– మూసీ పునరుజ్జీవం కమీషన్ల కోసమేనని మండిపాటు
– కేంద్ర ప్రభుత్వ ఆవాస్ యోజనతోనే ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం : కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులు ఎంపీ బండి సంజయ్
నవతెలంగాణ-బెజ్జంకి
సమగ్ర ఇంటింటి సర్వే అనంతరం కేంద్ర ప్రభుత్వంపై యుద్దం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం విడ్డూరమని కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది యుద్దం కాదని.. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన సంఘ ఎల్లవ్వ ఆనారోగ్యంతో బాధపడుతుండటంతో బండి సంజయ్.. బాధితురాలి కుటుంబ సభ్యులను బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల, మత, వర్గ భేదం లేకుండా దేశ ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నందుకు యుద్ధం చేస్తారా.. లేకా నరేంద్ర మోడీని ప్రధానిగా తొలగించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి యుద్దం చేస్తారా అని ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. మూసీ పునరుజ్జీవం కమీషన్ల కోసమేనని.. మూసీకి కేటాయించిన రూ.1.50 లక్షల కోట్లతో ప్రజా సమస్యలన్నీ పరిష్కారించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అవాస్ యోజనతో ఇందిరమ్మ ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్.. పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వరదలు వచ్చినప్పుడు, ఉద్యోగుల, హైడ్రా, మూసీ సమస్యల పరిష్కారానికి బయటకు రారని.. కుటుంబ సభ్యులకు సమస్యలు వస్తేనే బయటకు వస్తారని అన్నారు. నాయకుడులేని నావలా బీఆర్‌ఎస్ తయారైందని అసహనం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్‌ను అహంకారంతోనే ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. ఇప్పటికైన బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచి సమస్యల పరిష్కారానికి, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యమవ్వాలని సూచించారు.