చూచి రాతతో విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయవచ్చు

– ఆమనగల్‌ పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు
– జ్ఞాన వాహిని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు చూచి రాత పరీక్ష
నవతెలంగాణ-ఆమనగల్‌
చూచి రాత పరీక్షతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయవచ్చని ఆమనగల్‌ పోలీస్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. జ్ఞాన వాహిని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఆమనగల్‌ పట్టణంలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు చూచి రాత పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ బాల్‌ రామ్‌ హాజరై మాట్లాడారు. వార్షిక పరీక్షలకు సన్నధం అయ్యే విద్యార్థులకు చూచి రాత పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గత 11 సంవత్సరాలుగా చూచిరాత పరీక్షలు నిర్వహిస్తున్న జ్ఞాన వాహిని ఫౌండేషన్‌ సభ్యులను వారు అభినందించారు. ఆమనగల్‌, కడ్తాల్‌, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు చెందిన ఇంగ్లీష్‌, తెలుగు మీడియం విద్యార్థులు చూచిరాత పరీక్షకు హాజరైనట్టు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి విచ్చేసిన విద్యార్థుల సౌకర్యార్థం మాజీ ఎంపీపీ తల్లోజు లలితమ్మ వెంకటయ్య మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ అధ్యక్షులు డి.శ్రీనివాస్‌, గౌరవ అధ్యక్షులు, విశ్రాంత ఉపాధ్యాయులు సత్యనారాయణ, కార్యదర్శి లక్ష్మీనారాయణ, కోశాధికారి రవీందర్‌, సభ్యులు కే.సత్యం, బి.నరసింహ, రంగారావు, జగదీష్‌, యాదగిరి, దినేష్‌ శ్రీనివాసులు, సాయిబాబా, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love