంచరీ కంప్లీట్‌ చేశాడు. అర్థ సెంచరీ తర్వత జోరు పెంచిన  అయ్యర్‌.. భారీ షాట్లు ఆడాడు. దీంతో భారత స్కోరు పరుగులెత్తింది. మూడో వికెట్‌ కు 158 బంతుల్లో 134 పరుగులు జోడించారు. అయ్యర్‌ నిష్క్రమించాక  వచ్చిన కెఎల్‌ రాహుల్‌ (7)  మరోసారి విఫలమయ్యాడు. ఆరో స్థానంలో వచ్చిన  సూర్యకుమార్‌ యాదవ్‌  14 బంతుల్లో ఐదు బౌండరీల సాయంతో 22 పరుగులు చేశాడు. కానీ షంసీ వేసిన 46వ ఓవర్లో ఆఖరి బంతికి   రివర్స్‌ స్వీప్‌ ఆడబోయి   వికెట్‌ కీపర్‌ డికాక్‌ అద్భుత క్యాచ్‌ పట్టడంతో  పెవిలియన్‌ చేరాడు.
కోహ్లీ సెంచరీ..
70 పరుగుల తర్వాత  నెమ్మదించిన  కోహ్లీ..  90లలోకి వచ్చాక.. రబాడా వేసిన 47వ ఓవర్లో ఐదో బంతికి  బౌండరీ  బాది సెంచరికి చేరువగా వచ్చాడు.  షంసీ వేసిన మరుసటి ఓవర్లోనే కోహ్లీ సెంచరీ కోసం వేచి చూసినా  ఆ ఓవర్లో  విరాట్‌ రెండు పరుగులే రాబట్టాడు. రబాడా వేసిన 49వ ఓవర్లో  మూడో బంతికి సింగిల్‌ తీసిన కోహ్లీ..  సెంచరీ పూర్తిచేసుకున్నాడు.  49 సెంచరీలు చేయడానికి సచిన్‌కు 452 ఇన్నింగ్స్‌  అవసరం  కాగా.. 277 ఇన్నింగ్స్‌లలోనే కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 29 నాటౌట్‌ , 3 ఫోర్లు, 1 సిక్సర్‌) మెరుపులతో  భారత్‌ 326 పరుగులు చేయగలిగింది.

Spread the love