ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ఏదో అసాధారణ సందర్భమైనట్టు ప్రచారం జరిగింది. అమెరికా స్టేట్ విజిట్(ప్రభుత్వ పర్యటన)కు ఆహ్వానించడం, అరుదైన గౌరవంగానూ మీడియా హైప్ ఇచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అది విశేషం కావచ్చు గాని అదేదో ప్రపంచానికే ప్రతిష్ట అన్నట్టు చెప్పడం కన్నా హాస్యాస్పదమైన విషయం మరోటి ఉండదు. అధికార, అనధికార పర్యటన, కార్యక్రమ పర్యటన, కార్యక్రమ సహిత అధికార పర్యటన ఇన్ని ఉంటాయట. వాస్తవానికి మొదటి రెండింటిలో అన్నీ కలసి ఉన్నాయి. కాని ప్రపంచాధిపత్య రాజకీయాలలో అమెరికా అనేక వ్యవహారాలు జరపడానికి వీలుగా అధ్యక్షుడికి మట్టి అంటకుండా ఇన్ని రకాలు నిర్ణయించారు. అధ్యక్షుడు ఆహ్వానిస్తేనే అది రాజ్య పర్యటన. ఇంతవరకూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మార్కోన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్లను మాత్రమే బైడెన్ ఆహ్వానించారట. అంటే మోడీకి ఎంత ప్రాధాన్యత అన్నది ఆనందం. అదెంత దూరం వెళ్లిందంటే మొదటిసారి శ్వేతసౌధం తలుపులు తనను పిలిచాయని ప్రధాని కూడా పరవశంగా ట్వీట్ చేసేంత! నిజానికి ఇండియా వంటి చరిత్ర ప్రతిష్ట కలిగిన దేశాధినేత మరో దేశానికి వెళ్లి అంతగా ఆనందోత్సహాలు వెలిబుచ్చడం దేనికి నిదర్శనమవుతుందో చెప్పనవసరం లేదు. మర్యాదల కింద వదిలేద్దాం. ఈ పర్యటన ఫలితాలేమిటి, భారత దేశం అమెరికా దృతకాష్ట్ర కౌగిలిలో చిక్కుకోవడం ఎటు దారితీస్తుంది ఇదివరకే ‘ప్రజాశక్తి’ వ్యాసాలలో వివరంగా ప్రస్తావించబడింది. కాగా విశ్వగురుగా మనకు మనం చెప్పుకుంటున్నా విశ్వవేదికపై మన ప్రజాస్వామ్యం పట్ల ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతోంది అనేది మీడియాలో అంతగా చర్చకు నోచుకోని మరో కోణం.
మస్క్నోట కూడా…
ఏదో సామెత చెప్పినట్టు ఇండియా పట్ల ప్రపంచ దేశాల తాజా అంచనా ఎలా ఉండి మోడీ వైట్‌హౌస్ చేరకముందే తెలిసిపోయింది. పారిశ్రామిక వేత్తలు వరసకట్టి ఆయనను కలుసుకుంటున్నారని పెద్ద హంగామా చేశారు. వారిలో ఒకరైన విపరీత వాణిజ్యవేత్త ఎలన్‌మస్క్ టెస్లా కార్ల కంపెనీ ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నారన్న వార్త బాగా ప్రచారంలో పెట్టారు. మస్క్ మోడీని కలుసుకున్నాక మీడియాతో మాట్లాడుతూ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే మీ యాజమాన్యంలోని ట్విటర్‌పై మోడీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందట కదా! అని విలేకరులు అడిగితే సమాధానం దాటేశారు. (రైతాంగ నిరసనలపై ట్విటర్ ఇవ్వడం పట్ల కేంద్రం అభ్యంతరాలు తెల్పిందనీ వాటిని తొలగించవలసి వచ్చిందని ట్విటర్ బాధ్యుడైన అంతకు ముందు ప్రకటించి ఉన్నారు) మళ్లీ మళ్లీ అడిగినప్పుడు ఏ దేశంలోనైనా అక్కడి చట్టాల ప్రకారమే పనిచేస్తుంటామని దాటవేత సమాధానమిచ్చారు.
