పార్లమెంట్‌లో రైతుల గొంతుక

Voice of farmers in Parliament– ఎంపీ అమ్రారామ్‌కు ఏఐకేఎస్‌ అభినందన
– బీజేపీ అడ్డాలో సీపీఐ(ఎం) గెలుపుపై హర్షం
– హాజరైన సీతారాం ఏచూరి, బృందా కరత్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎంపీగా ఎన్నికైన ఎఐకెఎస్‌ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఉపాధ్యక్షుడు అమ్రారామ్‌ కు ఏఐకేఎస్‌ ఘనంగా సత్కరించింది. ఇండియా ఫోరం తరపున ఆయన రాజస్థాన్‌లోని సికార్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా విజయం సాధించారు. ఆదివారం నాడిక్కడ ఏఐకేఎస్‌ కార్యాలయంలో అమ్రారామ్‌ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసి సభలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పుష్పగుచ్ఛం అందించి సత్కరించి అభినందించారు. అనంతరం సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా రైతుల కోసం పోరాడుతున్నారని, అమ్రారామ్‌ ఇప్పుడు లోక్‌సభలో రైతులు, కూలీల కోసం పోరాడుతారని అన్నారు. సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందా కరత్‌ మాట్లాడుతూ అమ్రారామ్‌ రైతుల మనిషి అని, రైతు పోరాటాలతో పెనవేసుకొని ఉన్నారని అన్నారు. ఏఐకేఎస్‌ మాజీ ప్రధాన కార్యదర్శి, ఎస్కేఎం సీనియర్‌ నేత, మాజీ ఎంపీ హన్నన్‌ మొల్లా మాట్లాడుతూ రైతు ఉద్యమానికి ప్రతీకగా అమ్రారామ్‌ నిలిచారని, ఇప్పుడు పార్లమెంట్‌లో రైతుల గొంతుక ప్రతిధ్వనిస్తుందన్నారు. ఏఐకేఎస్‌ అధ్యక్షుడు అశోక్‌ ధావలే మాట్లాడుతూ రైతుల కోసం పోరాటం చేయడం అమ్రారామ్‌ నుంచి నేర్చుకున్నానని అన్నారు. ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల వేళ ఎక్కడ చూసినా ఒక్కటే గొంతు వినిపించేదని, మా ఎంపీ అమ్రారామ్‌ అని, ఆయనే సరైనోడని తెలిపారు. ఏఐకేఎస్‌ ఆర్థిక కార్యదర్శి పి.కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ అమ్రారామ్‌ పార్లమెంట్‌లో అడుగుపెట్టడంతో రైతు ఉద్యమానికి మరింత ఊపు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్‌, తపన్‌ సేన్‌, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే, జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షురాలు ఐషీఘోష్‌, ఢిల్లీ యూనివర్శిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ (డీయూటీఏ) మాజీ అధ్యక్షుడు రాజీవ్‌ కన్వర్‌, డీఎస్‌ఎంఎం నేత నత్తు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love