– కబ్జాకు గురికానున్న 22 ఎకరాల కుంట శిఖం, పొరంబోకు భూమి
– 3 కుంటలు, గుట్టల ఆక్రమణకు యత్నం
– పట్టా భూముల్లో ప్యూటర్ ఎక్స్‌టెన్షన్ ప్లాట్స్‌గా బ్రోచర్
– జయలక్ష్మి పట్టా భూమి ఆక్రమణ, నాట్లువేసి దౌర్జన్యం
– మత్స్యకారులను కూడా వేటకు పోనియ్యని వైనం
– ఫారెస్ట్ భూమిలోంచి వెంచర్‌కు బాట అంటూ ప్రచారం
– వృందా వాలీ ప్రీమియం ఫార్మ్‌లాండ్ కమ్యూనిటీ పేర దందా
– కబ్జాదారులకు రాజకీయ అండ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా మారింది భూ దందా పరిస్థితి. రాజకీయ అండతో రియల్ ఎస్టేట్ భూ దందా సాగుతోంది. ఎకరాల్లో కొనుగోలు.. గుంటల్లో అమ్మకాలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. కుంట శిఖం, గుట్టలు, పొరంబోకు, అసైన్డ్ భూముల్ని ఆక్రమించాలని చూస్తు న్నారు. పట్టా భూముల్ని అమ్మకపోతే దౌర్జన్యంగా ఆక్రమిస్తు న్నారు. కుంటల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులు, శివారు భూముల్లోకి పట్టాదారులు పోయే నక్షా బాటను కబ్జా చేశారు. గేట్ పెట్టి దారిలేదు పొమ్మంటూ గెంటేస్తున్నారు. పక్కనున్న భూముల్ని తక్కువ ధరకు అమ్మండీ..? లేదంటే ఆక్రమణే అంటూ బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్నారు. పట్టా భూమిలో కడీలు నాటి దౌర్జన్యంగా ఆక్రమించి సాగు చేస్తు న్నారు. పక్కనున్న కుంట శిఖం, గుట్టలు, పొరంబోకు, అసైన్డ్ భూమల్ని వెంచర్‌లో కలిపేసుకునే కుట్ర సాగుతోం దని స్థానికులు పేర్కొంటున్నారు. రూ.22 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూముల్ని కాజేసేందుకు జరుగుతున్న ‘వృందా దందా’పై నవతెలంగాణ పరిశీలనాత్మక కథనం..!
మెదక్ జిల్లా శివంపేట మండలం కాంతాన్‌పల్లి, వెల్దుర్తి మండలం హస్తాల్‌పూర్ శివారులో ‘వృందా వ్యాలీ ప్రీమియం ఫార్మ్‌ల్యాండ్ కమ్యూనిటీ’ పేరిట 65.37 ఎకరాల్లో భారీ వెంచర్ వేశారు. గుంటల చొప్పున 153 ప్లాట్స్ చేశారు. వందల ఎకరాల్లో రియల్ దందా చేసేందుకు వచ్చిన వృందా కంపెనీకి స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిధి అండగా నిలిచారు. 80 ఎకరాల భూముల్ని వ్యాపారం కోసం రైతుల నుంచి ఇప్పిస్తానని బేరం కుదుర్చుకున్నారు. తాను స్థానిక చిన్న చిన్న రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన 65.37 ఎకరాల్లో వెంచర్ చేశారు. మిగతా ఇద్దరు రైతులకు ఉన్న 22 ఎకరాల్ని కూడా కొనేందుకు పూనుకున్నారు. ఆ రైతులు అమ్మేందుకు ఇష్టపడకపోయేసరికి దౌర్జన్యం చేస్తున్నారు. ఒక పక్క రెరా రూల్స్ ఉల్లంఘిస్తూనే మరో పక్క కబ్జాలకు పాల్పడుతు న్నారు. మత్స్యకారుల్ని చేపల వృత్తికి దూరం చేశారు. రైతుల పట్టా భూమిని ప్యూచర్ ఎక్స్‌టెన్షన్ వెంచర్‌గా బ్రోచర్‌లో వేశారు. రెండు వెంచర్ల మధ్య అటవీ శాఖ భూమి ఉంది. అందులోంచి బాట వేసినట్టు బ్రోచర్‌లో ముద్రించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
మూడు కుంటలు ఆక్రమణకు యత్నం
వృందా వెంచర్ కుంటలు, గుట్టల్ని ఆక్రమించేందుకు పూనుకుంది. వెంచర్ కింద మూడు కుంటలతో పాటు శిఖం భూములున్నాయి. సర్వే నెంబర్ 341లో ఉన్న కరీంకుంట 3.30 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో కొంత భూమిని వెంచర్‌లో కలిపేశారు. దీని కిందనే హస్తాల్‌పూర్ శివారులో 5 ఎకరాల విస్తీర్ణంలో గుళ్లకుంట ఉంది. దాని కిందనే 4 ఎకరాల విస్తీర్ణం కల్గిన మాసానికుంట ఉంది. ఈ మూడు కుంటలు వర్షాధారంగా నిండుతాయి. గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలకు తాగునీరు, మేత అవసరాలకు చుట్టు పక్కల రైతులు ఉపయోగిస్తారు. మూడు కుంటల్లోనూ మత్స్యకారులు చేపలు పెంచుతారు. మెయిన్ రోడ్డు నుంచి ఈ కుంటలకు వెళ్లేందుకు నక్షా డొంక బాట ఉంది. వృందా వాళ్లు ప్లాట్స్ చేసి ఆ డొంకను వెంచర్‌లో కలిపేశారు. రోడ్డు వద్ద గేటు పెట్టి సెక్యూరిటీ పెట్టారు. కింది భాగంలో ఉన్న కుంటలు, ఇతర రైతుల భూములకు వెళ్లేందుకు ఉన్న బాట లేకుండా పోయింది. ఇద్దరు పట్టాదారుల భూముల్ని కొనేస్తే ఆ ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లరు. దాంతో ఆ మూడు కుంటల్ని కూడా వెంచర్‌లో కలిపేసుకునే ప్రమాదముందని స్థానికులు చెబుతున్నారు. కుంటల ఎఫ్‌టీఎల్ పరిధిలోని శిఖం భూములు, గుట్టలు, పొరంబోకు, అసైన్డ్ భూమి 22 ఎకరాల వరకుంటది. ట్రిపుల్ ఆర్ రోడ్డు వస్తుండటంతో అక్కడ ఎకరం ధర దాదాపు కోటి పలుకుతుంది. 