– 26న యూపీఎస్, ఎన్‌పీఎస్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలు
– ఎన్‌ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఓట్ ఫర్ ఓపీఎస్ కొనసాగుతుందని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం (ఎన్‌ఎంఓపీఎస్) సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ అన్నారు. ఆ హామీ ఇచ్చే పార్టీలకే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో సుర్జీత్ భవన్‌లో ఎన్‌ఎంఓపీఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో యూపీఎస్, ఎన్‌పీఎస్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించామని నిర్ణయించామని చెప్పారు. ఎన్‌పీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్‌ఎంఓపీఎస్ జాతీయ కన్వెన్షన్‌ను డిసెంబర్ 15న ఢిల్లీలో నిర్వహించాలని తీర్మానం చేశామన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ సంస్కరణల్లో కూడా 99,77,165 మంది ఉద్యోగుల నుంచి వసూలు చేసిన రూ.10.53 లక్షల కోట్ల పెన్షన్ నిధులు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంపద కొద్ది మంది దగ్గర కేంద్రీకృతం అవుతుందని అన్నారు. సంపద సృష్టించే వారు వృద్ధాప్యంలో కనీస పెన్షన్ కూడా నోచుకోలేకపోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎంఓపీఎస్ అధ్యక్షులు వికె బంధు, నాయకులు రామాంజనేయులు, కల్వల్ శ్రీకాంత్, నరేష్ గౌడ్, శాంతారం, దారివాల్, ప్రదీప్ కుమార్, మంజీత్ రానా తదితరులు పాల్గొన్నారు.