కార్మికుల వేతనాలు తక్షణం సవరించాలి

– కనీస వేతనం రూ.26వేలు చేయాలి
– కమిటీల పేరుతో కాలయాపన
– ఈనెల 17న కలెక్టరేట్ల ముట్టడి: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– పటాన్‌చెరు పారిశ్రామికవాడలోకి జీపుజాత
నవతెలంగాణ-పటాన్‌చెరు
ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న కార్మికుల కనీస వేతనాలను వెంటనే సవరించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ఉపాధ్యక్షులు భూపాల్‌, మల్లికార్జున్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాలు సవరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి చేపట్టిన రాష్ట్ర వ్యాప్త జీపుజాత శుక్రవారం సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోకి ప్రవేశించింది. రుద్రారం, పాశమైలారం, పటాన్‌చెరు పారిశ్రామిక వాడల్లో కార్మికుల సమావేశాలు, సభలు నిర్వహించి చైతన్యపరిచారు. పటాన్‌చెరులో చుక్క రాములు, రుద్రారం ఎమ్మెస్‌ఎన్‌లో భూపాల్‌, పాశమైలారంలోని కిర్బీ పరిశ్రమ వద్ద మల్లికార్జున్‌ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలో 73 షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు 15 ఏండ్లుగా కనీస వేతనాలు సవరించలేదన్నారు. ప్రయివేటు రంగంలో సుమారు కోటి మందికి పైగా ఉన్న కార్మికుల జీతభత్యాలు పెంచకపోవడం వల్ల కోట్లాది రూపాయలు నష్టపోయారన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఐదేండ్లకొకసారి చట్టబద్ధంగా ప్రభుత్వం వేతనాలు సవరించాలని ఉన్నప్పటికీ అమలు కావడం లేదన్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వేతనాలు సవరించలేదన్నారు. కనీస వేతనాల పెంపు కోసం, కార్మిక చట్టాల అమలు కోసం పదేండ్లుగా వివిధ రూపాల్లో విజ్ఞప్తి చేస్తునప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతాల్లో పెద్దఎత్తున కార్మికుల్ని కలిసి వారి సాధక బాధకాలను తెలుసుకొనేందుకు సీఐటీయూ ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి జీపు జాత ప్రారంభమైందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో కార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని.. ప్రతి పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికులు నూటికి 90శాతం పైగా ఉంటున్నారని తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులే పనిచేస్తున్నారని చెప్పారు. మహిళా కార్మికులు కూడా గణనీయంగా ఉన్నారని.. పాశమైలారం, పటాన్‌చెరు ప్రాంతంలో ఉన్న అనేక ఫార్మా, ఇంజినీరింగ్‌ పరిశ్రమల్లో వందలాది మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారన్నారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, సెలవులు, బోనస్‌, గ్రాట్యూటీ ఇతర సౌకర్యాలు, చట్టబద్ధ హక్కులు సరిగ్గా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రోజుకు 12 గంటలు పని చేయించుకుంటున్నా ఓవర్‌ టైం వేతనాలు చెల్లించడం లేదన్నారు. అనేక భారీ పరిశ్రమల్లో కాంట్రాక్టు, క్యాజువల్‌, ట్రైనీలు, లాంగ్‌టర్మ్‌, ఫిక్స్‌, టర్మ్‌ నేమ్‌ మ్యాప్స్‌ లాంటి అప్రెంటిస్‌ స్కీముల ద్వారా నియమించడిన కార్మికులు.. ఉత్పత్తిలో శాశ్వత కార్మికులతో సమానంగా పనిచేస్తున్నా సమాన వేతనం, సౌకర్యాలు కల్పించకుండా వారి శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్‌ 2021లో ఐదు రంగాల్లో కనీస వేతనం రూ.18వేలుగా నిర్ణయించి ఉన్నతాధికారులు ఇచ్చిన ఫైనల్‌ నోటిఫికేషన్‌ కూడా యజమానుల ఒత్తిడికి లొంగి గెజిట్‌ చేయకుండా ముఖ్యమంత్రి కార్యాలయం అడ్డుకుంటున్నదని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు మూడుసార్లు కనీస వేతన సలహామండలిని ఏర్పాటు చేసిందని.. మండల సిఫారసులను అమలు చేయకుండా తొక్కి పెట్టిందని ఆరోపించారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. ఈనెల 17 వరకు జీపు జాత కొనసాగుతుందని, ఈలోపు ప్రభుత్వం స్పందించి కనీస వేతనాలను సవరించాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పాండు రంగారెడ్డి, సురేష్‌, నరేష్‌, శాంత కుమార్‌, జయకుమార్‌, చంద్ర కిరణ్‌సింగ్‌, మల్లేష్‌, శ్యామ్‌, వివిధ పరిశ్రమల కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Spread the love