పరిహారం కోసం ఎదురుచూపులు

– మూడు నెలలు అవుతున్నా రైతులకు అందని రొక్కం
– 6,226 మంది రైతులకు చెందిన 7,909 ఎకరాల పంట నష్టం
నవతెలంగాణ-బోనకల్‌
6,226 మంది రైతులు రూ.7.90 కోట్ల పరిహారం కోసం మండల అన్నదాతలు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. బోనకల్‌ మండలంలో మార్చి నెలలో కురిసిన అకాల వర్షం వలన 6,226 మంది రైతులకు చెందిన 7,909 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు తేల్చారు. అకాల వర్షాల వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న పంటతో పాటు ఇతరుల పంట కూడా దెబ్బతన్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండలంలోని రావినూతల, గార్లపాడు గ్రామాలలో నేలకొరిగిన మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం రావినూతల గ్రామంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ప్రాథమిక అంచనా ప్రకారం పంట నష్టం పై పరిహారాన్ని కూడా రావినూతల విలేకరుల సమావేశంలోనే ప్రకటించి అదే రోజు సాయంత్రం కల్లా నిధులను విడుదల చేస్తున్నట్లు జీవో కూడా విడుదల చేశారు. వెంటనే జిల్లా అధికారులు పంట నష్టం పై సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ విపి గౌతమ్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదేశాల ప్రకారం బోనకల్‌ మండలం లో వ్యవసాయ శాఖ అధికారులు వారం రోజులపాటు 22 గ్రామాలలో పంట నష్టం పై సర్వే నిర్వహించారు.
మండలంలో మొత్తం 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల వ్యాప్తంగా అకాల వర్షాల వలన 6,226 మంది అన్నదాతలకు చెందిన 7,909 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలో తేల్చారు. ఈ సర్వే ప్రకారం మండల అన్నదాతలకు 6,226 మంది రైతులకు గాను రూ 7.90 కోట్లు రైతులకు పరిహారంగా అందనున్నాయి. మండల వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్యధికంగా లక్ష్మీపురం రెవిన్యూ గ్రామంలో 1,088 రైతులకు చెందిన 1,509 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారణ చేశారు. లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో గోవిందాపురం(ఎల్‌) గ్రామం ఉంది. అత్యల్పంగా బ్రాహ్మణపల్లి గ్రామంలో 39 మంది రైతులకు చెందిన 40 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు తేల్చారు. ముష్టికుంట గ్రామంలో 920 మందికి చెందిన 930 ఎకరాలలో, ఆళ్లపాడులో 540 మందికి చెందిన 792 ఎకరాలలో, రావినూతలలో 500 మంది రైతులకు చెందిన 717 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు సర్వేలో తేల్చారు. ఆళ్ళపాడు రెవెన్యూ పరిధిలో రాయన్నపేట గ్రామం ఉంది. పెద్ద బీరవల్లి గ్రామంలో 544 మంది రైతులకు చెందిన 617 ఎకరాలలో, గార్లపాడు గ్రామానికి చెందిన 414 మంది రైతులకు చెందిన 374 ఎకరాలలో, బోనకల్‌ గ్రామానికి చెందిన 265 మంది రైతులకు చెందిన 494 ఎకరాలలో తూటికుంట గ్రామానికి చెందిన 263 మంది రైతులకు చెందిన 416 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు తేల్చారు. పెద్ద బీరవల్లి రెవిన్యూ పరిధిలో జానకిపురం, సీతానగరం గ్రామపంచాయతీలు ఉన్నాయి. చిరునోములలో 45 మంది రైతులకు చెందిన 594 ఎకరాలు, కలకోటలో 762 మందికి చెందిన 266 ఎకరాలలో, చొప్పకట్లపాలెం గ్రామంలో 291 మందికి చెందిన 329 ఎకరాలలో, చిన్న బీరవల్లి గ్రామంలో 228 మంది రైతులకు చెందిన 222 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు సర్వే లో తేల్చారు. నారాయణపురం గ్రామంలో 148 మంది రైతులకు చెందిన 102 ఎకరాలలో, రామాపురంలో 143 మందికి చెందిన 153 ఎకరాలలో, రాపల్లి లో 106 మందికి చెందిన 125 ఎకరాలలో, గోవిందాపురం ఏ గ్రామంలో 59 మంది రైతులకు చెందిన 109 ఎకరాలలో, మోటమర్రి గ్రామంలో 61 మంది రైతులకు చెందిన 57 ఎకరాలలో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు సర్వేలో తేల్చారు. ఈ విధంగా మండల వ్యవసాయ శాఖ అధికారులు నష్టం అంచనా తేల్చి మూడు నెలలు అవుతుంది. విలేకరుల సమావేశం నిర్వహించిన రోజునే ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిహారాన్ని రైతులకు వెంటనే అందజేస్తామని రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని ప్రకటించారు. సర్వే పూర్తికాగానే నష్టపోయిన ప్రతి రైతుకి పరిహారం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మార్చి 23న ముఖ్యమంత్రి రావినూతలలో విలేకరుల సమావేశం నిర్వహించి ప్రకటించి నేటికి సుమారు మూడు నెలలు అవుతున్న పరిహారం మాత్రం బాధిత రైతులకు అందలేదు. మూడు నెలల నుంచి వారం పది రోజులలో రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం, అధికారులు ప్రకటిస్తూ వస్తున్నారు. దీంతో రైతులు ఆ పరిహారం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఈ నెల 12 నుంచి 15వ తేదీల మధ్య రైతుల ఖాతాలో పరిహారం జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటి వరకు రైతుల ఖాతాలో పరిహారం జమ కాకపోవటంతో రైతులు తీవ్ర నిరాశ నిస్పృహలలో ఉన్నారు. మరో 15 రోజులలో వ్యవసాయ సీజన్‌ కూడా ప్రారంభం కానున్నది. వ్యవసాయ సీజన్‌ రెండో సంవత్సరం ప్రారంభం నాటికైనా పరిహారం అందుతుందా లేదా అని అన్నదాతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కాకముందే ప్రభుత్వం ప్రకటించిన విధంగా తమకు పరిహారము వెంటనే విడుదల చేయాలని మండల అన్నదాతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Spread the love