ఓటే..నీ ఆయుధం!

Vote..your weapon!”జాగ్రత్త … ప్రతి ఓటూ, ఒక….. నీ పచ్చి నెత్తురు మాంసం ముద్దచూస్తూ చూస్తూ వేయకు ఏదో ఓ గద్దకి. అది కేవలం కాగితం మీద గుర్తు కాదు, జీవితం కింద ఎర్తు” అంటాడు అలిశెట్టి ప్రభాకర్‌. దేశ భవిత, మరో ఐదేండ్లు తీర్చిదిద్దుకోవటానికి జరుగుతున్న ఎన్నికలివి. ఇప్పటికి గత పదేండ్లుగా బీజేపీ నాయకత్వాన ఉన్న ఎన్డీయే పరిపాలన మనకు చాలా స్పష్టంగానే అనుభవంలోకి వచ్చింది. మనం ఓటు వేసే ముందు తప్పకుండా ఈ పదేండ్లనూ ఒకసారి మననం చేసుకోవాలి. భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి. చాలామంది ప్రజలు జరిగిపోయిన సంఘటనలను, ఇబ్బందులను, ప్రభుత్వం పెట్టిన బాధలను, పెంచిన ధరలను, విధ్వంసాలను, అమానవీయతలను మరచిపోతుంటారు. ఇక్కడే జాగ్రత్త వహించాలి. ఎన్నికల వేల మాటలకు తేనెపూస్తారు. అమాయకంగా లెక్కలేనన్ని వాగ్దానాల్నీ వెద జల్లుతారు. మేమలా అనలేదనీ, మమ్మల్ని నమ్మండనీ వేడుకుంటారు. ఘనమైన ప్రచార ఆర్భాటాలకూ పూనుకుంటారు. ఛానెళ్లు, మీడియా, పత్రికలు అన్నీ వాళ్లవైపే ఊదరకొడుతుంటాయి.అందుకనే, వాళ్ల మాటలు పక్కనపెట్టి గతంలో వాళ్లేమి చెప్పి వచ్చారో, ఏం చేశారో బేరీజు వేసుకోవాలి.
‘ఒక్కరోజు భాగోతానికి మూతి మీసాలు కొరుక్కున్నట్టు’ అని ఒక సామెత ఉంది. ఒక్కరోజు కోసం డబ్బులు పంచుతారు, మందుపోస్తారు, మాంసం తినిపిస్తారు. కానీ ఐదేండ్లు కాల్చుకు తింటారు. చేపకు ఎరవేసిన తీరే ఇది కూడా. అందుకే ఆలోచించి ఓటు వేయాలి. ‘మట్టి బానలు కొనిన కొట్టి చూచెదము/ సరుకు కొన వీధెల్ల తిరిగి చూచెదము, పండు పండేనో లేదో పట్టి చూచెదము, ఓటిచ్చునప్పుడే ఉండాల బుద్ధి, ఎన్నుకొని తలబాదుకొని యేమి ఫలము’ అని కాళోజీ హెచ్చరించాడు. ఎందుకంటే, మన రాజ్యాంగము, దాని విలువలయిన ప్రజాస్వామ్యము, సామ్యవాదము, లౌకిక, సమాఖ్య విధానాలకు, సౌభ్రాతృత్వానికి ప్రమాదం ఏర్పడి, హక్కులు, స్వేచ్ఛ, అడుగంటిపోయిన సందర్భంలో, ఇక్కడ తరాలుగా జీవిస్తున్న వారి పౌరసత్వమే ప్రశ్నార్థకంగా మారిన సందర్భంలో ఈ ఎన్నికలు మన ముందుకొచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా మతపరమైన విభజన పెరిగింది. నేటి కేంద్ర పాలకుల ఆలోచనలకు ఆధ్యుడు, సిద్ధాంతకర్త అయిన గోల్వాల్కర్‌, సావర్కర్‌లు, మన జాతీయ జెండాను ఎగుర వేయటాన్ని అంగీకరించలేదు. అంబేద్కర్‌ రాజ్యాంగాన్నీ ఒప్పుకోలేదు. మనుస్మృతి మా ఆచరణని బహి రంగంగానే చెప్పారు. ఇప్పుడు సనాతన ధర్మమైన కులవ్యవస్థనూ సమర్థిస్తున్నారు. దేశ ప్రజలందరూ సమానమన్న రాజ్యాంగ విలువను వీరు అంగీకరించరు. హిట్లరు మా ఆదర్శమంటారు. గాంధీని చంప టం న్యాయమంటారు. ముస్లింలు, క్రిస్టియన్లు చొరబాటుదారులని పేర్కొంటారు. బీఫ్‌ తింటే చంపు తారు. ఆడవాళ్లు మగవారు చెప్పినట్టు వినాలంటారు. పైకి ఒకటి చెబుతారు, లోన ఒకటి చేస్తారు. రామరాజ్యమని పైకి చెప్పి, మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన వాడి కొడుక్కి సీటిచ్చి గెలిపించమంటారు. ఇదెక్కడి నీతి, రీతి!
