ముస్లిం కోటా రాజకీయాలపై మాటల యుద్ధం !

రాయబరేలి: సంపద పున:పంపిణీ, వారసత్వపు పన్ను విధించడం వంటి అంశాలతోపాటూ ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై కూడా బిజెపి, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముస్లింలకు రిజర్వేషన్ల కోటాపై తన వైఖరి ఏమిటో కాంగ్రెస్‌ తెలియచేయాలని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఒక ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో 400కి పైగా సీట్లను గెలిచి తిరుగులేని మెజారిటీ సాధించాలని బిజెపి కోరుకుంటోందని, ఆ మెజారిటీని అడ్డు పెట్టుకుని రాజ్యాంగంలో మార్పులు చేయడానికి చూస్తోందని, కులాల ప్రాతిపదిక రిజర్వేషన్లను సమీక్షించాలని చూస్తోందని కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు బీజేపీ ని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మతం ఆధారంగా రిజర్వేషన్లను తీసుకురావడంపై బీజేపీ స్పందించింది. మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లను ఎప్పటికీ ఇవ్వబోమని కాంగ్రెస్‌ పార్టీ, రాహుల్‌ గాంధీలు రాతపూర్వకంగా రాసి ఇవ్వాలని అలాగే రాజ్యాంగాన్ని మార్చబోమని ప్రతిన చేయాలని ప్రధాని సవాలు చేశారు. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలకు ప్రస్తుతమున్న రిజర్వేషన్లను కుదించాలని బీజేపీ కోరుకుంటోందంటూ ప్రతిపక్షాలు వదంతులను, అసత్య ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని మోడీ విమర్శించారు. దానిపై కాంగ్రెస్‌ స్పందిస్తూ, ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధాలు కలిగిన మ్యాగజైన్‌ ది ఆర్గనైజర్‌లో 1949లో ప్రచురితమైన ఒక వ్యాసాన్ని ప్రస్తావించింది. మనుస్మృతి వంటి చట్టపరమైన గ్రంథాలను రాజ్యాంగం విస్మరించిందంటూ ఆ వ్యాసం పేర్కొందని గుర్తు చేసింది. నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేటపుడు, బహిరంగ సభల్లో రాజ్యాంగానికి సంబంధించి కాపీని తమతో పాటు వుంచుకోవాల్సిందిగా కాంగ్రెస్‌ అభ్యర్ధులను రాహుల్‌ గాంధీ కోరారు. ఇక సంపద పున: పంపిణీ అంశానికి సంబంధించినంతవరకు, ప్రధాని మోడీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్‌ నేతలందరూ సోషల్‌ మీడియా మాధ్యమం ద్వారా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ప్రజల్లో బాగా ప్రచారమైన ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేసేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తోంది.
రాయబరేలిపైనే అందరి చూపు
రాయబరేలిలో పోటీ చేయనున్న అభ్యర్ధుల ప్రకటనపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కాంగ్రెస్‌, బీజేపీ రెండు పార్టీలు ఇక్కడ అభ్యర్ధులను ఇంకా ప్రకటించాల్సి వుంది. కాంగ్రెస్‌ ప్రకటించిన తర్వాతనే తమ పార్టీ అభ్యర్ధిని ప్రకటిస్తుందని ఇప్పటికే అమిత్‌ షా ప్రకటించారు. తమ పార్టీకి మూడు అవకాశాలు వున్నాయని, కాంగ్రెస్‌ ప్రకటించగానే తాము వెంటనే ప్రకటిస్తామని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Spread the love