– జీనోమ్ వ్యాలీలో కొత్తగా ఇంజెక్టబుల్స్ తయారీ యూనిట్
– వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రపంచంలో పేరొందిన వివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే లైఫ్ సైన్సెస్‌కు గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణలో ఈ కంపెనీ పెట్టుబడులు మరింత లాభిస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే జీనోమ్ వ్యాలీలో వివింట్ కంపెనీకి చెందిన రీసేర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కేంద్రం ఉంది. దీన్ని అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా వివింట్ కంపెనీ హైదరాబాద్‌లో తన మొదటి తయారీ కర్మాగారాన్ని స్థాపించనుంది. దీంతో 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా కంపెనీ ముందుకు రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. వాటికి అవసరమైన రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు సీఎం వెల్లడించారు