ఇండియా ఫోరానికి ఓటేసి బీజేపీని ఓడించాలి

– ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో సీపీఐ(ఎం) పిలుపు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
దేశంలోని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర లక్షణాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఢిల్లీ ప్రజలకు సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం నాడిక్కడ పటేల్‌ చౌక్‌ ప్రాంతంలో బీజేపీని ఓడించేందుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ సీపీఐ(ఎం) ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో పొలిట్‌ బ్యూరో సభ్యులు ఎంఎ బేబీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ఇండియా ఫోరం అభ్యర్థులకు ఓటు వేసి బీజేపీని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తూ చేస్తున్న ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు. అయితే ఢిల్లీ పోలీసులు ఏదో ఒక తప్పుడు సాకుతో ప్రచారాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసుల ఒత్తిడికి తలొగ్గకుండా సీపీఐ(ఎం) నేతలు, కార్యకర్తలు ప్రచారం కొనసాగించారు. ప్రచారంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రాజేంద్ర శర్మ, అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love