ఓటు.. సరుకు…

 Vote.. Cargo...ఓటు… ప్రజల చేతిలో ఒక వజ్రాయుధం లాంటిదంటారు సామాజికవేత్తలు. ఐదేండ్లపాటు పాలకుల విధానాలను, చర్యలను, పోకడలను ఓపిగ్గా భరించి… ఆ తర్వాత తమ చేతిలోని పాశుపతాస్త్రం లాంటి ఓటుతో ఒకే ఒక్క వేటేస్తారు ప్రజలు. అంతటి కీలకమైన ఓటు నానాటికీ తన ప్రభను, ప్రభావాన్ని కోల్పోవటం బాధాకరం. మనీ, మద్యం, మందబలంతో దాన్ని కొనుక్కుంటూ జల్సా చేస్తున్నాయి ధనస్వామ్య పార్టీలు. ఓటుతోపాటు ఆ ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులను సైతం కొనుగోలు చేయటం పాలక పార్టీలకు రివాజుగా మారింది. అలా అమ్ముడుపోవటం ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అలావాటుగా మారటం ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతి. అయితే తమది జాతీయ పార్టీ అంటూ జబ్బలు చరుచుకుంటున్న అధికార బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు తాజాగా ఓటుపై మాటలు తూలటం కడు విడ్డూరం. అప్పుడెప్పుడో తెలుగుదేశాధినేత ఎన్టీఆర్‌ ‘డబ్బులెవరిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం సైకిల్‌కే వెయ్యిండి…’ అంటూ వ్యాఖ్యానించటం పలు విమర్శలకు తావిచ్చిందని ఆనాటి సీనియర్‌ పాత్రికేయులు ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. ఇప్పుడు అదే కోవలో గులాబీ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఓటుపై చేసిన కామెంట్లపై హాట్‌ హాట్‌గా చర్చ నడుస్తోంది. ‘డబ్బులిస్తే తీస్కోండి.. ఓటు మాత్రం కారుకే వేయండి…’ అంటూ ఆయన వ్యాఖ్యానించటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలను సాదాసీదాగా తీసుకోలేం. ఒక ముఖ్యమైన రాజకీయ పార్టీ ప్రతినిధులుగా, అందునా ఆయా పార్టీల విధానపరమైన నిర్ణయాలకు బాధ్యులుగా మనం వారిని చూస్తున్న క్రమంలో అత్యంత జాగ్రత్తగా వారు మసలుకోవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటును, ఓటర్లను చులకనగా చూడటం ఆ స్థాయి వ్యక్తులకు భావ్యం కాదు.
నూతన ఆర్థిక విధానాల అమలు ఫలితంగా సమాజంలోని ప్రతీదీ సరుకైంది. ప్రచార, ప్రసార మాధ్యమాల్లో పొద్దున లేస్తే ఆఫర్లు, డిస్కౌంట్ల చుట్టే వినియోగదారుడి మెదడును తిప్పుతూ అతడిని మార్కెట్‌ మాయాజాలంలో పడేస్తున్నారు. పెట్టుబడిదారులు తమ లాభాల కోసం వేసే పాచికల్లో మనిషి బంధీ అయిపోతున్నాడు. ఆ క్రమంలో వినిమయతత్వం బాగా పెరిగిపోతోంది. సరిగ్గా ఈ బలహీనతనే ఆసరాగా చేసుకున్న బూర్జువా పార్టీలు… ఓటును కూడా సరుకుగా మార్చేశాయి. దశాబ్దాల క్రితమే ఓటుకు నోటుతో రేటు కట్టేశాయి. దాంతో ఎన్నికలు, రాజకీయాలు డబ్బు మయంతో గబ్బుకొడుతున్నాయి. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకున్న వ్యాపారులు, వాణిజ్య వేత్తలు, పరిశ్రమాధిపతులు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారంటారు…’ అన్నట్టు ఇప్పుడు వందల కోట్లుంటేనే ఎమ్మె ల్యే, వేల కోట్లుంటేనే ఎంపీ అవుతామనే భావన సర్వత్రా నెలకొంది. నెలకొనటమేగాదు ఇదే వాస్తవం కూడా.
ఈ క్రమంలో ప్రజా సేవ పక్కకుపోయి… ధనార్జనే రాజకీయ నాయకుల ధ్యేయంగా మారింది. ఫలితంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం రాజ్యమేలుతున్నాయి. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే దుస్థితి.. ఒక్క వామపక్షాల ఏలుబడిలో ఉన్న కేరళలో తప్ప. గతంలో లెఫ్ట్‌ సర్కార్లు పాలించిన బెంగాల్‌, త్రిపురలోనూ ‘ధన రాజకీయాల’కు తావుండేది కాదు. ఎప్పుడైతే ఆయా రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రభావం తగ్గిందో అక్కడ కూడా ‘మనీ పాలిటిక్స్‌’ మనుగడలోకి రావటం అత్యంత బాధాకరం. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ దుస్థితి మరింత వ్యవస్థీకృతమైంది. 2014 నుంచి ఇప్పటిదాకా అనేక రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన కాషాయ పార్టీ… అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి… దొడ్డిదారిన, దొంగ పద్ధతుల్లో, అనైతిక వ్యవహాలతో గద్దెనెక్కి ఏలుతోంది. ఇది చాలా ప్రమాదకరం.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఓట్లు, ఎన్నికలు అనే వాటికే అర్థం, పరమార్థం ఉండవు, ఉండబోవు. అందుకే దీన్ని మార్చటానికి ప్రతీ ఒక్కరూ కంకణబద్ధులు కావాలి. యువత, మేధావులు, సామాజిక వేత్తలు ఇందుకోసం నడుం కట్టాలి. అప్పుడే ప్రజల కోసం పని చేస్తూ, ప్రజల నుంచి ఉద్భÛవించిన పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షం, ఉప్పల మల్సూర్‌, రజబ్‌ అలీ, సున్నం రాజయ్య లాంటి మహోన్నత ప్రజాప్రతి నిధులను ఈ సమాజానికి అందించగలం. అప్పుడే చట్టసభలు వర్థిల్లుతాయి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అదే డబ్బు రాజకీయాలకు విరుగుడు మంత్రం.

Spread the love