ఓటరు నిరాసక్తత క్రమంగా తగ్గుతున్న పోలింగ్‌ శాతం

– పోలింగ్‌కు దూరంగా ఓటరు
– 2018లో 76.45 శాతం,
– 2023లో 74.93శాతం
– గతానికి రెండు శాతం తగ్గిన పోలింగ్‌
– ఎవరికి లబ్ది చేకూరుతుందోనని ప్రధాన పార్టీల విశ్లేషణ
– ఓటింగ్‌ సరళీపై స్పష్టమైన అంచనాకు రాని అభ్యర్థులు
– ఫలితమివ్వని ఓటర్ల చైతన్య కార్యక్రమాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్‌ ముగిసింది. చిన్నచిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్‌ జరిగింది. అయితే ఈ ఓటింగ్‌తో ప్రధాన పార్టీలు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి అనూహ్యరీతిన ఓటర్లు పెరిగినప్పటికి పోలింగ్‌ విషయానికొచ్చే వరకు స్వల్పంగా తగ్గడంతో ఇది ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అంచనాలకు అందడం లేదు. గ్రామాల వారీగా కొందరు, మండలాల వారీగా మరికొందరు, పోలింగ్‌ సరళీని పరిశీలిస్తూ లాభనష్టాలపై విశ్లేషణలు చేస్తున్నారు. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై పూర్తి అవగాహన కలిగిన తలలు పండిన రాజకీయ పరిశీలకులు అభ్యర్థుల తలరాతలు ఎలా మారాయో గుర్తించేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో 2023 ఎన్నికల్లో 74.93 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం ఓటర్లు 3,27,583 మంది ఉండగా.. పోలైన ఓట్లు 2,45,459. కాగా, ఇందులో పురుషులు 1,23,968 మంది, మహిళలు 1,21,483 మంది, ఇతరులు 8మంది ఓటర్లు ఎన్నికల్లో ఓట్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గెలుపోటములపై ఆయా రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. ప్రచారాలు, ఓటర్ల బుజ్జగింపులతో అలసిసొలసిన నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ఫలితాలపై చర్చల్లో ముగినిగారు. గ్రామాలు, మున్సిపాలిటీలే కాకుండా, వార్డులవారీగా లెక్కలేస్తున్నారు. 2018 ఎన్నికలతో పోల్చితే 2023 ఎన్నికల్లో తగ్గింది. గత ఎన్నికల్లో 76.45 శాతం ఉండగా ఇప్పుడు 74.93 శాతం నమోదైంది. ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్యే నువ్వా.. నేనా అన్నట్లు పోటీ నెలకొంది. సైలెంట్‌ ఓటింగే ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం తారుమారు చేయనుంది.
చైతన్యం నింపినా..
వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ప్రస్తుతం ఓటర్లలో చైతన్యం నింపడానికి జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను కలెక్టర్‌ భారతిహౌలీకేరీ నేతృత్వంలో ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. 18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటుహక్కు పొందేందుకు అవకాశం కల్పిస్తూ కళాశాలల్లోనూ చైతన్య కార్యక్రమాలు చేపట్టి ఓటరు నమోదు పెంచారు. ఆ క్రమంలోనే పోలింగ్‌ శాతం పెంచేందుకు ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో ఓటర్లలో ఆసక్తి పెంచేందుకు 5మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు, మహిళా పోలింగ్‌ కేంద్రాలు 5, వికలాంగులకు ఒకటి, యూత్‌కు మరోకటి చొప్పున పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవికాక ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కావాల్సిన గ్రామాలు, పట్టణాల్లో పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించారు. కొత్తగా 80సంవత్సరాలు వయస్సు దాటిన వద్ధులు, వికలాంగులకు రెండ్రోజుల పాటు హౌం ఓటింగ్‌ చేపట్టారు. అంతే కాకుండా, పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం పలుదఫాలుగా అవకాశం కల్పించారు. ఇన్ని చేసినా స్పష్టమైన కారణాలు కానరానప్పటికి పోలింగ్‌శాతం తగ్గడంతో ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, పార్టీలు ఓటింగ్‌ సరళీపై స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నాయి.
లాభం నష్టాల అంచనాల్లో అభ్యర్థులు..
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల సందర్భంగా క్రమంగా పెరుగుతూ వచ్చిన ఓటర్లలో పోలింగ్‌ శాతంతో తగ్గుతూ వచ్చింది. ఎవరికి లాభం జరిగింది? ఎవరికి నష్టం జరిగింది..! అంశాలపై ప్రధాన పార్టీల విశ్లేషకులకు అంచనాలు అందక తలలు పట్టుకుంటున్నారు. 2018లో 76.45 శాతం నమోదైంది. 2023లో 74.93శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే 2 శాతం ఓటింగ్‌ తగ్గింది. ఈ గణాంకాలను విశ్లేషించుకుంటూ ప్రధాన రాజకీయ పార్టీల పరిశీలకులు అభ్యర్థుల జయాపజయాలపై మల్లగుల్లాలు పడుతున్నారు.

Spread the love