22 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేయనున్న వృందా సంస్థపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పట్టా భూమి ఆక్రమణ.. బాట బందు.. దౌర్జన్యం
వృందా వెంచర్ సంస్థ కొనుగోలు చేసిన భూముల కింది భాగంలో జయలక్ష్మీ, విశ్వనాథం అనే రైతులకు పట్టా భూములున్నాయి. విశ్వనాధంకు 14.20 ఎకరాలు, జయలక్ష్మికి 7.19 ఎకరాల భూమి ఉంది. జయలక్ష్మి పాలొళ్లకు చెందిన 7.19 ఎకరాల భూమిని పీఏసీఎస్ చైర్మెన్, బీఆర్‌ఎస్ నాయకులు వెంకట రాంరెడ్డి కొనుగోలు చేశారు. తన భూమికి వెంచర్ చేసిన భూమికి మధ్యలో జయలక్ష్మి, విశ్వనాథంకు చెందిన 22 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని తక్కువ ధరకే కొనుగోలు చేసి వెంచర్‌లో కలిపేసుకోవాలని సదరు లీడర్ అనుకున్నారు. తద్వారా పక్కనే ఉన్న గుట్ట భూముల్ని కూడా కలిపేసుకోవచ్చు. అందుకే ఆ ఇద్దరి భూముల్ని కొనుగోలు చేసేందుకు తక్కువ ధరకు అడిగారు. వాళ్లు అమ్మేందుకు సిద్దపడలేదు. జయలక్ష్మి తన 7.19 ఎకరాల భూమిని చదును చేసి పొలం చేసింది.
బోర్లు, బావులు తవ్వి పంట పండిస్తుంది. కుటుంబ అవసరాలరీత్యా ఆమె హైదరాబాద్‌లో ఉంటూ కౌలుదారుని చేత సాగు చేయిస్తుంది. ఆమె భూమిని కాజేయాలని చూసిన చైర్మెన్ దౌర్జన్యంగా రెండు నెలల క్రితం జయలక్ష్మి భూమిలో కడీలు పాతాడు. తన పొలంలో పోసిన నారుమడిని చెడగొట్టాడు. చైర్మెన్ దౌర్జన్యం గురించి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేస్తే ఎవ్వరు పిలిచినా పంచాయతీకి రాలేదు. పైగా జయలక్ష్మి భూమిని కౌలుకు సాగు చేస్తున్న వ్యక్తిని బెదిరించి పొలంలోకి రానివ్వలేదు. బాట ఆక్రమించి పొలంలోకి జయలక్ష్మిని కూడా వెళ్లనీయలేదు. ఎవ్వరూ అక్కడికి రాకుండా చేసిన వెంకట్ రాంరెడ్డి జయలక్ష్మి పట్టా భూమిలో వరి నాట్లు వేసి ఆక్రమించాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే మీ పాలొళ్ల భూమిని నేను కొన్న.. దానిలోకి జయలక్ష్మి వెళ్లాలని, ఆమె భూమి తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దాంతో ఆమె మెదక్ ఎస్పీ ప్రియదర్శినికి ఫిర్యాదు చేయడంతో సీఐ శ్రీధర్ విచారించి చైర్మెన్‌పై కేసు నమోదు చేశారు.
నా భూమి ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారు
నా భూమిని వెంకటరాంరెడ్డి ఆక్రమించారు. 7.19 ఎకరాల పట్టా భూమిలో బోరు వేసినం. బావి తవ్వుకున్నం. పొలాలు అచ్చుకట్టి పంట పండిస్తున్నం. ఎన్నో ఏండ్ల క్రితం మా పాలొళ్లతో భూమి పంపిణీ చేసుకున్నం. ఇటీవల మా పాలొళ్ల భూమిని కొనుగోలు చేసిన చైర్మెన్ మా భూమిని కూడా అమ్మాలని బెదిరించాడు. నేను అమ్మనంటే బాట మూసేసి పోనియ్యలేదు. కౌలుదారుడ్ని బెదిరించి పంట వేయనీయలేదు.
మా భూమిలో కడీలు పాతిండు. మేం నారు పోస్తే చెడగొట్టిండు. మమ్ముల్ని బెదిరించి మా పొలాల్ని ఆక్రమించి పంట వేశారు. నక్షాలో డొంగ బాట ఉంటే దాన్ని వెంచర్‌లో కలిపి గేటు పెట్టి మమ్ముల్ని పోనిస్తలేరు. న్యాయం చేయాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దగ్గరికెళ్తే… ‘గొడవెందుకు భూమిని ఆమ్మేయండి’ అన్నాడు. పెద్ద మనుషులకు చెప్పినా లెక్కచేయలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం జరగాలి.
జయలక్ష్మి, కొంతాన్‌పల్లి