వాంగ్‌చుక్‌ నిరవధిక దీక్ష

Wangchuk's Indefinite Initiation– అనుమతి నిరాకరించిన పోలీసులు
– తమను నిర్బంధించిన లడక్‌ భవన్‌లోనే దీక్ష ప్రారంభించిన పర్యావరణ కార్యకర్తలు
న్యూఢిల్లీ: వాతావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌ఛుక్‌, ఆయన మద్దతుదారులు ఆదివారం దేశ రాజధానిలో నిరవధిక దీక్షను చేపట్టారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుచెప్పినప్పటికీ వారంతా అందుకు సిద్ధపడ్డారు. గత నాలుగు రోజులుగా తమను నిర్బంధించిన లడఖ్‌ భవన్‌లోనే దీక్ష ప్రారంభించామని వాంగ్‌ఛుక్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు. తామంతా 70 ఏండ్ల పైబడిన వారమేనని, మహిళలతో సహా అనేక మంది 32 రోజుల పాటు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర చేసి లెV్‌ా నుంచి ఢిల్లీ చేరుకున్నామని ఆయన వివరించారు. గాంధీజీ చూపిన మార్గాన్ని అనుసరించేందుకు ఆయన దేశంలోనే ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయని ప్రశ్నించారు. లడఖ్‌లో ఆరో షెడ్యూల్‌ అమలు సహా వివిధ అంశాలపై ప్రధాని, రాష్ట్రపతి లేదా హోం మంత్రితో చర్చించేందుకు తేదీలను నిర్ణయించాల్సిందిగా వాంగ్‌ఛుక్‌, ఇతర కార్యకర్తలు ప్రభుత్వానికి సమాచారం పంపారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నిరవధిక దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కనీసం ఒక నాయకుడితో అయినా సమావేశం అవుతామని హోం మంత్రిత్వ శాఖ హామీ ఇవ్వడంతో వాంగ్‌ఛుక్‌ బృందం ఈ నెల 2వ తేదీన రాజ్‌ఘాట్‌లో 48 గంటల దీక్షను విరమించింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం అందకపోవడంతో దీక్షను తిరిగి ప్రారంభించాలని వాతావరణ కార్యకర్తలు నిర్ణయించారు. దీక్షకు అనుమతి నిరాకరిస్తూ ఆదివారం ఉదయమే వాంగ్‌ఛుక్‌కు లేఖ అందింది. ‘జంతర్‌ మంతర్‌లో దీక్షకు అనుమతించకపోతే వేరే ప్రదేశాన్ని చూపాలని కోరాం. అన్ని చట్టాలకు కట్టుబడి ఉంటామని చెప్పాం. శాంతియుతంగా తమ సమస్యలు చెప్పుకుంటామని అన్నాం. అలాంటప్పుడు గాంధీ మార్గాన్ని అనుసరించడానికి ఆయన దేశంలోనే ఎందుకు ఇబ్బంది వస్తుంది?’ అని వాంగ్‌ఛుక్‌ ప్రశ్నించారు.

Spread the love