పదేండ్లుగా పెరగని ఆర్టీసీ కార్మికుల వేతనాలు

– రెండో వేతన సవరణలు 2017, 2021 వెంటనే అమలు చేయాలి
– కొత్త సంస్కరణల పేరుతో సంస్థను నిర్వీర్యం చేస్తున్న ఎండీ : టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్‌
నవతెలంగాణ-ముషీరాబాద్‌
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రెండవ వేతన సవరణలు 2017, 2021 జరగకపోవడంతో పదేండ్లుగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెరగడం లేదని తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే హనుమంతు ముదిరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వేతన సవరణ చేసి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం టీఎస్‌ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి బస్సు భవన్‌ వరకు ర్యాలీ చేపట్టి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్‌ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీలో యూనియన్లను నియంత్రించి కార్మికులతో 14 గంటల డ్యూటీ చేయిస్తున్నారని, దాంతో పని భారం పెరిగి అనేకమంది కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా కనుగుణంగా ప్రజా రవాణా మెరుగుపరచడం కోసం బస్సు డిపోల సంఖ్య పెంచాల్సి ప్రభుత్వం.. డిపోలను తగ్గించడం రాచరిక పాలనకు నిదర్శనమన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీలో యూనియన్లను అనుమతించి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కార్మిక సమస్యలపై ఏ రోజూ దృష్టి పెట్టలేదని, పైగా కొత్త కొత్త సంస్కరణల పేరుతో సంస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. మహిళా కార్మికులకు రాత్రి 8 గంటలకు డ్యూటీలు ముగించే విధంగా ప్రతి డిపోలో డ్యూటీలు వేయాలన్నారు. రిటైర్డ్‌ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బహుజన వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సుద్దాల సుధాకర్‌, రాష్ట్ర చీఫ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డి.వి.కె.రావు, అడ్వైజర్‌ కృష్ణ, జాయింట్‌ సెక్రటరీ స్వాములయ్య, కోశాధికారి పీఎస్‌ఎస్‌ రావు, హైదరాబాద్‌ రీజినల్‌ సెక్రటరీ రాజయ్య, మహిళా నాయకులు సత్యవతి, బుల్లెట్‌ పాండు తదితరులు పాల్గొన్నారు.

Spread the love