– పోలింగ్‌ను బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు
– చివరికి అధికారుల హామీతో విరమణ
– మైలారంలో ఓటేసిన ఆరుగురు
– మైనింగ్ తవ్వకాలను నిరసిస్తూ గ్రామస్తుల ఎన్నికల బహిష్కరణ
నవతెలంగాణ -బల్మూరు/ఇల్లందు/ఏన్కూర్
సమస్యలపై ఓటర్లు ఎక్కుపెట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, తాము పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోవాలని ఎన్నోసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన పలు గ్రామాల ప్రజలు సోమవారం పోలింగ్‌ను బహిష్కరించారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడం లేదని ఓటింగ్ స్లిప్పులతో నిరసన తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు నచ్చచెప్పినా ససేమిరా అంగీకరించలేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో కొన్ని గ్రామాల ప్రజలు విరమించారు. మరికొన్నిచోట్ల ఆందోళనను విరమించినా కొంతమంది ఓటేసేందుకు ససేమిరా అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండల పరిధిలోని మైలారం గ్రామంలోని 179 పోలింగ్ కేంద్రంలో ఆరుగురు ఓటర్లు మాత్రమే ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మైలారం గుట్టపై మైనింగ్ తవ్వకాలను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఎన్నికలను బహిష్కరిస్తామంటూ గ్రామస్తులు ఏకగ్రీవంగా పట్టుబట్టారు. అధికారులు నచ్చ చెప్పినప్పటికీ ఓటింగ్ రోజు ఎవరూ ఓటింగ్‌లో పాల్గొనకుండా ఇండ్లల్లోనే ఉండిపోయారు. 785 ఓటర్లకు గాను ఆరుగురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారని పీఓ ఆంజనేయులు తెలిపారు. ఓటింగ్ ప్రారంభంలోనే ఆర్డీవో మాధవి డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు అక్కడికి వచ్చి గ్రామస్తులందరూ తమ ఓటు హక్కును వినియో గించుకోవాలని కోరినప్పటికీ ఓటింగ్‌లో పాల్గొనలేదు. సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో ముగ్గురు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోగా.. ఐదు గంటల సమయంలో మరో ముగ్గురు వచ్చి ఓటు వేశారు. కొత్తూరు మండలంలోని కొడిచల్ర తండా గ్రామపంచాయతీ పరిధిలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, సరైన సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఓటు వేసే ప్రసక్తే లేదని ఆందోళన చేశారు. అధికారులు గ్రామస్తులకు నచ్చజెప్పడంతో ఓటు వేశారు.
సీసీ రోడ్లు.. డ్రయినేజీ లేదని ఓటింగ్ బహిష్కరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని లచ్చగూడెం బూత్ నెంబర్ 51, బూత్ నెంబర్ 52, కొమ్ముగూడెం గ్రామాల ప్రజలు ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రయినేజీలు, తాగు, సాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై గ్రామస్తులంతా చర్చించుకుని పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్‌ను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య గ్రామాలకు వెళ్లినచ్చ చెప్పారు. అనంతరం రిటర్నింగ్ అధికారి కాశయ్య, తహసీల్దార్ రవికుమార్, సీఐ కరుణాకర్ గ్రామస్తులను కలుసుకొని సమస్యలపై చర్చించారు. గ్రామస్తులు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయని ఓట్లు వేయకుండా బహిష్కరించడం సరికాదని అధికారులు నచ్చచెప్పారు. ఓటింగ్‌లో పాల్గొనాలని చేసిన విజ్ఞప్తితో గ్రామస్తులంతా ఓటింగ్‌లో పాల్గొన్నారు.
ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ..
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్తులు పోలింగ్ బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ పోలింగ్ బహిష్కరిస్తున్నట్టు చెప్పారు. ఎన్నో ఏండ్లుగా తాము వంతెన కోసం ఆందోళన చేస్తున్నామని అయినా ఎవరూ తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి వచ్చి ఓటర్లకు నచ్చజెప్పడంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం జగన్నాథ్ పూర్ పంచాయతీ బోరిగాంకు రహదారి సౌకర్యంలేదని ఎన్నికలను బహిష్కరించిన ఓటర్లు… నాయకులు, అధికారుల హామీతో ఓటింగ్‌లో పాల్గొన్నారు. కడెం మండలం అల్లంపల్లి, బజార్‌హత్నూర్ మండలం మాన్కా పూర్, దేగామ, ఇచ్చోడ మండలం బాబ్జిపేట, కాసిపేట మండలం వరిపేటలో గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించగా.. అధికారులు, ప్రజాప్రతినిధుల జోక్యంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్‌కు..
భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కలలో గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. తడిసిన ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన రైతులు ధర్నాకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రైతులకు అధికారులు నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు.
ఓటర్లపై తేనెటీగల దాడి
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని జేబీఎస్ ఉన్నత పాఠశాలలో 95, 98, 115 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. పాఠశాలలో పురాతన మర్రిచెట్లకు తేనెటీగల తుట్టెలు ఉన్నాయి. ఓటర్లు పోలింగ్ బూత్‌లోకి వస్తుండగా ఓటర్లపై ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఒక వృద్ధుడి కనురెప్పపై తీవ్రంగా కుట్టాయి. మరో ఐదుగురిని కూడా తేనెటీగలు కుట్టడంతో విపరీతంగా దద్దులు వచ్చాయి. పత్రికా విలేఖరి సలీం న్యూస్ కవరేజీ కోసం వెళ్లగా ఆయనను కందిరీగలు కుట్టాయి. విషయం తెలుసుకున్న రిటర్నింగ్ అధికారి కాశయ్య సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందించారు. పోలింగ్ బూతులకు వెళ్లే దారిలో తేనెటీగల తుట్టెలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఓటర్లు చెప్పారు. తేనెటీగలు కుట్టడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.