విశాఖ స్టీల్‌ ప్రయివేటుపరం కానివ్వం

– వేల కోట్లు నష్టాలు వస్తే ఎవరూ ఆదుకోరు: ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు
అమరావతి : విశాఖ స్టీలు ప్లాంటును ఎట్టి పరిస్థితుల్లో ప్రయివేటుపరం కాకుండా కాపాడుకుంటామని, ఉక్కుఫ్యాక్టరీ రాష్ట్రానికి సెంటిమెంటని, వాజ్‌పేయి హయాంలోనూ తాము అదనపు నిధులు ఇచ్చి ఆదుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విశాఖ స్టీలుపై మాట్లాడారు. ఇటీవల కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో దీనిపై సమావేశం జరిగిందని తెలిపారు. కొంత డబ్బు విడుదల చేసి ప్లాంటును నిర్వహించేం దుకు కేంద్ర స్టీలు మంత్రిత్వశాఖ ముందుకు పోతోందని తెలిపారు. శాశ్వతంగా దాన్ని లాభాల బాట పట్టించు కోవాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందని, దీన్ని కూడా ఉద్యోగులు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ఆలోచిం చాలని సూచించారు. అదే సమయంలో దేశంలో ప్రయివేటు ప్లాంట్లు బాగున్నాయని, మంచి ప్లాంటయిన విశాఖ స్టీలు మాత్రం నష్టాల పాలవుతోందని, ఇలా ఎందుకు జరుగుతుందో యాజమాన్యం ఆలోచించు కోవాలని అన్నారు. ముఖ్యమంత్రిగా తాను కూడా దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. అదే సమయంలో వేలకోట్లు నష్టం వస్తే ఎవరో ఒకరు ఆదుకుంటారంటే అది అవివేకమని తెలిపారు. లాభాల బాట పట్టించేందుకు కష్టపడాలని, తెలివి తేటలు ఉపయోగించాలని అన్నారు. ”విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” నినాదాన్ని నిలబెట్టాలంటే అందరిలోనూ మార్పు రావాలని తెలిపారు. ఆ ప్లాంటు రాష్ట్రంలోనే పెద్దదని, ఒక సెంటిమెంటని ముఖ్యమంత్రి అన్నారు. అలాగని ప్రతిరోజూ సెంటిమెంటు అని కూర్చుంటే సహకరించే వారు ఉండరని, ఒకటి, రెండుసార్లు అంటే ఫర్వాలేదని పేర్కొన్నారు. అనునిత్యం అదే మాట్లాడటం కరెక్టు కాదనీ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంటును ప్రయివేటుపరం కాకుండా కాపాడుకునేందుకు సర్వవిధాలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా ప్రయివేటుపరం కాకుండా ఆపాలని కేంద్రాన్ని కోరని వైసిపి నాయకులు ఇప్పుడు రెచ్చగొట్టి శవాల ముందు చలికాచుకునే పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాంటు రక్షణ కోసం తాను ప్రతిపక్షంలో ఉండగా ఢిల్లీ వెళితూ రావాలని కోరితే ఎవరూ స్పందించలేదని తెలిపారు. ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారనే ఆలోచనతో వైసిపి నాయకులు ఉన్నారని, అటువంటి రోజులు పోయాయని తెలిపారు. మొన్నటి వరకూ అధికారంలో ఉండి ప్రజలను మభ్య పెట్టారని పేర్కొన్నారు. విశాఖపట్నం స్టీలు ప్లాంటును బాధ్యతో ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుం టామని తెలిపారు. విశాఖ తెలుగుదేశం పార్టీకి ఎన్‌డిఎ కి గట్టి కేంద్రమనీ అన్నారు. అటువంటి చోట్ల ప్లాంటును కాపాడుకోవడం తమ బాధ్యతని వివరించారు.

Spread the love