వారెన్‌ బఫెట్‌ వ్యాపారవేత చార్లీ ముంగేర్‌ కన్నుమూత

నవతెలంగాణ- హైదరాబాద్ : ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌ కు అత్యంత నమ్మకస్తుడు, వ్యాపార భాగస్వామి అయిన చార్లీ ముంగేర్‌  కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 99 ఏళ్లు. కాలిఫోర్నియాలోని ఓ ఆసుపత్రిలో మంగళవారం మరణించినట్లు వారెన్‌ బఫెట్‌ హోల్డింగ్‌ కంపెనీ బెర్క్‌షైర్‌ హత్‌వే  ఓ ప్రకటనలో తెలిపింది. ముంగేర్‌ మరణంపై వారన్‌ బఫెట్‌ కూడా స్పందించారు. బెర్క్‌షైర్‌ హత్‌వే ఈ స్థాయికి చేరడానికి చార్లీ సహకారం మర్చిపోలేనిదన్నారు. ‘చార్లీ స్ఫూర్తి, జ్ఞానం, సహకారం లేకుండా బెర్క్‌షైర్‌ హత్‌వే ఈ స్థాయికి చేరుకోలేదు’ అని అన్నారు. వారెన్‌ బఫెట్‌కు చార్లీ ముంగేర్‌ కుడి భుజం లాంటివాడు. దాదాపు 60 ఏళ్లుగా ఎంతో నమ్మకస్తుడిగా మెలిగాడు. వీరిద్దరూ 1959లో మొదటిసారి కలుసుకున్నారు. 1978లో బెర్క్‌షైర్‌ హత్‌వే వైస్‌ చైర్మన్‌గా చార్లీ బాధ్యతలు చేపట్టారు. బెర్క్‌షైర్‌ హత్‌వేను ఓ టెక్స్‌టైల్‌ కంపెనీ నుంచి దాదాపు రూ.64 కోట్ల విలువైన సంస్థగా మార్చడంలో ముంగేర్‌ కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు సంస్థలో అదిపెద్ద వాటాదారులో ఒకరిగా ఉన్నారు. మరోవైపు చార్లీ మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. యాపిల్‌ సీఈవో (Apple CEO) టిమ్‌ కుక్‌ (Tim Cook) సైతం చార్లీకి నివాళులర్పించారు. ‘వ్యాపారంతోపాటు ఆయన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చార్లీ బాగా పరిశీలిస్తాడు. సంస్థను నిర్మించడంలో ఆయన నైపుణ్యాలు ఇతరులకు ప్రేరణగా ఉండేవి. ఇకపై ఆయన్ని బాగా మిస్‌ అవుతాం’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Spread the love