– బీసీ బిడ్డను ఆదరించి భూస్వాములను తరుముదాం
– ఎంతకాలం మోసపోదాం..ఎర్రజెండాను గెలిపిద్దాం
– భూ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలి
– ఉధతంగా సాగుతున్న సీపీఐ(ఎం) అభ్యర్థి యాదయ్య ప్రచారం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
నూటికి 90శాంగా ఉన్న ఓట్లు మనవి, సీట్లు వాళ్లకా, బీసీ బిడ్డను ఆదరించి భూస్వాములను తరుముదామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఎంతకాలం మోసపోదామని ఎర్రజెండాను గెలిపించుకొని హక్కులు కాపాడుకుందామని నినదించారు. ప్రజల గుండెల్లో ఎర్రజెండా ఉన్నదన్నారు. ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి యాదయ్యను గెలిపించి భూ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) అభ్యర్థి యాదయ్యను గెలిపించాలని కోరుతూ కొనసాగుతున్న ప్రచారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉధతంగా సాగుతోంది. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పెత్తుల్లలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎర్రజెండా ఎగరడం ఖాయమన్నారు. బూర్జవ పార్టీ అభ్యర్థులు డబ్బు, మద్యం లేకుండా గ్రామీణ ప్రాంతంలో తిరుగుతారా, ఎన్నికల ప్రచారం చేయగలరా..? అని ప్రశ్నించారు. ప్రజల మద్దతు సీపీఐ(ఎం)కు ఉందన్నారు. దేశాన్ని 10 ఏండ్లు పాలించిన బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పేదరికాన్ని నిర్మూలించలేక పోయిందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లేదన్నారు. కూలీలకు ఉపాధి కరువైందన్నారు. నిరుద్యోగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని దివాళ తీసేందుకు కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. పీజీ, డిగ్రీ చేసిన నిరుద్యోగులు సైతం కూలీలుగా జీవనం గడుపుతున్నారని చెప్పారు. ఈ బతుకులు మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చర్యలు చేపట్టాయని ప్రశ్నించారు. కేవలం పింఛన్లు,రైతు బంధు సరిపోదని నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు, పేదల్లో ఆర్థిక స్వావలంభన కల్పించేందుకు ఇంటికో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ ప్రయత్నం చేయడం లేదన్నారు. ఒక్క ఇంటిని కూడా మంజూరు చేసిన పాపాన కేసీఆర్ ప్రభుత్వం పోలేదన్నారు. ఇండ్ల స్థలాలు ఇవ్వలేదన్నారు. పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చి వేస్తున్నారని మండిపడ్డారు. వామపక్షాల ఉద్యమం ద్వారా పంపిణీ చేయబడిన భూములను పేదల నుంచి లాక్కుంటున్నారని అన్నారు. భూస్వాములకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఈ తరుణంలో ఎంత కాలం మోసపోదామని ప్రజలను ప్రశ్నించారు. ఎర్రజెండాను గెలిపించి భూ ఉద్యమాల వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. పాలక ప్రభుత్వాలు చేస్తున్న ఎన్నికల హామీలను అమలు కోసం సైతం ఎర్రజెండా మాత్రమే ఉద్యమిస్తుందన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి మాట్లాడుతూ ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమిస్తున్న సీపీఐ(ఎం)కు మాత్రమే పేదలను ఓటు అడిగే హక్కు ఉందన్నారు. ఎన్నికల అప్పుడు వచ్చే నాయకుల మాటలు నమ్మొద్దన్నారు. పేదల కోసం పని చేసే నాయకులను గెలిపించుకోవాలని కోరారు. దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని పాలిస్తున్న బీఆర్‌ఎస్ పేదలకు ఏమి చేసిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సామెల్, జగదీష్, కవిత, మండల కార్యదర్శి సీహెచ్ జంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు కిషన్, మండల నాయకులు గణేష్, రమేష్, రామకష్ణారెడ్డి, పంది జంగయ్య, బుగ్గరాములు, విగేష్, శాఖ కార్యదర్శిలు భాస్కర్, మధు తదితరులు పాల్గొన్నారు.