నేడు ఓటర్‌ తీర్పు

– ఉమ్మడి జిల్లాలో 21,83,235 మంది ఓటర్లు
– భద్రాద్రి జిల్లాలో 7 నుంచి సా.4 గం.వరకే పోలింగ్‌
– ఖమ్మంలో 1456, కొత్తగూడెంలో 1098 పోలింగ్‌ కేంద్రాలు
– వెబ్‌కాస్టింగ్‌లు, సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం
– నేడు కూడా కొనసాగనున్న ప్రలోభాలు..
తెలంగాణ సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ జరగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 21,83,235 మంది ఓటర్లు తమ తీర్పును నేడు వెలువరించనున్నారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పును డిసెంబర్‌ 3వ తేదీన వెలువరిస్తారు. ఖమ్మం జిల్లాలో 1496 పోలింగ్‌ స్టేషన్‌లలో 12,16,796 మంది, భద్రాద్రి కొత్తగూడెంలో 1098 పోలింగ్‌ స్టేషన్‌లలో 9,46,439 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుండగా మావోయిస్టు ప్రభావిత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుంది. డిసెంబర్‌ 3వ తేదీ ఆదివారం ఫలితాలు వెల్లడిస్తారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

ఖమ్మంలో 822 లొకేషన్స్‌లో పోలింగ్‌…
ఖమ్మం జిల్లాలో 822 లోకేషన్స్‌లో 1456 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. ఒక్కో లోకేషన్‌లో రెండు, అంతకుమించి పోలింగ్‌ బూత్‌లు కూడా ఉంటాయి. పోలింగ్‌బూత్‌కో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ (పీవో), ఓ ఏపీవో ఉంటారు. ఓపీవోలు 2,912 మంది విధులు నిర్వహిస్తారు. వెబ్‌కాస్టింగ్‌, సీసీ కెమెరాలు 2,338 ఏర్పాటు చేశారు. 194 లకేషన్‌లలో 390 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. మైక్రో అబ్జర్వర్లుగా 299 మందిని నియమిం చారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు 20% సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచారు. పోలింగ్‌ సిబ్బంది అంతా డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల నుంచి పోలింగ్‌ సామగ్రితో తరలివెళ్లారు.
భద్రాద్రిలో 95 మంది అభ్యర్థుల భవితవ్యం…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 95 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యం తేల్చేందుకు నేడు ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణలో 1313 మంది పీవోలు, ఇంతే మొత్తం ఏపీవోలు, 2626 మంది ఓపీవోలు, 306 మంది మైక్రో అబ్జర్వర్లు, 2,398 బ్యాలెట్‌ యూనిట్లు, 1544 కంట్రోల్‌ యూనిట్లు, 1540 వీవీ ప్యాట్‌లు అందుబాటులో ఉంచారు. ఈవీఎం యంత్రాల పర్యవేక్షణకు ఈసీఐఎల్‌ నుంచి 15 మంది ఇంజనీర్లను ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు.
ఇవి ఉండాలి…ఇవి ఉండొద్దు…
పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఓటర్లు విధిగా ఓటర్ల స్లిప్పుతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 15 గుర్తింపుకార్డుల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాలి. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు, మంచినీళ్ల బాటిళ్లు, మారుణాయుధాలు నిషిద్ధం. ఓటుహక్కు వినియోగించుకునేటప్పుడు సెల్ఫీలు, ఫొటోలు తీయడం నేరం.
ఇంకా కొనసాగుతున్న ప్రలోభాలు…
పోలింగ్‌ సమయం ఆసన్నమైనా ప్రలోభాలు తప్పట్లేదు. ఇప్పటికే రూ.500 మొదలు రూ.5000 వరకు ఓటర్లకు పంచారు. దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి చార్జీలు సైతం కొన్ని ప్రాంతాల్లో ఇస్తున్నారు. నాన్‌లోకల్‌ వారికి కొందరు ఓటుకు వచ్చాక నగదు ఇస్తామంటున్నా…కొందరు ఇప్పటికే ఇచ్చేస్తున్నారు. పంపకాల్లో పోలింగ్‌బూత్‌ల విషయంలో ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. పోల్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో ఒక పార్టీ ఒక ఏరియాలో సక్సెస్‌ అవుతుండగా…మరో పార్టీ మరో ప్రాంతంలో సమర్థవంతంగా పంపకాలు చేస్తోంది.

Spread the love