ఇక స్టేట్ విజిట్ లేదా రాజ్య పర్యటనలో అదనపు ఆకర్షణ లాంఛనాలే. వాటిలో స్వాగతాలు విందులతో పాటు ఉమ్మడిగా మీడియా గోష్టి నిర్వహించడం ముఖ్యమైంది. అసలు అమెరికా తన వ్యూహాలకు లోబడి ఉండేవారికే ఈ ఆహ్వానం అందిస్తుంది. మన దేశం కోణంలో చూస్తే ప్రధానిగా మోడీ మీడియాతో మాట్లాడటం, ప్రశ్నలకు స్పందించడం ఇంతవరకూ తెలియని విషయం. ఆయన ఇండియాలో ఉండగా ఎందుకు మీడియాను పిలవకుండా తిరుగుతారో కూడా స్పష్టమైపోయింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా టీవీ ఇంటర్వ్యూలను పూర్తిగా బహిష్కరించడం కూడా ఇందుకే. ‘చరిత్ర అడక్కు చెప్పింది విను’ చందంగా తన ‘మన్‌కీ బాత్’ వినిపించడం తప్ప జన్‌కీ బాత్ వినడం ఆయన నిఘంటువులోనే ఉండదు. కాబట్టి ఆయన అమెరికాలో ముఖాముఖి విలేకరులతో మాట్లాడటం పెద్ద వార్తయింది.
మైనార్టీల మాటేంటి మోడీజీ?
మళ్లీ వైట్‌హౌస్‌కు వస్తే మీడియా గోష్టిలో సబ్రినా సిద్దికి అనే మహిళా జర్నలిస్టు ప్రశ్న ఆయనకూ సంఫ్‌ు పరివారానికి బొత్తిగా మింగుడు పడలేదు. నిజానికి మోడీ పర్యటనకు ముందే వైట్‌హౌస్ తాము అధికారికంగా మైనార్టీల పరిస్థితిపై మోడీతో మాట్లాడనున్నట్టు స్పష్టం చేశారు. మాట్లాడారు కూడా. వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు చెందిన సిద్దికి ఇండియాలో మైనార్టీల పరిస్థితుల గురించి వారిపై వివక్ష గురించి మోడీని నేరుగా అడిగారు. భావ ప్రకటనా స్వేచ్చను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేననీ, భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నందున మతపరమైన వివక్షకు అవకాశమేలేదని, అందుకే బైడెన్ తనతో అదే అన్నారని మోడీ సమర్థనతో బయిటపడ్డారు. ప్రజాస్వామ్యం మా డీఎన్ఏలో ఉందన్నారు. ఇవన్నీ సూక్తులే తప్ప ఆమె ప్రశ్నకు సమాధానాలు కాదు. ఇదంతా ఒక ఎత్తయితే తర్వాత జరిగిన ప్రహసనం మరో ఎత్తు. సిద్దికి అలా ప్రశ్నించినందుకు ఆమెపై సంఫ్‌ు పరివారీయులు ట్రోలింగ్స్ మొదలెట్టారు. ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ అంశం లేవనెత్తారని దాడి చేశారు. బీజేపీ ఐటి విభాగం బాధ్యుడైన అమిత్ మాలవీయ ట్వీట్ చేస్తూ మోడీ ఆమె దురుద్దేశాన్ని తుత్తునియలు చేశారని పొగడ్తలు గుప్పించారు. ఇవన్నీ భరించలేని సిద్దికి 2011లో భారత క్రికెట్ టీం విజయం సాధించినప్పుడు ఆ డ్రెస్సు వేసుకుని తండ్రితో కలసి కేరింతలు కొడుతున్న తన చిన్నప్పటి ఫొటో ఒకటి ట్వీట్ చేశారు. కొన్నిసార్లు ఫొటోలే ఎక్కువ విషయాలు చెబుతాయని అని వ్యాఖ్య జోడించారు. మరోవంక వైట్‌హౌస్‌లో జరిగిన గోష్టిలో ప్రశ్న వేసిన వారినే ఇలా వెంటాడి వేధించడం అమెరికాలోనూ విమర్శలకు గురైంది. చివరకు అక్కడి ఉన్నతాధికారి జాన్ కిర్బీని మోడీ పర్యటన ముగిశాక జరిగిన గోష్టిలో ఆమెను అదే పత్రిక ప్రతినిధి ఈవిషయమై అడిగినప్పుడు మీడియా గోష్టిలో దీనిపై తమ అసమ్మతి ప్రకటించారు. ప్రశ్నించిన వారిని ఇలా వెంటాడటం సరైంది కాదని స్పష్టంచేశారు. ఆమెతో పాటు పత్రికా వ్యవహారాల కార్యదర్శి కెరెన్ జీన్ పిర్రే కూడా వేధింపులను ఖండించారు
ఒబామా అయితే మాకేంటి?
