‘ఓటె’త్తాలి..!

– నేడు 18వ లోక్‌సభ ఎన్నికలు…
– ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌
– ఖమ్మం, మానుకోటల్లో ఎన్నిక ఎన్నికకూ
తగ్గుతున్న ఓట్ల శాతం
– ఈసీ దృష్టి సారించినా ఓటర్ల సామాజిక బాధ్యతతోనే పెరుగుదల
– ఖమ్మంలో 16,31,039; మహబాద్‌లో 15,32,366 మంది ఓటర్లు
– ఖమ్మం బరిలో 35 మంది… మూడు ఈవీఎం యూనిట్లు
– మహబూబాబాద్‌లో 23 మంది పోటీ…రెండు ఈవీఎం యూనిట్లు
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు తీసుకున్నా ఓటర్ల వైపు నుంచి పెద్దగా ఫలితం ఉండటం లేదు. ఓటేసేందుకు కొందరు ఆసక్తి చూపటం లేదు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు విడతల్లో పోలింగ్‌ 70శాతం దాటకపోవడం దీనికి నిదర్శనం. 15 లక్షల ఓటర్లు ఉన్న చోట కనీసం రెండు, మూడు లక్షల మందైనా ఓటుకు దూరంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సార్వత్రిక ఎన్నికలపై ఓటర్‌ ఆసక్తి నానాటికీ తగ్గుతోంది. ముఖ్యంగా తెలంగాణలో 2018 నుంచి అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో వస్తుండటం కూడా పోలింగ్‌ శాతంపై ప్రభావం పడుతోందని నిపుణుల అంచనా. గతంలో లాగా ఒకేసారి ఎన్నికలు రాకపోవడంతో దేశవ్యాప్త ఎన్నికలపై ఓటర్లు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఓటుకు నోటు అలవాటు పడిన అనేక మంది అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంట్‌ ఎన్నికలకు డబ్బులు తక్కువగా ఇస్తుండటంతోనూ ఓటుపై అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో రూ.1000 నుంచి రూ.8వేల వరకు పలికిన ఒక్కో ఓటు…ఇప్పుడు రూ.500కే పడిపోవడంతో కొందరు అయిష్టత ప్రదర్శిస్తున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.500 నుంచి రూ.3000 పలికిన ఓటు ఇప్పుడు రూ.100- 250కి పడిపోయిందని చర్చించుకుంటున్నారు. దూరభారం, ఎండల తీవ్రత, పోలింగ్‌ రోజున సెలవు ప్రకటించడంతో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లటం, ఇంకొందరు ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టకపోవడం, అభ్యర్థులపై విముఖత, ఐదారు నెలల వ్యవధిలో రెండోసారి ఓట్లు వేయాల్సి రావడం…వంటి ప్రతికూలతల కారణంగా పోలింగ్‌ పర్సంటేజ్‌ తగ్గుతోంది. ఈసారి అలాంటివేవీ లేకుండా ఎన్నికల సంఘం జాగ్రత్త పడినా శని, ఆదివారాలు వీకెండ్స్‌ కావడం, సోమవారం పోలింగ్‌ నిర్వహిస్తుండటంతో అనేక మంది ఓటుకు దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనికి తోడు ఖమ్మం, మహబూబాబాద్‌ వంటి పార్లమెంట్‌ స్థానాలు ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలు కావడంతో అనేక మంది ఇక్కడి ఓట్లను వదిలేసి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై దృష్టి సారించారు. కొందరు ఆ రాష్ట్రానికి వెళ్లి కొద్దిరోజులుగా అక్కడే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మరికొందరు శని, ఆది, సోమవారాలు అక్కడే తిష్ట వేసి ఆ రాష్ట్రంలోని తమ బంధుమిత్రుల చేత తమకు అనుకూలమైన పార్టీకి ఓట్లు వేయించే పనిలో నిమగమయ్యారు.
సమయం పెంచినా పోలింగ్‌శాతం పెరిగేనా…?
ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్‌ పర్సంటేజ్‌ పెంచేందుకు ఈసీఐ ఎన్నికల సమయాన్ని పెంచింది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కానీ ఈసారి సాయంత్రం మరో గంట అంటే 6 గంటల వరకు అవకాశం కల్పించింది. పెంచిన సమయం ఖమ్మం జిల్లా పరిధిలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి శాసనసభ స్థానాలకే వర్తిస్తుంది. అలాగే మహబూబాబాద్‌ పరిధిలోని డోర్నకల్‌, మహబూబాబాద్‌ అసెంబ్లీ స్థానాల్లోనే 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ సాగుతోంది. ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలోని అశ్వారావుపేట, కొత్తగూడెం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానంలో నర్సంపేట, ములుగు, ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ స్థానాల్లో 4 గంటలకే పోలింగ్‌ ముగుస్తుంది.
అవగాహన కల్పించినా అదే తీరు…
ఓటర్లు స్వీయప్రేరణతో పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చేలా యంత్రాంగం అవగాహన కల్పిస్తున్నా ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. 2009, 2014, 2019 పార్లమెంట్‌ ఎన్నికలు వీటిని స్పష్టం చేస్తున్నాయి. ఖమ్మం లోక్‌సభ స్థానంలో 2009లో 82.08%, 2014లో 82.20% పోలింగ్‌ నమోదవ్వగా 2019లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో రావడంతో 75.30% ఓటింగ్‌ పడిపోయింది. మహబూబాబాద్‌లో 2014లో 81.21% మంది ఓటు హక్కు వినియోగించుకోగా 2019లో 69.06 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ స్థానంలో 2009లో 9,96,402 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పదేళ్ల తర్వాత 2019లో 14.23 లక్షల ఓటర్లకు గాను కేవలం 9,82,734 మందే ఓటు వేయడం గమనార్హం. 2009తో పోల్చితే 2019లో 14వేల మంది తక్కువగా ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఈసారైనా పెరిగేనా…
ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో 16,31,039 మంది ఓటర్లు ఉండగా వీరి కోసం 1896 పోలింగ్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. 35 మంది బరిలో ఉన్నారు. ఒక్కో ఈవీఎంకు 16 మంది చొప్పున మూడు యూనిట్లు ఏర్పాటు చేశారు. అలాగే మానుకోట పరిధిలో 15,32,366 మంది ఓటర్లు ఉండగా 23 మంది పోటీ పడుతున్నారు. రెండు ఈవీఎం యూనిట్లు ఏర్పాటు చేశారు. దాదాపు రెండు నియోజకవర్గాల్లో అందరికీ పోల్‌ స్లిప్‌లు పంపిణీ చేశారు. సాక్ష్యం యాప్‌లో దరఖాస్తు చేసుకున్న 17వేల మందిని పోలింగ్‌ స్టేషన్‌కు తరలించేందుకు ఎలక్షన్‌ కమిషనే వాహనాలను ఏర్పాటు చేసింది. హౌమ్‌ బ్యాలెట్‌ సౌకర్యం కూడా కల్పించింది. ఇప్పటికే ఖమ్మం పరిధిలో 2,728 మంది హౌం బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. ఇలా ఎన్నో వెసులుబాట్లు కల్పిస్తున్నా… సామాజిక బాధ్యతగా కొందరు ఓటర్లు ఫీల్‌కాకపోవడం వల్లనే పోలింగ్‌ పర్సంటేజ్‌ తగ్గుతుందని పరిశీలకుల విశ్లేషణ. ఎంత అత్యవసరమైనా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాజకీయ నాయకులు, అభ్యర్థులు, ఎన్నికల యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.

Spread the love