ప్రమేయం సరికాదు : ఎస్టీయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యాశాఖలో స్వచ్ఛంద సంస్థల ప్రమేయం సరైంది కాదని ఎస్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి సదానందంగౌడ్, ఎం పర్వత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల్లో అమలౌతున్న తొలిమెట్టు తనిఖీల్లో భాగంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వాములుగా చేయడం విద్యాశాఖ అసమర్ధతకు నిదర్శనమని విమర్శించారు. ఏ ప్రభుత్వ శాఖలో లేని నూతన ఒరవడిని విద్యాశాఖలో ప్రవేశపెట్టడం అత్యుత్సాహం చూపడమే అవుతుందని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సేవలను పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, విద్యార్ధులకు అవసరమైన సామగ్రిని సమకూర్చడంలో వినియోగించుకోవాలే తప్ప అకడమిక్ వ్యవహారాల్లో వారి పెత్తనం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాఠశాలల్లో జరిగే వినూత్న కార్యక్రమాల పట్ల కనీస అవగాహన లేని వ్యక్తులను తనిఖీల్లో భాగం చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. విద్యార్థుల కు బోధించడం ఉపాధ్యాయులకు కొత్తేం కాదని వారిపై పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోబో మని వారు హెచ్చరించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ విడుదలచేసి న ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించాలని లేదంటే పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలకు వెనుకాడబోమని తెలిపారు.