ఇది ఎవరో విలేకరి విషయమే అనుకుంటే సాక్షాత్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా విషయంలోనూ ఇదే అప్రజాస్వామిక పోకడలు ప్రదర్శించారు బీజేపీ పరివార్ నేతలు. డెమోక్రటిక్ పార్టీ నాయకుడూ తొలి నల్లజాతి అధ్యక్షుడు అయిన ఒబామా ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పరిపాటి. మోడీ ప్రధాని అయిన కొత్తలో వచ్చిన ఒబామా మత సామరస్యం గురించి ఆర్భాటాలకు దూరంగా ఉండాల్సిన అవసరం గురించి చెప్పడం గుర్తుండే ఉంటుంది. మోడీని నరేంద్ర అనీ బారక్ అని పిలుచుకునేంత చనువు వారిమధ్య ఏర్పడిందని అప్పట్లో చెప్పేవారు. భారత దేశం మైనార్టీల హక్కుల రక్షణ గురించి జాగ్రత్త వహించాల్సి ఉంటుందని ఒబామా అనడం బీజేపీ భరించలేకపోయింది. నేనే బైడెన్ స్థానంలో ఉంటే ఈ సమస్యను తప్పక ప్రస్తావించేవాడినని కూడా ఒబామా అన్నారు. వెంటనే పరివార్ రంగంలోకి దిగింది. ఒబామా ఆఫ్రికన్ ముస్లిం మూలాలు గలవాడు కావడం వారి కోపాన్ని రెట్టింపు చేసింది. ఇటీవలి కాలంలో చవకబారు వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాస్ శర్మ హుసేన్ గనక ఇలా చేయడం ఆశ్యర్యమేమీ లేదని, ఆయనను మత కోణంలో అవహేళన చేస్తూ ట్వీట్ పెట్టారు. వాస్తవంలో ఒబామా క్రైస్తవుడే గాక వారి మతాచారాలు పాటిస్తారు! శర్మ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరింత తీవ్రంగా సుదీర్ఘంగా ఇదే విషయమై దాడి చేశారు. ఒబామా హయాంలో అమెరికా ఏ ముస్లిం దేశాలపై దాడి చేసిందీ ఏకరువు పెట్టారు. వాస్తవానికి ఆ సమయంలో భారతదేశం లేదా బీజేపీ అందుకు అభ్యంతరం చెప్పిందేమీ లేకపోగా అమెరికా నాయకత్వంలో టెర్రరిజంపై పోరాటంలో పాల్గొనాలని వత్తాసు పలికింది. బిన్‌లాడెన్ వంటివారికి అమెరికానే అండగా నిల్చిన విషయం మర్చిపోయింది. డోనాల్డ్ ట్రంప్ హయాంలోనైతే మోడీ ఎంతగా చెట్టపట్టాలేసుకుంది ఎవరూ మర్చిపోరు.ఆఖరుకు ఒకరికొకరు ఎన్నికల ప్రచారంలోనూ సహకరించుకున్నంత పనిచేశారు. ట్రంప్‌కు మద్దతు పలకడంలో మోడీ మామూలు దౌత్య మర్యాదలను కూడా దాటిపోవడం అమెరికాలోనూ విమర్శకు గురైంది. అలాంటి ప్రభుత్వంలో కీలకమంత్రిగావున్న నిర్మలా సీతారామన్ ఇప్పుడు మాత్రం వాటన్నిటినీ గుర్తుచేస్తూ ‘మా వ్యవహారాల్లో మీ జోక్యం ఏమిటని’ రెచ్చిపోయారు. ఆరు ముస్లిం