ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం

– రైతుబంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్‌
– కాంగ్రెస్‌ది భూమాత కాదు.. భూ మేత
– రఘునందన్‌కు ఏక్‌అనా పైసా తెల్వదు
– అభ్యర్థి చరిత్ర, పార్టీ చరిత్ర తెలుసుకోవాలి
– ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి
– దుబ్బాక ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌
నవ తెలంగాణ -దుబ్బాక/ దుబ్బాక రూరల్‌
‘రైతుబంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్‌. కాంగ్రెస్‌ది భూమాత కాదు.. భూ మేత. రఘునందన్‌కు ఏక్‌అనా పైసా తెల్వదు. అభ్యర్థి చరిత్ర, పార్టీ చరిత్ర తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటే ప్రజల ఆయుధం. ప్రభాకర్‌రెడ్డిని గెలిపించండి. దుబ్బాక అభివద్ధి నేను చూసుకుంటా’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ఆదివారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ‘నేను పుట్టి, చదువుకున్న దుబ్బాక గడ్డ గొప్పది. ఇక్కడే పదో తరగతి వరకు చదివాను. దుబ్బాక పాఠశాల పెట్టిన భిక్షతోనే నేను ఈస్ధాయి(సీఎం)లో ఉన్నాను. దుబ్బాక అంటే నాకు అమితమైన ప్రేమ. ఈ ప్రాంతంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పదేళ్లు ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి యోగ్యత ఉన్న వ్యక్తి… నాకు మంచి సన్నిహితుడు. దుబ్బాకను కాపాడే అవసరం ఉందనే కొత్త ప్రభాకర్‌ రెడ్డిని నిలబెట్టా. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే నెలలోపే ఆర్డీఓ ఆఫీసు, రింగ్‌ రోడ్డు, కళాశాలను మంజూరు చేస్తా’ అని అన్నారు. ఉప ఎన్నికల్లో నేను రాలే.. అందుకే ఓడిపోయాం.. నేను వచ్చుంటే రఘునందన్‌ పని వొడిషిపోవు.. నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చి ‘ఏక్‌ అణా పని చేయలేదని ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై నిప్పులు చెరిగారు. 157 మెడికల్‌ కాలేజీల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్కటీ మంజూరు చేయలేదన్నారు. జిల్లాకో నవోదయ పాఠశాల ఇవ్వాలని ఉత్తర్వులున్నా రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదని కేంద్రంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటేస్తే మోరీల పారేసినట్లైతదని, అప్పుడు తెలంగాణ పరిస్థితి కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లవుతదని విషదీకరించారు. రాహుల్‌కు ఎద్దు ఎవుసం తెల్వదని, కాంగ్రెస్‌ది భూమాత కాదది.. భూ మేత అని ఎద్దేవా చేశారు.1969లో 400 మంది యువకుల్ని కాల్చి చంపింది కాంగ్రెస్‌ కాదా అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టింది టీఆర్‌ఎస్‌ అని, కన్నతల్లి లాంటి బీఆర్‌ఎస్‌ను ఆదరించాలన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి
ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
వ్యవసాయ స్థిరీకరణ కోసమే ప్రాజెక్టులు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఏడాది పాటు సకల జనుల సమ్మె చేస్తున్న బీఆర్‌ఎస్‌కు దేశంలోని 33 పార్టీలు మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. మోసం చేసిన కాంగ్రెస్‌ కు ఓటేస్తే గోషపడతామన్నారు. రైతులు బాగుంటెనే పల్లెలు బాగుపడి రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందన్నారు. ఒకప్పుడు దుబ్బాక ప్రాంతంలో 600 ఫీట్ల బోరు వేసినా నీరు పడేది కావని నీళ్ల, కరెంటు కోసం అరిగోసపడ్డ ప్రాంతమిదని గుర్తు చేశారు. ఈ గోసలు తప్పాలని వ్యవసాయాన్ని స్థిరీకరించాలన్న సంకల్పంతోనే ప్రాజెక్టులు కట్టుకోవడం జరిగిందన్నారు. నాటితో పోలిస్తే దుబ్బాక ప్రాంతం నేడు ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో పండగ వాతావరణం కనిపిస్తుందన్నారు. మల్లన్నసాగర్‌ ద్వారా దుబ్బాకలో 1 లక్షా 75 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 7500 కొనుగోలు కేంద్రాల ధాన్యం సేకరిస్తున్నామన్నారు. జెడ్పీ చైర్‌ పర్సన్‌ వేలేటి రోజా శర్మ,ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి,యాదవ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్‌ హుస్సేన్‌,మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గన్నె వనితభూమిరెడ్డి,వైస్‌ చైర్‌ పర్సన్‌ అధికం సుగుణబాలకిషన్‌ గౌడ్‌,ఎంపీపీ కొత్త పుష్పలతకిషన్‌ రెడ్డి,జడ్పీటీసీ కడ్తాల రవీందర్‌ రెడ్డి,పీఏసీఎస్‌ చైర్మన్‌ శేర్ల కైలాష్‌,చైర్‌ పర్సన్‌ చింతల జ్యోతి కష్ణ,వైస్‌ ఎంపీపీ అస్క రవి,బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి,మనోహర్‌ రావు,మోహన్‌ రెడ్డి,సోలిపేట సతీష్‌ రెడ్డి పాల్గొన్నారు.

Spread the love