ఏపీలో నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూపులు

ఏపీలో నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురుచూపులు– రేపోమాపో అంటూ సాగదీత
– అసంతృప్తిలో ‘అధికార పార్టీ’ నేతలు
అమరావతి: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్‌ పదవుల కోసం టిడిపి కూటమి నేతలు ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచినా.. ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. రేపోమాపో అంటూ సాగదీయటంతో కొంతమంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్‌ పోస్టుల కోసం చూస్తున్న ఆశావహులు తమ బయోడేటాను పార్టీ కార్యాలయంలోని ప్రోగ్రామ్స్‌ కమిటీకి అందించాలని టిడిపి అధిష్టానం నెలన్నర క్రితం ఆ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రోగ్రామ్స్‌ కమిటీ నాయకుల నుంచి బయోడేటా, దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రోగ్రామ్స్‌ కమిటీకి వచ్చిన బయోడేటాల పరిశీలన కార్యక్రమం టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. దీంతో ఎవరికి ఏ పదవి వస్తుంది? ఎప్పుడు భర్తీ చేస్తారనే అంశం మిగిలిన నేతలకు తెలియడం లేదు. నామినేటెడ్‌ పోస్టుల ఖాళీల వివరాలను సాధారణ పరిపాలనశాఖ అన్ని శాఖల నుంచి సమాచారం జులై మొదటి వారంలో తెప్పించుకుంది. రాష్ట్రంలో పోలీస్‌ శాఖలోని డిఎస్‌పి, సిఐలతోపాటు, ఇతర శాఖల్లో కూడా అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ఈ పోస్టులు ఎమ్మెల్యేల ఇష్ట ప్రకారమే జరుగుతున్నాయని, పదవి లేకపోవడంతో తాము ఏమీ చేయలేకపోతున్నామని శనివారం టిడిపి నేత బుద్ధా వెంకన్న బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బుద్ధా వెంకన్న వంటి నేతలు పార్టీలో మరికొందరు ఉన్నారని, అయితే వారు బయటపడటం లేదనే చర్చ టిడిపిలో నడుస్తోంది.
గ్రీవెన్స్‌లో అధికులు ఆశావహులే!
టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, పార్టీ నేతలు నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌ కార్యక్రమంలో నామినేటెడ్‌ ఆశావహుల దరఖాస్తులే ఎక్కువగా ఉంటున్నాయనే చర్చ టిడిపిలో జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావేదిక పేరుతో ఈ గ్రీవెన్స్‌ కార్యక్రమం మొదలుపెట్టారు. సమస్యలు చెప్పుకునేందుకు ఎంతమంది వస్తున్నారో అంతే సంఖ్యలో పదవుల కోసమూ వస్తున్నారు. దీంతో గ్రీవెన్స్‌ కోసం వస్తున్న వారితో పార్టీ కార్యాలయం కిక్కిరిసిపోతుందని నేతలు భావిస్తున్నారు. ప్రతి శనివారం ముఖ్యమంత్రి వచ్చే సమయంలో వస్తున్న ప్రజలను భద్రతా సిబ్బంది నియంత్రించలేకపోతోంది. ముఖ్యమంత్రి కూడా గంటల తరబడి నిలబడే వారి నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీ జరిగితే పార్టీ కార్యాలయానికి వచ్చే నేతలు, ప్రజలు తగ్గుతారని నేతలు భావిస్తున్నారు.
సీనియర్లు చూపు ‘నామినేటెడ్‌’ వైపే..
టిడిపిలో సీనియర్‌ నేతలు సైతం కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులను ఆశిస్తున్నారు. ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా టికెట్లు త్యాగం చేసిన నేతలు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కోసం సీటు త్యాగం చేసిన నేతలు ఈ విభాగంలో ఉన్నారు. సాధారణంగా వీరు ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి పదవులు ఆశిస్తారు. ఈ రెండు కూడా రెండేళ్ల వరకు భర్తీ అయ్యే అవకాశం లేదు. శాసనమండలిలో వచ్చే ఏడాది కేవలం నాలుగు స్థానాలు మాత్రమే ఖాళీ కానున్నాయి. వీటిల్లో టిడిపి సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడుతోపాటు చిక్కాల రామచంద్రరావు, బిటి నాయుడు, పి అశోక్‌ బాబు ఉన్నారు. 2027లో భారీ సంఖ్య లో భర్తీ కానున్నాయి. రాజ్యసభ స్థానాలు 2026లో నాలుగు ఖాళీ కానున్నాయి. పదవులు లేకుండా అప్పటి వరకు ఉండటం నేతలు కష్టంగా భావిస్తున్నారు. కావున ముందు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీ అడగాలని భావిస్తున్నారు.
కూటమిలో పార్టీలకు పంపకాలు ఫార్ములా..!
టిడిపి కూటమిలో నామినేటెడ్‌ పదవుల పంపకాలు కొలిక్కొచ్చినట్లు సమాచారం. టిడిపి గెలిచిన నియోజకవర్గాల్లో ఆ పార్టీకి 60 శాతం, జనసేనకు 30 శాతం, బిజెపికి 10 శాతం చొప్పున పదవులు పంపకాలు చేయాలని మూడు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జనసేన గెలిచిన నియోజకవర్గాల్లో జనసేనకు 60 శాతం, టిడిపికి 30 శాతం, బిజెపికి 10 శాతం చొప్పున, బిజెపి గెలిచిన నియోజకవర్గాల్లో బిజెపికి 60 శాతం, టిడిపికి 30 శాతం, జనసేనకు 10 శాతం పంపకాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Spread the love