మరింత తీవ్రస్థాయికి యుద్ధం..!

– రష్యా సరిహద్దుల్లో సైన్యం మోహరింపు
– నాటో సైనిక కూటమి సన్నహాలు
న్యూయార్క్‌ : ఈ నెల 11-12 తేదీల్లో లిథ్యూనియా రాజధాని విల్నియస్‌లో నాటో దేశాల శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌ యుద్ధాన్ని మరింత తీవ్రస్థాయికి తీసుకు రావాలని, సైనిక వ్యయాన్ని పెంచాలని, రష్యా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించాలని నిర్ణయాలు చేసేందుకు నాటో సైనిక కూటమి సన్నహాలు చేస్తోంది. 2022 జూన్‌లో జరిగిన గత శిఖరాగ్ర సమా వేశంలో ”పూర్తి స్థాయిలో రక్షణ దళాలను పంపాలి” అని నిర్ణయం చేశారు.
ఉక్రెయిన్‌ సైన్యం కొనసాగిస్తున్న ప్రతిదాడి ఆశించిన ఫలితాలను సాధించ టంలో విఫలమవుతున్న స్థితిలో యుద్ధంలో నాటో ప్రత్యక్షంగా పాల్గొని రష్యా ‘వెన్ను విరవాలి’ అన్న భావనతోవున్న వాళ్ళపై వత్తిడి ఎక్కువవుతోంది. ఇటువంటి ఉద్రిక్త వాతా వరణం నేపథ్యంలో జాపోర్జిజియా అణువిద్యుత్‌ కేంద్రాన్ని పేల్చాలనే లక్ష్యంతో రష్యా మందు పాతర లను పెడుతోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు, వ్లాదీమీర్‌ జెలెన్‌ స్కీ ఆరోపి స్తున్నారు. జెలెన్‌ స్కీ ఆరోపణలకు భిన్నంగా తమ పర్యవేక్షణలోవున్న జపోర్జిజియా అణు విద్యుత్‌ ప్లాంటు మీద అటువంటి మందు పాతరలుగానీ, మరే ఇతర పేలుడు పదార్థాలుగానీ లేవని అంతర్జాతీయ ఆటమిక్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జన రల్‌, రాఫెయిల్‌ మరియానో గ్రోస్సి ప్రకటించాడు.
జెలెన్‌ స్కీ ఆరోపణల వెనుక ఏదో ఒక సంఘటన జరిగేలా చేసి లేదా ఎలాగోలా రెచ్చగొట్టి ఉక్రెయిన్‌ యుద్ధంలో నాటో సైనిక దళాలు ప్రత్యక్షం గా పాల్గొనేలా చేయాలనే లక్ష్యం ఉందనేది సుస్పష్టం. అణ్వస్త్ర సంబంధిత సంఘటన ఏమి జరిగినా అది ఉక్రెయిన్‌ యుద్ధంలో నాటో ప్రత్యక్షంగా పాల్గొన టానికి దారితీస్తుందని, అది ఉక్రెయిన్‌ కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుని యుద్ధాన్ని వేగంగా ముగించేదాకా సాగుతుందని నాటోలో అమెరికా రాయబారిగావున్న ఇవో డాల్డర్‌ పొలిటికో లో రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. జర్మనీ-రష్యాల నార్డ్‌ స్ట్రీమ్‌ గ్యాస్‌ పైప్‌ లైన్‌ను పేల్చివేయటంలో అమెరికా, ఉక్రెయిన్‌లకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఫిబ్రవరిలో ప్రముఖ జర్నలిస్టు సేమౌర్‌ హెర్ష్‌ రాశారు. ఏదోలా ప్రత్యక్ష జోక్యం చేసుకోవటానికి అమెరికా రెచ్చగొట్టే చర్యలకు దిగటం చారిత్రక సత్యమని అందరికీ తెలుసు: 1898లో హవానా ఒడరేవులోవున్న యూఎస్‌ఎస్‌ మైనే అనే యుద్ధ నౌకలో జరిగిన పేలుడును యుద్ధ చర్యగా ఉపయోగించటంతో స్పానిష్‌-అమెరికా యుద్ధం మొదలైంది. క్యూబా, ఫిలిఫైన్స్‌లో అమెరికా సైన్యాన్ని దింపింది. 1964లో వియత్నాం యుద్ధం లో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనటానికి దారితీసిన గల్ఫ్‌ ఆఫ్‌ టోన్కిన్‌ సంఘటన ఒక బూటకం. 2001 సెప్టెంబర్‌ 11 సంఘటనతో ఆఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌ పైన అమెరికా చేసిన యుద్ధాలు, మొత్తం ”టెర్రర్‌ పై యుద్ధం” బూటకాలే. యుద్ధం ఎంత తీవ్రతరమైతే బూటకం అంత పచ్చిగాను, నిస్సిగ్గుగాను ఉంటుంది. రెచ్చగొట్టటం, మీడియాలో పచ్చి అబద్దాలను ప్రచారం చేయటం ద్వారా యుద్ధానికి ప్రజల మద్దతును కూడగట్టి దురాక్రణకు దిగటం అమెరికా అధ్యక్ష భవనానికి వెన్నతో పెట్టిన విద్య.
అటువంటి రెచ్చగొట్టే సంఘటన నాటో శిఖరాగ్ర సభ జరగటానికి ముందే సంభవించే అవ కాశం ఎంతవరకు ఉందనేది ఇంకా తేలలేదు. అయితే అమెరికా, రష్యాల సంఘర్షణ మరింత తీవ్ర తరం కావటానికి నాటో శిఖరాగ్ర సభను ఉపయో గించటం జరుగుతుందనే విషయం సుస్పష్టంగా కనపడుతున్నది. నాటో శిఖరాగ్ర సభకు ముందు ఉక్రెయిన్‌ తను కోల్పోయిన క్రైమియా తదితర ప్రాంతాలను తిరిగి జయించటానికి అమెరికా సైని కంగా రష్యాతో తలపడాలని పదవీ విరమణ చేసిన కొందరు సైనికాధికారుల, విదేశాంగ శాఖలో పని చేసిన అధికారుల గ్రూపు ఒక లేఖ ద్వారా అమెరికా అధ్యక్షుడిని కోరటం ఈ కుతంత్రంలో భాగమే.

Spread the love