ఈ పదేండ్ల ప్రభుత్వం ప్రజలను ఎన్ని ఇక్కట్లుకు గురిచేసిందో, ఏయే ఘనకార్యాలు చేసిందో, చూడాలి! మునుపెన్నడూ లేనంత పెట్రోలు ధర పెంచింది. గ్యాసు ధరపై ధర్నాలు చేసిన వీళ్లే విపరీతంగా పెంచారు. ప్రపంచ ఆకలిసూచీలో మన దేశం దిగజారి పోయింది. పేదరికమూ పెరిగింది. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. లాక్‌డౌన్‌ తర్వాత అనేక పరిశ్రమలు మూతపడి కార్మికులు ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌లో కార్మికులు నడుచుకుంటూ వాళ్ల ఊర్లకు పోతుంటే నిర్భంధించారు. వారి నుంచి చార్జీలు వసూలు చేశారు. రాజధానిలో రైతులు మద్ధతు ధర ఇవ్వాలని ఏడాది పాటు నిరసన తెలిపితే దేశ ద్రోహులని కాల్పులు జరిపారు. కానీ ఆదానీ, అంబానీలకు రూ.లక్షలకోట్లు మాఫీ చేశారు. ప్రభుత్వ సంస్థల్ని కార్పోరేట్లకు అప్పనంగా అమ్మేసారు. కనీసం కరోనా వాక్సిన్‌ ఉచితంగా ఇస్తామనలేదు. పెద్దనోట్ల రద్దుతో జనాన్ని చంపారు. మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. రక్షణ కరువైంది. మణిపూర్‌లో మత విద్వేషాల్ని తెగల తగువును రెచ్చగొట్టారు. మహిళల్ని నగంగా ఊరేగిస్తే, హత్యలు జరుగుతోంటే, కనీసం సందర్శించ తీరుబడి ప్రధానికి లేకపోయింది. వీటన్నింటినీ ప్రశ్నించిన ఉద్యమకారుల్ని, జర్నలిస్టుల్ని అక్రమ కేసులు పెట్టి నిర్భంధించారు. ప్రజా స్వామ్యం నుండి నిరంకుశత్వంలోకి దేశాన్ని తీసుకుపోతున్నారు. మీడియాను కొనేసారు, ఎంపీలను, ఎమ్మెల్యేలనూ కొని ప్రభుత్వాలను కూల్చారు. తమకు వంతపాడని వారిపైకి ఈడి, సిబిఐ, ఐటి దాడులు చేయించి జైల్లో వేయిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులనూ నిర్భంధించారు. ఎన్నికల బాండ్ల పేరిట వేల కోట్ల రూపా యలను చందాలుగా తీసుకుని అవినీతికి పాల్పడ్డారు. కోర్టు రద్దు చేసినా, మళ్లీ తెస్తామని చెబుతు న్నారు. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. హిందువుల సంపదను ముస్లింలకు దోచిపెడతారని మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ అబద్ధాలు ప్రచారం చేసినా ఎలక్షన్‌ కమీషన్‌ కలగజేసుకోలేక పోయింది. ముఖ్యంగా యువత ఎదురు చూస్తున్న ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసారు కదా! వీటిగురించి ఒక్కమాటా చెప్పరు.
ఇలా ఎన్నో వైఫల్యాలు మన కండ్లెదుటే కనపడుతున్నాయి. దేశ భవిష్యత్తు యువత చదివే విద్యనూ మతం ఆధారంగా మార్చేసారు. బాబాలకు, యోగులకు నీతి బాహ్యమైన వ్యాపారాలకు అను మతి ఇస్తున్నారు. గెలిస్తే రాజ్యాంగాన్నే మారుస్తామని ప్రకటించే వీరిపట్ల జాగ్రత్త వహించకపోతే నియంతృత్వ కత్తిని మనపై దింపుతారు. ఇక ఓటే మన ఆయుధం!

Spread the love