దేశాలపై దాడిచేసిన అమెరికా మాకు మైనార్టీల గురించి చెప్పడమేమిటని వాఖ్యలు చేశారు. అంతటితో ఆగక ప్రతిపక్షాలనూ జతచేశారు. తాము కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టి కష్టపడుతుంటే ప్రతిపక్షాలు సరైన సమస్యలపై పోరాడలేక మాజీ అమెరికా అధ్యక్షుడితో కలసి ఈ అప్రధానమైన అంశం ఎత్తుకున్నారని వాపోయారు. దేశంలో ప్రభుత్వాన్ని మార్చడం కోసం పాకిస్థాన్‌తో చేతులు కలిపారని, విదేశీ టూల్కిట్లు దిగుమతి చేసుకుంటున్నారనీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణ చేశారు. రాజ్‌నాథ్‌సింగ్ వంటి సీనియర్ మంత్రి కూడా ఇదేపాట పాడటం గమనించదగింది.
కళ్లు మూసుకున్న పిల్లి
ఒబామా అయినా సిద్దికి అయిన ప్రయివేటు వ్యక్తులుగానే మాట్లాడారు తప్ప అమెరికా తరపున కాదు. తమకు ఇబ్బంది కలిగింది గనకనే కనీస దౌత్య మర్యాదలు కూడా పాటించక ఒబామాపై విరుచుకుపడటం బీజేపీ ద్వంద్వనీతికి అద్దం పడుతోంది. కొంత కాలం కిందట బిబిసి ఆనాటి గుజరాత్ పరిస్థితిపై డాక్యుమెంటరీ ప్రసారంచేసినప్పుడు కూడా మోడీ సర్కార్ ఇలాగే దాడి చేసింది. దానిపై నిషేదం విధించి మనకు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛపట్ల గౌరవం లేదని చాటుకుంది. ఎన్డిటివి, వైర్ వంటివాటితో సహా మీడియా సంస్థలపై ఎలా ఒత్తిడి సాగిందీ అందరికీ తెలుసు. అది ముదిరి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నమాట. రాహుల్‌గాంధీనో లేక గతంలో మన్మోహన్సింగ్ వంటివారు విదేశాల్లో ఏదో మాట్లాడితే దేశ ప్రతిష్ట దెబ్బతినిపోయిందని గగ్గోలు పెట్టిన ఈ దేశ భక్తులు విశ్వగురువులమంటూనే వికృత వివాదాలు ఎలా పెంచుతున్నదీ దేశంలో తమ నడవడి ద్వారా ప్రతిష్టను దెబ్బతీస్తున్నదీ దాచిపెట్టాలని చూస్తున్నారు. కానీ వారెన్ని తంటాలు పడినా ప్రజాస్వామ్య ప్రమాణాలు ఘోరంగా దెబ్బతింటున్నాయని ప్రపంచం గమనిస్తున్నదని ఈ సందర్బాలు స్పష్టం చేస్తున్నాయి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టు కపటనాటకమాడుతున్న మోడీ తదితరులు ఇప్పటికైనా ఈ అప్రజాస్వామిక పోకడలు విరమించితే దేశానికి శ్రేయస్కరం. నిర్మలా సీతారామన్ విమర్శ చేసేవరకూ ఒబామా వ్యవహారం పెద్దగా ప్రచారమివ్వమని మోడీ అనుకూల బడా మీడియాకు కూడా ఇది గుణపాఠమే.
తెలకపల్లి రవి